|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

42 మంది యువకులకు పెళ్లి పేరుతో భారీ మోసం: అనాథాశ్రమం వధువులంటూ కుచ్చుటోపీ!

Published: 26-05-2026, 6:45 AM
42 మంది యువకులకు పెళ్లి పేరుతో భారీ మోసం: అనాథాశ్రమం వధువులంటూ కుచ్చుటోపీ!
  • మధ్యప్రదేశ్‌లో 42 మంది యువకులను లక్ష్యంగా చేసుకుని భారీ పెళ్లి మోసం వెలుగులోకి.
  • అనాథాశ్రమం అమ్మాయిలతో పెళ్లి చేస్తామంటూ కేటుగాళ్లు నమ్మించి లక్షల్లో డబ్బు వసూలు చేశారు.
  • ఒక్కో కుటుంబం నుంచి రూ.12 వేల నుంచి రూ.25 వేల వరకు దోపిడీకి గురయ్యారు బాధితులు.
  • పెళ్లి రోజున వధువులు రాకపోవడంతో మోసం బయటపడింది, బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

మధ్యప్రదేశ్‌లో 42 మంది యువకులను లక్ష్యంగా చేసుకుని భారీ పెళ్లి మోసం వెలుగుచూసింది. అనాథాశ్రమంలోని అందమైన అమ్మాయిలతో పెళ్లి చేస్తామంటూ కేటుగాళ్లు నమ్మించి, లక్షల్లో డబ్బు వసూలు చేశారు. పెళ్లి రోజున వధువులు రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పెళ్లి పేరుతో 42 కుటుంబాలకు కుచ్చుటోపీ

అనాథాశ్రమంలో ఉన్న అందమైన అమ్మాయిలతో మీ కుమారులకు పెళ్లిళ్లు చేస్తామంటూ నమ్మించిన కేటుగాళ్లు ఏకంగా 42 కుటుంబాలకు కుచ్చుటోపీ పెట్టారు. తాళికట్టేందుకు నేరుగా పెళ్లిపందిట్లోకే రావాలంటూ కబురు పెట్టి అందినకాడికి అమాంతం దోచుకెళ్లారు. తాళి కట్టి తమ భార్యలను ఇంటికి తీసుకు వెళ్దామని ఆశగా వచ్చిన పెళ్లి కొడుకులకు తీవ్ర నిరాశ ఎదురు కాగా ఈ మోసాని చూసి బాధిత కుటుంబాలు నివ్వెరపోయారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‍లో వెలుగు చూసింది.

అందమైన అమ్మాయిల ఫోటోలతో నమ్మించి వసూళ్లు

పోలీసులు, బాధిత కుటుంబాల తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‍లోని ఆయా జిల్లాలకు చెందిన కొందరు తల్లిదండ్రులు తమ కొడుకులకు సరైన సంబంధాలు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సరిగ్గా ఈ పరిస్థితిని ఆసరగా చేసుకున్న కొంత మంది కేటుగాళ్లు ఇండోర్‍లోని ఒక అనాథాశ్రమంలో ఉన్న యువతులతో దేవాస్ నగరంలో మే 25న సామూహిక వివాహాలు జరిపించబోతున్నామని నమ్మించారు. వీరిలో మీ కుమారులకు సరైన జోడి వెతుక్కోండి అంటూ సోషల్ మీడియాలో నుంచి డౌన్ లోడ్ చేసిన అందమైన మోడల్స్, అమ్మాయిల ఫోటోలను వారికి చూపించారు. ఆ ఫోటోలను చూసిన తల్లిదండ్రులు తమకు నచ్చిన అమ్మాయిల ఫోటోలను సెలెక్ట్ చేసుకున్నారు. దాంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఒక్కో వరుడి కుటుంబం నుంచి రూ.12 వేల నుంచి రూ. 25 వేల వరకు ఇలా మొత్తం లక్షల్లో సదరు కేటుగాళ్లు వసూలు చేశారు. మే 25వ తేదీన దేవాస్‍లో జరగబోయే సామూహిక వివాహాలకు పెళ్లి కూతుళ్లను తీసుకువస్తామని మీరంతా నేరుగా 24వ తేదీననే అక్కడికి రావాలని మీకు రాధా గంజ్‍లోని క్లబ్ గ్రౌండ్‍లో వసతి కూడా ఏర్పాటు చేస్తామని ఆ కుటుంబాలకు నమ్మబలికారు.

పెళ్లి పందిట్లో మోసపోయిన యువకులు

ఇన్నాళ్లు సరైన సంబంధాలు దొరకక ఇబ్బంది పడ్డ తమ కుటుంబంలోకి అందమైన అమ్మాయి కోడలుగా రాబోతోందంటూ ఆ 42 కుటుంబాలు ఎంతో సంతోషంతో ఎగిరిగంతేశాయి. నిర్వాకుల మాటలు నమ్మి మే 24వ తేదీ ఉదయమే పెళ్లికొడుకులు, వారి బంధువులు ముస్తాబై దేవాస్‍లోని రాధాగంజ్ క్లబ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లేసరికి పెళ్లి ఏర్పాట్లు కానీ ఆ వాతావరణమే కాదు కనీసం పెళ్లి కూతుళ్ల జాడా ఎక్కడా కనిపించలేదు. దీంతో అక్కడ ఉన్న ఆర్గనైజర్లు ముఖేష్ బైరాగి, అతని భార్య సునీతలను బాధితులు నిలదీయగా..ఇండోర్ నుంచి పెళ్లి కూతుళ్లు బయలుదేరారని ఇదిగో వస్తున్నారు.. ఇదిగో అదిగో అంటూ ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు కాలయాపన చేశారు. చివరకు రాత్రి వేళ ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితులు ముఖేష్ బైరాగి, అతని భార్య సునీతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాలో ముఖేష్ అన్న దినేష్ దాస్ బైరాగి (ఇండోర్ నివాసి), ముఖేష్ మామ నరసింగ్ దాస్ బైరాగి కూడా భాగస్వాములుగా ఉన్నట్లు విచారణలో తేలింది. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులంతా విదిశా జిల్లాకు చెందిన వారని, వారి పూర్తి వివరాల కోసం ఒక బృందాన్ని అక్కడికి పంపామని పేర్కొన్నారు. కోడళ్లతో తిరిగి వెళ్లాలనే ఆశతో దేవాస్‌కు చేరుకున్న ఆ 42 కుటుంబాలకు తీవ్ర నిరాశ ఎదురైంది.

అమాయక యువకులను లక్ష్యంగా చేసుకున్న ఈ పెళ్లి మోసం సమాజంలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు నిందితులను పట్టుకుని బాధితులకు న్యాయం చేయాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.