
📌 Key Points
- హార్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచానికి ఆహార కరవు ముప్పు పొంచి ఉంది.
- ఎరువుల కొరత కారణంగా పంట దిగుబడి 20-30% వరకు తగ్గే అవకాశం ఉంది.
- సహజ వాయువు సరఫరా నిలిచిపోవడంతో ఎరువుల ప్లాంట్లు మూతపడుతున్నాయి.
- రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కంటే ఇది తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీయవచ్చు.
ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాల వలన ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతింటోంది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి మూసివేస్తే ఆహార సంక్షోభం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రపంచ దేశాలను ఆకలితో అలమటించేలా చేస్తుంది.
హార్మూజ్ జలసంధి దిగ్బంధం: ఆహార సంక్షోభం
ఆధునిక ప్రపంచం గత దశాబ్ద కాలంలో ఎన్నో యుద్ధాలను చూసింది. కానీ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ వేదికగా అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మరియు ఇరాన్ మధ్య సాగుతున్న ఘర్షణ కేవలం రెండు వర్గాల మధ్య పోరాటంలా కాకుండా, గ్లోబల్ సప్లై చైన్‌ను కుప్పకూల్చే ‘ఆర్ధిక సునామీ’లా మారనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన మలుపు హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేత. ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) హెచ్చరించినట్లుగా.. ఈ జలసంధి మార్గం మూసుకుపోవడం వల్ల ప్రపంచం ‘మహా ఆహార కరవు’ (Great Food Crisis) అంచున నిలబడే పరిస్థితి ఉందని అంచనా వేస్తున్నారు. యుద్ధం వలన ఇన్నిరోజులు ఎదుర్కొన్న చమురు సంక్షోభంతో ఆగిపోయే సమస్య కాదని.. ఇది ప్రతి మనిషి తినే ఆహారం వరకూ వస్తుందని, కంచంలో కూడును దూరం చేసే పెను సంక్షోభం రాబోతుందని అంటున్నారు.
హర్మూజ్ జలసంధి దిగ్బంధం.. మహా ఎరువుల సంక్షోభం
భౌగోళికంగా హర్మూజ్ జలసంధి ఓమన్ మరియు ఇరాన్ మధ్య ఉన్న ఒక ఇరుకైన సముద్ర మార్గం. ప్రపంచంలో సముద్రం ద్వారా రవాణా అయ్యే ముడి చమురులో 20%, ద్రవీకృత సహజ వాయువులో (LNG) 25% ఈ మార్గం గుండానే వెళ్తాయి. అయితే చమురు కంటే ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా సాగయ్యే పంటలకు అవసరమైన నత్రజని ఎరువులలో (Nitrogen Fertilizers) మూడవ వంతు ఈ మార్గం నుండే ఎగుమతి అవుతాయి. ఇరాన్ తన డ్రోన్లు, క్షిపణులతో ఈ జలసంధిని సమర్థవంతంగా దిగ్బంధించడంతో, గల్ఫ్ దేశాలైన కతర్, సౌదీ అరేబియా, యూఏఈల నుండి రావాల్సిన ఎరువుల నౌకలు ఇప్పటికే నిలిచిపోయాయి.
పంటలు పండని కాలం వస్తుందా?
WTO డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జేన్ మేరీ పౌగమ్ వెల్లడించిన గణాంకాలు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూరియా, అమ్మోనియా వంటి ఎరువుల తయారీకి ‘సహజ వాయువు’ (Natural Gas) ప్రాణాధారం. గల్ఫ్ దేశాలు ఈ గ్యాస్ ఉత్పత్తిలో అగ్రగాములు. హర్మూజ్ మూసివేత వల్ల గ్యాస్ సరఫరా ఎగుమతులు ఆగిపోవడంతో ఎరువుల ప్లాంట్లు మూతపడుతున్నాయి. ఎరువుల సరఫరా తగ్గిపోయి కేవలం రెండు వారాల్లోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు ఏకంగా 40% పైగా పెరిగాయి. మరోవైపు రానున్న రోజుల్లో ఎరువులు అందకపోతే సాగు విస్తీర్ణం తగ్గనుంది. ఇది వరి, గోధుమలు, మొక్కజొన్న వంటి ప్రధాన ఆహార ధాన్యాల దిగుబడిని 20-30% వరకు తగ్గే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల కేవలం గోధుమల సరఫరాకు ఆటంకం కలిగితే, ఇప్పుడు 2026లో ఎరువుల కొరత వల్ల అసలు పంటలే పండని పరిస్థితి ఏర్పడనుందని హెచ్చరికలు అందుతున్నాయి.
