
📌 Key Points
- ప్రియురాలి కోసం ఇస్లాం మతం స్వీకరించిన ఆయుష్ మాలిక్ తిరిగి హిందూత్వంలోకి.
- తల్లిదండ్రుల బాధను చూసి స్వచ్ఛందంగా మతం మారినట్లు ఆయుష్ ప్రకటన.
- ప్రియురాలు చాందిని ఖురేషీ, ఆమె తండ్రిపై ‘లవ్ జిహాద్’ ఆరోపణలు, అరెస్టు.
- యూపీ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం కింద కేసు నమోదు.
ప్రేమ పేరుతో మతం మారిన ఓ యువకుడు తిరిగి తన సొంత మతంలోకి వచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. ప్రియురాలి కోసం ఇస్లాం స్వీకరించిన ఆయుష్ మాలిక్, ఇప్పుడు తల్లిదండ్రుల బాధను చూసి స్వచ్ఛందంగా హిందూత్వంలోకి వచ్చేశాడు. ఈ కేసులో లవ్ జిహాద్ ఆరోపణలు కూడా ఉన్నాయి.
ప్రేమ పేరుతో మత మార్పిడి
ప్రియురాలి కోసం ఇస్లాం మతం స్వీకరించిన యువకుడు ఇప్పుడు తన కుటుంబం కోసం తిరిగి హిందూత్వంలోకి వచ్చేశాడు. యూపీలోని శామ్లీకి చెందిన ఫార్మాన్యూటికల్ వ్యాపారవేత్త దేవరాజ్ మాలిక్ ఏకైక కుమారుడు ఆయుష్ మాలిక్ (30) తిరిగి హిందూ మతంలోకి మారాడు. తన తల్లిదండ్రులు బాధను చూసి తన ఇష్టపూర్వకంగానే మళ్లీ హిందూత్వంలోకి వచ్చినట్లు ఆయుష్ ప్రకటించాడు. ఆయుష్ నిర్ణయాన్ని అతడి తండ్రి దేవరాజ్ మాలిక్ సైతం ధృవీకరించారు. తన కుమారుడు అధికారికంగా మళ్లీ సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు స్పష్టం చేశాడు.
పోలీసుల FIR వివరాల ప్రకారం బి-ఫార్మా పూర్తి చేసి, తన కుటుంబానికి చెందిన మెడికల్ స్టోర్‌ను చూసుకుంటున్న ఆయుష్‌కు 2018లో చాందిని ఖురేషీతో పరిచయం ఏర్పడింది. కాలి గాయానికి చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి వెళ్లిన సమయంలో ఫిజియోథెరపిస్ట్‌గా అక్కడ పని చేస్తున్న చాందినితో ఆయుష్‌కు స్నేహం కుదిరింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ క్రమంలో అతడు ఇస్లాం లోకి మారేలా చాందిని కుటుంబం ప్రోత్సహించిందని ఆయుశ్ తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు, అరెస్టులు
చాందిని ఖురేషీ, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీలు ఒక పక్కా ప్రణాళిక ప్రకారం తన కొడుకును బ్రెయిన్‌వాష్ చేశారని.. కోట్లాది రూపాయల విలువైన తమ కుటుంబ ఆస్తిని దక్కించుకోవడానికే ఆయుష్‌ను ‘మొహమ్మద్ అలీ’గా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2023లో ఆయుష్‌ను ఢిల్లీకి తీసుకువెళ్లి ఇస్లాంలోకి మార్చడమే కాకుండా.. పేరు మార్చి వివాహం కూడా జరిపించారని ఆరోపించారు. దేవరాజ్ మాలిక్ ఫిర్యాదు ఆధారంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు ‘యూపీ చట్టవిరుద్ధ మతమార్పిడి నిషేధ చట్టం’, అలాగే భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో కొద్ది వారాల క్రితమే ఫిజియోథెరపిస్ట్ చాందిని ఖురేషీని, ఆమె తండ్రి ఇస్లాం ఖురేషీని పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరిగి హిందూత్వంలోకి ఆయుష్
అయితే ఇస్లాం స్వీకరించిన ఆయుశ్ ఆయుష్ గడ్డం పెంచడం, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేయడం, ముస్లిం సంప్రదాయ దుస్తులు ధరించడం వంటివి చేసేవాడని సమాచారం. అయితే ఇస్లాం మతంలోకి మారిన ఆయుశ్ తన తల్లిదండ్రుల బాధను చూసి తాజాగా మనసు మార్చుకున్నట్లు తెలిపారు. తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేయగా అందులో మాట్లాడుతూ కనిపించిన ఆయుశ్.. అమ్మా.. నేను ఇస్లాంను స్వీకరించి నా మతాన్ని మార్చుకున్నాను. మీ బాధను, మన కుటుంబం పడుతున్న బాధను చూశాక ఇప్పుడు నా స్వంత ఇష్టంతోనే తిరిగి నా మతంలోకి వచ్చాను. అమ్మనాన్న ప్రేమ, ఆశీస్సులతో జీవించాలని కోరుకుంటున్నాను. దయచేసి క్షమించండి అంటూ ఈ వీడియోలో పేర్కొన్నారు. అలాగే ఆ వీడియోలో అతడు తన ఇంట్లో ఉన్న పూజగదిలో పూజ, హారతిలో పాల్గొనడం కూడా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున సంచలనంగా మారిన ఆయుశ్ మతమార్పిడి వ్యవహారం అతడి ఘర్ వాపసీతో సుఖాంతం అవుతుందా మరేదైనా ట్విస్ట్ వెలుగులోకి రానుందా చూడాలి.
ఆయుష్ మాలిక్ తిరిగి హిందూత్వంలోకి రావడం మత మార్పిడుల చట్టం, లవ్ జిహాద్ వంటి సున్నితమైన అంశాలపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చింది. కుటుంబ బంధాలకు, వ్యక్తిగత స్వేచ్ఛకు మధ్య ఉన్న సంఘర్షణను ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.


