
📌 Key Points
- ములుగు సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు.
- కంప్యూటర్ సైన్స్, AI, మ్యాథమెటిక్స్, పొలిటికల్ సైన్స్ వంటి విభాగాల్లో ఖాళీలు.
- పీజీలో 55% మార్కులు, యూజీసీ నెట్/స్లెట్/సెట్ అర్హత తప్పనిసరి.
- నెలకు గరిష్టంగా రూ. 50,000 గౌరవ వేతనం, 11 నెలల తాత్కాలిక నియామకం.
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (SSCTU) వివిధ విభాగాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
ములుగు యూనివర్సిటీలో ఉద్యోగాల జాతర
విద్యా రంగంలో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ములుగులో ఉన్న ప్రతిష్టాత్మక సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (SSCTU) 2026-27 విద్యాసంవత్సరానికి గానూ వివిధ విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
యూనివర్సిటీ డీన్ (అకడమిక్స్) ప్రొఫెసర్ జి. రాంరెడ్డి, వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్ నేతృత్వంలో ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ విద్యాసంవత్సరం నుండి ఐఐటీ హైదరాబాద్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వంటి దేశీయ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల భాగస్వామ్యంతో కొత్త టెక్నికల్, హ్యుమానిటీస్ కోర్సులను ఇక్కడ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కింది విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్, పొలిటికల్ సైన్స్ (రాజనీతి శాస్త్రం), పబ్లిక్ పాలసీ (ప్రజా విధానం), డెవలప్‌మెంట్ స్టడీస్, ఎకనామిక్స్ (అర్థశాస్త్రం), ఇంగ్లీష్ (ఆంగ్లం) కోర్సుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దాంతో పాటు యూజీసీ నెట్ లేదా స్లెట్/సెట్ (SLET/SET) అర్హత తప్పనిసరి. పీహెచ్‌డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన (11 నెలల కాలానికి) ఉంటాయి. ఆ తర్వాత పనితీరు, అవసరాలను బట్టి పొడిగించే అవకాశం ఉంటుంది.
అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే!
యూజీసీ (UGC) నిబంధనల ప్రకారం గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రతి పీరియడ్‌కు రూ. 1,500 చొప్పున, నెలకు గరిష్టంగా రూ. 50,000 వరకు గౌరవ వేతనం చెల్లిస్తారు. అసాధారణ విద్యా ప్రతిభ, విస్తృతమైన బోధనా అనుభవం ఉన్న అభ్యర్థులకు మరింత ఉన్నత వేతనాన్ని పరిశీలించే అవకాశం కూడా ఉంది.
ఈ పోస్టుల కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ముందుగా యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ నుండి అప్లికేషన్ ఫామ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని భర్తీ చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తును, మీ రెజ్యూమే (CV) మరియు విద్యా అర్హతల పత్రాలను స్కాన్ చేసి [email protected] ఈమెయిల్ ఐడీకి పంపాలి.
అదేవిధంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన గూగుల్ ఫామ్ (Google Form) లింక్ ద్వారా కూడా వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ 19 జూన్ 2026 (కొన్ని ప్రత్యేక కేటగిరీలకు గడువు జూన్ 21 వరకు పొడిగించే అవకాశం ఉంది, అభ్యర్థులు వెబ్‌సైట్ గమనించగలరు).
ఆసక్తిగల అభ్యర్థులు తమ సీవీతో పాటు సంబంధిత పత్రాల (మార్క్ షీట్లు, డిగ్రీ సర్టిఫికేట్లు, NET/SLET/SET సర్టిఫికేట్, అనుభవ సర్టిఫికెట్లు, వర్తించే చోట కుల/EWS/PwBD సర్టిఫికేట్, మరియు ఇతర సహాయక పత్రాలు) స్కాన్ చేసిన కాపీలను నోటిఫికేషన్‌లో సూచించిన పద్ధతిలో, దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీలోగా సమర్పించవచ్చు.
దరఖాస్తు లో అందించిన సమాచారం అంతా సంపూర్ణంగా, సరిగ్గా ఉందని, సంబంధిత డాక్యుమెంటరీ ఆధారాలతో సమర్థించిందని దరఖాస్తుదారులు నిర్ధారించుకోవాలి. అభ్యర్థులు తమ విద్యా అర్హతలు, అనుభవం, ప్రచురణలు, కేటగిరీ సర్టిఫికేట్లు, ఇతర సంబంధిత ధృవపత్రాలకు సంబంధించిన అన్ని సహాయక పత్రాల స్వీయ-ధృవీకరించిన కాపీలను దరఖాస్తుతో పాటు సమర్పించాలి.
వేతనం, ఇతర ముఖ్య వివరాలు
తదుపరి ఎంపిక ప్రక్రియ కోసం, షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను మాత్రమే విశ్వవిద్యాలయం ఇమెయిల్, /లేదా ఇతర తగిన మార్గాల ద్వారా సంప్రదిస్తుంది. షార్ట్‌లిస్ట్ అవ్వని అభ్యర్థులకు ఎటువంటి ప్రత్యేక సమాచారం ఇవ్వరు.
మరిన్ని పూర్తి వివరాల కోసం అభ్యర్థులు సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం అధికారిక వెబ్‌సైట్ https://ssctu.ac.in ను సందర్శించవచ్చు.
ఈ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ పీడీఎఫ్ చదవండి.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ఈ గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు విద్యా రంగంలో స్థిరపడాలనుకునే వారికి మంచి అవకాశం. అర్హత కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు దరఖాస్తు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనివర్సిటీ కోరింది.