ఎరువుల కొరత: పంటలపై ప్రభావం
ఏయే దేశాలకు ఆహార ముప్పు ఉందంటే?
*ఆఫ్రికా.. కోరలు చాస్తున్న ఆహార కొరత
ఆఫ్రికా ఖండంలోని దేశాలు తమ ఎరువుల అవసరాల కోసం ముఖ్యంగా నైట్రోజన్ ఎరువుల కోసం 25% పైగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడతాయి. మలావి, బురుండి వంటి దేశాలు తమ ఎరువుల్లో 60% నుండి 75% వరకు గల్ఫ్ నుండే దిగుమతి చేసుకుంటాయి. సరఫరా ఆగిపోవడంతో అక్కడ పంటల సాగు నిలిచిపోయి, కోట్లాది మంది ఆకలితో అలమటించే ప్రమాదం ఉందని ‘ది గార్డియన్’ పత్రిక నివేదించింది. ఎరువుల ధరలు పెరగడం వల్ల ఇక్కడ బియ్యం, గోధుమల ధరలు ఇప్పటికే 20-40% పెరిగాయి. దీంతో సామాన్యులు ఆకలితో అలమటిస్తున్నారని పేర్కొంది.
భారత్, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దక్షిణాసియా దేశాలు ఇప్పటికే తీవ్ర చమురు సంక్షోభం ఎదుర్కొంటుండగా.. మరికొద్ది నెలల్లో ఎరువుల సంక్షోభం రాబోతోందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశాలకు ఈ యుద్ధం శరాఘాతమే అని చెప్పుకోవాలి. ముఖ్యంగా జూన్ నుండి ప్రారంభమయ్యే ఖరీఫ్ సీజన్ లో రైతులు భారీ ఎరువుల కొరత ఏర్పడనుంది. భారత్‌లోని ఎరువుల కర్మాగారాలు కతర్ నుండి వచ్చే ఎల్‌ఎన్‌జీ (LNG)పై ఆధారపడతాయి. LNG సరఫరా లేక ఇప్పటికే కొన్ని ప్లాంట్లు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించాయి. దీంతో రానున్న రోజుల్లో ఎరువుల ధరలు పెరుగుతాయి. ఫలితంగా వరి, గోధుమలు, కూరగాయల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంక & పాకిస్థాన్ లో ఆహార ధరలు మరో 10-15% పెరిగే అవకాశం ఉందని ‘కీల్ ఇన్స్టిట్యూట్’ అంచనా వేసింది. ఇక బంగ్లాదేశ్ లో ఎరువుల తయారీకి అవసరమైన సహజ వాయువు (LNG) కతర్ నుండి అందకపోవడంతో అనేక ఎరువుల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. దీనివల్ల రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎరువులు అందక, వరి సాగుపై తీవ్ర ప్రభావం పడనున్నట్టు తెలుస్తోంది.
