|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల చిచ్చు: విజయమ్మ బాంబ్, జగన్‌కు షర్మిల సవాల్!

Published: 21-03-2026, 3:05 AM
వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల చిచ్చు: విజయమ్మ బాంబ్, జగన్‌కు షర్మిల సవాల్!
  • వైఎస్ విజయమ్మ అఫిడవిట్‌లో ఆస్తుల పంపిణీపై సంచలన విషయాలు వెల్లడి.
  • జగన్ తన మేనల్లుడు, మేనకోడలికి అన్యాయం చేశారని విజయమ్మ ఆరోపణ.
  • షర్మిలమ్మ, సునీతమ్మ జగన్ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వైసీపీ విమర్శ.
  • ఆస్తుల వివాదం కోర్టుకు చేరడం, పరస్పర విమర్శలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

వైఎస్సార్ కుటుంబ ఆస్తుల పంపకం వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. వైఎస్ విజయమ్మ విడుదల చేసిన అఫిడవిట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ ఆస్తుల పంపిణీలో అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు.

విజయమ్మ అఫిడవిట్‌తో ఆస్తుల చిక్కులు

వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా వైెఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపిణీ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం కోర్టుల్లో నడుస్తోంది. కట్ చేస్తే తాజాగా వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ అఫిడవిట్‌తో కూడిన పత్రం బయటికి రావటం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. క్లారిఫికేషన్ పేరుతో ఈ అఫిడవిట్ రిలీజ్ అయింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించారు.

ఆస్తుల విషయంలో జగన్…. తన మేనకోడలు, మేనల్లుడికి అన్యాయం చేశాడని ఈ అఫిడవిట్ లో వైఎస్ విజయమ్మ పేర్కొన్నట్లు ఉంది. జగన్ … వారికి ఎప్పటికైనా న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు.

సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ షేర్లపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో జగన్, షర్మిల న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇదిలా ఉండగా…సందర్భానుసారంగా వైెఎస్ షర్మిల సోదరుడు జగన్ ను టార్గెట్ చేస్తూ పలు విమర్శలు కూడా గుప్పించారు.

జగన్‌పై విజయమ్మ సంచలన ఆరోపణలు

వైఎస్ ఉన్నంత వరకు ఆస్తుల విభజన ఎప్పుడూ జరగలేదని విజయమ్మ ప్రకటన చేయడంతో వివాదం తీవ్రమైంది. నలుగురు మనవరాళ్లకు అన్ని ఆస్తులను సమానంగా పంచాలనేది వైఎస్సార్ ఉద్దేశమని తాజాగా విడుదలైన అఫిడటవిట్ లో ప్రస్తావించారు.

అవగాహన ఒప్పందంలో పేర్కొన్న ప్రతి ఆస్తి షర్మిలాకు చెందినదని… జగన్ కూడా తన వాటాను గుర్తించి ఒప్పందంపై సంతకం చేశారని ఆమె స్పష్టం చేశారు. సరస్వతి సిమెంట్, బెంగళూరులోని యలహంకలోని భూమితో సహా కీలక ఆస్తులు షర్మిళకు చెందినవి అయినప్పటికీ…. ఎంఓయూలో చేర్చలేదని విజయమ్మ పేర్కొన్నారు.

ఆస్తుల పంపకం జరగలేదు. నిజం ఏమిటో నా దేవుడికి, నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు…? ఈ విషయాలను మళ్లీ మళ్లీ మీడియాలో ప్రస్తావించవద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే ” అంటూ వైఎస్ విజయమ్మ అఫిడవిట్‌‍లో చివర్లో పేర్కొన్నారు.

షర్మిల విమర్శలపై వైసీపీ కౌంటర్ ఎటాక్

ఈ అఫిడవిట్ వ్యవహారంపై వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. గత మూడేళ్లుగా షర్మిళమ్మ, సునీతమ్మ జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారని విమర్శించారు. షర్మిళ హద్దులు దాటి మాట్లాడుతున్నారని…. కుటుంబ సమస్యలను ఇంట్లో పరిష్కరించుకునే ప్రయత్నం చేయకుండా, ప్రత్యర్థుల పత్రికలకు ఎక్కించి తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును రోడ్డున పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిళమ్మ, సునీతమ్మ ఫోన్లు చెక్ చేస్తే వాళ్ల కాల్స్ అన్నీ ఏబీఎన్ రాధాకృష్ణతో మాట్లాడినవే ఉంటాయని వ్యాఖ్యానించారు.

2009లో వైఎస్సార్ మరణానికి ముందు ఆస్తి పంపిణీ జరిగిందని…. ఆప్యాయతతో జగన్ తన సోదరికి తన వాటా కంటే ఎక్కువ ఇచ్చారని శివప్రసాద్ రెడ్డి తెలిపారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని వివరించారు.

జగన్ ను బహిరంగంగా టార్గెట్ చేసే ప్రయత్నాలు జరగడం దురదృష్టకరమని శివప్రసాద్ రెడ్డి అన్నారు. కుటుంబ వివాదాన్ని రాజకీయ ప్రత్యర్థుల వద్దకు తీసుకెళ్లారని…. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేసిందని ఆయన పేర్కొన్నారు.

వైఎస్ కుటుంబంలో ఆస్తుల వివాదం ముదురుతోంది. విజయమ్మ అఫిడవిట్, వైసీపీ విమర్శలు ఈ వ్యవహారాన్ని మరింత వేడిక్కిస్తున్నాయి. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.