
📌 Key Points
- అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ‘యోగాంధ్ర-2026’ పేరుతో ఘనంగా నిర్వహించనున్నారు.
- సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏపీ యోగా ప్రచార పరిషత్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
- కృష్ణా నదిపై భారీ యోగా ఈవెంట్, వాట్సాప్ ద్వారా ఉచిత యోగా వీడియోలు అందుబాటులో.
- పాఠశాలల్లో యోగాను అంతర్భాగం చేస్తూ నారా లోకేష్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వం ‘యోగాంధ్ర-2026’ పేరుతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కృష్ణా నదిపై భారీ ఈవెంట్‌తో నిర్వహించనుంది. ప్రజల్లో ఆరోగ్యం, యోగా పట్ల అవగాహన పెంచడమే లక్ష్యంగా, సీఎం చంద్రబాబు నాయుడు ‘ఏపీ యోగా ప్రచార పరిషత్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. వాట్సాప్ ద్వారా ఉచిత యోగా వీడియోలు అందుబాటులోకి వస్తాయి.
యోగాంధ్ర 2026: కూటమి ప్రభుత్వ ప్రణాళికలు
Yogandhra 2026 : రాష్ట్రంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఈ ఏడాది ‘యోగాంధ్ర-2026’ పేరుతో మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ‘యోగా ఫర్ హెల్తీ ఏజింగ్’ (Yoga for Healthy Aging) అనే విశిష్ట నినాదంతో జూన్ 21న జరగబోయే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ప్రజల్లో ఆరోగ్యం, యోగా పట్ల విస్తృత అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఈ మేరకు అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పూర్తి వివరాలను వెల్లడించారు.రాష్ట్రంలో యోగా కార్యక్రమాలు నిరంతరం కొనసాగేలా, వాటిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘ఏపీ యోగా ప్రచార పరిషత్’ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి ద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేశారని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయన్నారు. ఈ పరిషత్ పరిధిలో 3 ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటవుతాయి.
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో నిర్వహించిన యోగా కార్యక్రమాలకు 2 గిన్నిస్ బుక్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు, ఒక స్కోచ్ అవార్డు దక్కాయని మంత్రి గుర్తుచేశారు. విద్యార్థి దశ నుంచే యోగాపై అవగాహన పెంచేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇప్పటికే పాఠశాలల బోధనలో యోగాను అంతర్భాగం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్త కార్యక్రమాల సమన్వయం కోసం మంగళగిరిలోని ఏపీఐఐసీ (APIIC) లో ప్రత్యేకంగా ఒక ‘వార్ రూం’ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
జూన్ 7వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలోని చారిత్రాత్మక ప్రాంతం ‘లేపాక్షి’ లో యోగా ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జూన్ 7 నుంచి 20 వరకు (రెండు వారాల పాటు) రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తారు. రాష్ట్రంలోని 28 జిల్లాలలో 28 ప్రత్యేక థీమ్‌లతో (ఇతివృత్తాలు) ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఏపీ యోగా ప్రచార పరిషత్: లక్ష్యాలు, ఏర్పాటు
దీనితో పాటు ప్రతి జిల్లాలో రెండు ప్రముఖ పర్యాటక ప్రాంతాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 56 పర్యాటక ప్రదేశాలలో (ఉదాహరణకు: గుంటూరులోని ఉండవల్లి గుహలు, నంద్యాలలోని శ్రీశైలం -మహానంది, నెల్లూరులోని మైపాడు బీచ్, స్వర్ణాల చెరువు మొదలైనవి) రోజుకు కనీసం 500 మందితో భారీ యోగా ప్రదర్శనలు నిర్వహిస్తారు.
జూన్ 7 నుంచి 20వ తేదీ వరకు వివిధ కేటగిరీలలో నాలుగు స్థాయిల్లో యోగా పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు.
పోటీల విభాగాలు : వ్యక్తిగత విభాగం (ఆసనాలు, ప్రాణాయామం), బృంద విభాగం (సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా), మరియు జ్ఞాన ఆధారిత పోటీలు (యోగా క్విజ్, వ్యాసరచన, నినాదాల పోటీలు) ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అమరావతిలో జరిగే ప్రధాన వేడుకకు ఆహ్వానిస్తారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ముగింపు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా కనులపండువగా జరగనున్నాయి. రాజధాని అమరావతిలో కృష్ణా నదిపై నూతనంగా నిర్మించిన వెస్ట్ బైపాస్ వంతెనపై భారీ ఎత్తున రాష్ట్ర స్థాయి కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో ఒకేసారి 25,000 మందితో యోగాసనాల ప్రదర్శన ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా యోగా ప్రచారం: ప్రత్యేక కార్యక్రమాలు
యోగాను ప్రతి ఇంటికీ సులభంగా చేరవేసేందుకు ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు 4 కేటగిరీలలో రూపొందించిన ప్రత్యేక వీడియోలను ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో వివిధ ఆసనాలపై 90 వీడియోలు, రోగ నివారణ ఆసనాలపై 21 వీడియోలు, నిత్య సాధన కోసం 7 సెట్ల వీడియోలు, యోగాపై సందేహాల నివృత్తికి 50 షార్ట్ వీడియోలు ఉన్నాయి.
ప్రజలు తమ మొబైల్ నుంచి 8142404888 అనే వాట్సప్ నంబరుకు ‘Hi’ అని మెసేజ్ పంపితే వెంటనే ఒక క్యూఆర్ (QR) కోడ్ వస్తుంది. దానిని స్కాన్ చేయడం ద్వారా గూగుల్ డ్రైవ్ లింక్ ఓపెన్ అయి వీడియోలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ అధికారిక ‘సంజీవని’ యాప్ ద్వారా కూడా ఈ వీడియోలను వీక్షించవచ్చు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
మొత్తంగా, ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో యోగాను ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని ఆశిస్తున్నారు.


