|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ సంచలనం: ఒకేసారి రెండు స్థానాల్లో పోటీ! టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల!

Published: 29-03-2026, 3:35 AM
విజయ్ సంచలనం: ఒకేసారి రెండు స్థానాల్లో పోటీ! టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల!
  • తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీవీకే అధినేత విజయ్.
  • చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ స్థానాల నుంచి విజయ్ పోటీ.
  • అవినీతి రహిత పాలన అందిస్తామని విజయ్ హామీ.
  • నిరుద్యోగులకు నెలకు రూ.4000 భృతి ఇస్తామని ప్రకటన.

తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ సంచలన ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అంతేకాకుండా, విజయ్ స్వయంగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు.

టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన విజయ్

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతూ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, దళపతి విజయ్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. ఆదివారం చెన్నైలో భారీ భద్రత మధ్య జరిగిన కార్యక్రమంలో తన పార్టీ అభ్యర్థుల పూర్తి జాబితాను ఆయన ప్రకటించారు. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ జాబితా విడుదల రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది.

నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. చెన్నైలోని పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గ స్థానాల నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. పార్టీలోని సీనియర్ నాయకులకు కీలక స్థానాలను విజయ్ కేటాయించారు. సీనియర్ నేతలు ఎన్. ఆనంద్, ఆధవ్ అర్జున, కె.ఎ. సెంగోట్టయన్, సి.టి.ఆర్. నిర్మల్ కుమార్‌లను వివిధ స్థానాల నుంచి అభ్యర్థులుగా ప్రకటించారు. తన పేరును నామినేషన్ పత్రాల్లో సి. జోసెఫ్ విజయ్ గా పేర్కొంటానని ఆయన స్పష్టం చేశారు. పార్టీ ఎన్నికల గుర్తు అయిన విజిల్ (Whistle) కు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్న విజయ్

అభ్యర్థుల ఎంపికపై విజయ్ మాట్లాడుతూ.. “ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ప్రజల నిజమైన రక్షకులను మీకు పరిచయం చేస్తున్నాను. మా అభ్యర్థులు సామాన్య నేపథ్యం నుండి వచ్చిన వారు. వీరికి భారీ ఆస్తులు లేదా అధికారం లేదు, కానీ సామాన్యుల కష్టాలు తెలిసిన వారు” అని పేర్కొన్నారు. అనుభవం కంటే చిత్తశుద్ధి, బాధ్యత, ప్రజల పట్ల నిబద్ధత ముఖ్యమని, తాను స్వయంగా ప్రతి అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎంపిక చేశానని ఆయన వివరించారు.

ప్రజలకు విజయ్ ఎన్నికల హామీలు

మిగతా పార్టీల ఎమ్మెల్యేల వలె తమ పార్టీ అభ్యర్థులు అవినీతిపరులు కాదని విజయ్ ఉద్ఘాటించారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయబోమని, మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే మత్తు పదార్థాల రహిత తమిళనాడు (Drug-free Tamil Nadu) నిర్మిస్తామని, కఠినమైన శాంతిభద్రతలను అమలు చేస్తామని వాగ్ధానం చేశారు. టీవీకే అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.4000 భృతిని అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగాల భర్తీలో స్థానికులకే ప్రాధాన్యమిస్తామని, 75 శాతం ఉద్యోగాలను తమిళులకు ఇస్తామని తెలిపారు. యువతకు విద్యకోసం రూ.20లక్షలు ఆర్థికసహాయం అందిస్తామన్నారు. అలాగే తమిళనాడులో వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. సినిమావాళ్లు ఎన్నికల్లో గెలవలేరని విమర్శించారని, అలాంటివారికి తన గెలుపుతోనే సమాధానం చెప్తానన్నారు. ఈ ఎన్నికలు తనకూ, స్టాలిన్ సార్ కు మధ్య జరుగుతున్న ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య యుద్ధమని ఆయన అభివర్ణించారు.

విజయ్ ఎన్నికల హామీలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, మహిళా భద్రత, అవినీతి రహిత పాలన వంటి అంశాలపై ఆయన చేసిన ప్రకటనలు చర్చనీయాంశంగా మారాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.