అమెరికా – యూరప్… ద్రవ్యోల్బణం సెగ
ప్రపంచ దేశాలకు ఆహార కరువు ముప్పు
అమెరికా నేరుగా గల్ఫ్ నుండి ఎక్కువ ఎరువులను దిగుమతి చేసుకోకపోయినా, ప్రపంచ మార్కెట్‌లో ధరలు పెరగడం వల్ల అక్కడి రైతులు కూడా నష్టపోతున్నారు. యూరియా ధరలు కేవలం ఒక్క వారంలోనే 32% పెరిగాయని అమెరికా రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇది మొక్కజొన్న (Corn) వంటి పంటల సాగు ఖర్చును పెంచి, వినియోగదారులపై భారాన్ని మోపనుంది. ఇక యూరప్ విషయానికి వస్తే కతర్ నుండి అందాల్సిన ఎల్‌ఎన్‌జీ (LNG) ఆగిపోవడంతో గ్యాస్ ధరలు రెట్టింపు అయ్యాయి. ఇది అక్కడి పరిశ్రమల రంగాన్ని కుదేలు చేస్తోంది.
ఆహార ముప్పు అంచున గల్ఫ్ దేశాలు
ప్రపంచానికి చమురు ఎగుమతి చేసే గల్ఫ్ దేశాలకే ఆశ్చర్యకరంగా ఆహార ముప్పు పొంచి ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే సౌదీ, కతర్, యూఏఈ వంటి దేశాలు తమ ఆహారాన్ని 85% హర్మూజ్ మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటాయి. జలసంధి మూసివేత వల్ల ఆ దేశాల్లో పండ్లు, కూరగాయలు, మాంసం, బియ్యం కొరత తీవ్రంగా ఏర్పడింది.
ఓ వైపు శాంతి మరోవైపు దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పశ్చిమాసియాలో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. హర్మూజ్ జలసంధి మూసివేత కొనసాగితే ప్రపంచ దేశాలు మరింత గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికా దాని ఇతర మిత్రదేశాలు వాణిజ్య నౌకలకు రక్షణగా తమ యుద్ధ నౌకలను రంగంలోకి దించే అవకాశాలున్నప్పటికీ… ఇది ఇరాన్ ను రెచ్చగొట్టడమే అవుతుందని అంటున్నారు. ఎరువుల తయారీలో సహజ వాయువుకు బదులుగా ‘గ్రీన్ అమ్మోనియా’ వంటి ప్రత్యామ్నాయాలపై ప్రపంచం దృష్టి పెడితే ఎరువుల సంక్షోభం నుంచి బయటపడే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి (UN) జోక్యం చేసుకుని ఆహారం, ఎరువుల నౌకలను ‘యుద్ధ రహిత వస్తువులు’గా గుర్తించి వాటికి మార్గాన్ని సుగమం చేసే అవకాశం ఉన్నపటికీ.. ఐరాస ఆదేశాలు, సూచనలను ఇటు అమెరికా, ఇజ్రాయెల్ గాని అటు ఇరాన్ గాని పట్టించుకునే స్థితిలో లేవనేది అక్షరసత్యం.
యుద్ధం ఎక్కడో మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్నా, దాని సెగ మన వంటింటి వరకు చేరుతోంది. ప్రభుత్వం చెప్తున్నట్లుగా ప్రజలు వదంతులను నమ్మకుండా, అందుబాటులో ఉన్న వనరులను పొదుపుగా వాడుకోవడమే మార్గంగా తోస్తోంది. హర్మూజ్ దిగ్బంధం అనేది కేవలం భౌగోళిక రాజకీయ సమస్య కాదు, అది ప్రపంచ మనుగడను స్తంభింప జేస్తున్న సవాలు. దీంతో ఆహార కరవు రాకుండా ఉండాలంటే ప్రపంచ దేశాలు ఏకమై తమ విభేదాలను పక్కన పెట్టి, సముద్ర మార్గాలను తక్షణమే పునరుద్ధరించాలి. లేదంటే ప్రపంచంలో తుపాకుల కంటే ఆకలి చావులే ఎక్కువ ప్రాణాలను బలిగొనే ప్రమాదం ఉంది.
హార్మూజ్ జలసంధి మూసివేత ప్రపంచ ఆహార సరఫరా వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. యుద్ధం యొక్క ప్రభావం కేవలం చమురు సంక్షోభానికి పరిమితం కాకుండా, ప్రతి ఒక్కరి ఆహారంపై తీవ్రంగా పడనుంది.


