
📌 Key Points
- వెంకటేష్ ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రానికి హీరోయిన్ ఎంపిక పెద్ద సవాలుగా మారింది.
- ఐశ్వర్యారాయ్ కథ నచ్చినా చివరి నిమిషంలో సినిమా నుండి తప్పుకుంది.
- అనిల్ కపూర్ ఇచ్చిన సలహాతో లిరిల్ యాడ్ అమ్మాయి ప్రీతి జింటా ఎంపికైంది.
- ప్రీతి జింటా ఎంట్రీతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
వెంకటేష్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ప్రేమంటే ఇదేరా’ వెనుక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా అనుకున్నా, చివరికి అనిల్ కపూర్ సలహాతో ప్రీతి జింటా సెట్టయ్యింది. ఈ సినిమా హీరోయిన్ ఎంపిక టెన్షన్ వెనుక దాగి ఉన్న అసలు కథను తెలుసుకోండి.
వెంకటేష్ చిత్రానికి హీరోయిన్ కష్టాలు
విక్టరీ వెంకటేష్ అప్పట్లో అత్యంత సక్సెస్ ఫుల్ హీరోగా రాణించారు. కానీ ఇటీవల కాలంలో వరుస పరాజయాలను ఎదుర్కొన్నారు. అయితే ఈ ఏడాది `సంక్రాంతికి వస్తున్నాం` మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నారు. ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిందీ మూవీ. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా వెళ్తున్నారు వెంకీ. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో `ఆదర్శ కుటుంబం`(ఏకే47) చిత్రంలో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బస్టర్ మూవీ `ప్రేమంటే ఇదేరా`ని రీ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు జయంత్ సీ పరాన్జీ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో వెంకటేష్‌కి జోడీగా ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఆమెకంటే ముందు చాలా మంది హీరోయిన్లని అనుకున్నారు. అందులో ఐశ్వర్యా రాయ్‌ని తీసుకోవాలనుకున్నారు. ఆమెకి కథ నచ్చింది. ఓకే చేసింది. ఆ తర్వాత హ్యాండించింది.
ఐశ్వర్యారాయ్ నుండి ప్రీతి జింటా వరకు
దీంతో మళ్లీ హీరోయిన్ కోసం కష్టాలు తప్పలేదు. ఓ దశలో రేణు దేశాయ్ ని కూడా ఆడిషన్ చేశారు. అయినా సెట్ కాలేదు, నలుగురు ఐదుగురు హీరోయిన్లని అనుకున్నారు. వర్కౌట్ కాలేదు. దీంతో దర్శకుడు జయంత్ సీ పరాన్జీకి ఏం చేయాలో తోచలేదు. అప్పటికే సినిమా ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇంకా మూడు రోజుల్లోనే ప్రారంభం ఉంది. ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు, రాజీపడుతున్నామా అనే సందేహం దర్శకుడిలో ఉంది. ఏం తోచని స్థితిలో ఆయన రామానాయుడు స్టూడియోలో చెట్టుకింద కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో ఓ కార్ ఆయన ముందు వచ్చి ఆగిందట.
దర్శకుడు జయంత్ ముందు ఆగిన కారు బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్‌ది. ఆయన దిగి ఏంటి జయంత్, ఏదో బాధలో ఉన్నావని పలకరించారట. దీంతో అసలు విషయం చెప్పాడు దర్శకుడు. అరే అంత టెన్షన్ ఎందుకు, లిరిల్ యాడ్ అమ్మాయిని చూశావా?, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకోకూడదని చెప్పాడట. జయంత్‌కి ఐడియా నచ్చింది. ఓకే చెప్పాడు. అనిల్ కపూర్ వెంటనే మేనేజర్‌కి ఫోన్ చేసి ఆ అమ్మాయి డిటెయిల్స్ కనుకున్నారు. మీటింగ్ అరెంజ్ చేశాడు. నెక్ట్స్ డేనే జయంత్ ముంబయికి వెళ్లాడు. అక్కడ ప్రీతి ఏదో యాడ్ షూట్‌లో ఉంది. చూడటం, నచ్చడం, ఓకే చేయడం వెంటవెంటనే జరిగిపోయిందట.
అనిల్ కపూర్ సలహా, సినిమాకు టర్నింగ్ పాయింట్
అలా అనిల్ కపూర్ వల్ల `ప్రేమంటే ఇదేరా` మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్‌గా ప్రీతి జింటా సెట్ అయ్యింది. ఈ మూవీ అద్భుతమైన లవ్ స్టోరీగా రూపొంది బ్లాక్ బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే స్టార్ అయిపోయింది ప్రీతి. ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి పెద్ద స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఈ సినిమా విజయాన్ని చూసి ఆ తర్వాత ఐశ్వర్య రియలైజ్ అయ్యిందట. అయితే ఐష్ ఈ మూవీ రిజెక్ట్ చేయడానికి కారణం అప్పుడే హిందీలో చేసిన సినిమాలు ఆడలేదు. ఆ బాధలో ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. ఆమె నో చెప్పడంతో ఆ ఛాన్స్ ప్రీతికి వెళ్లింది, ఆమె లైఫే మారిపోయింది. ఇది ఓ రకంగా ఐష్‌కి పెద్ద షాక్ అనే చెప్పాలి.
ఒక స్టార్ హీరో ఇచ్చిన సలహా, ఒక యాడ్ ద్వారా వచ్చిన ఐడియా వెంకటేష్ కెరీర్‌లో నిలిచిపోయే బ్లాక్‌బస్టర్ సినిమాకు హీరోయిన్‌ని అందించింది. అనుకోని మలుపులతో ‘ప్రేమంటే ఇదేరా’ హీరోయిన్ ఎంపిక సినీ చరిత్రలో గుర్తుండిపోతుంది.


