
📌 Key Points
- గ్యాస్ కొరతను తగ్గించడానికి ఏపీలోని అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం.
- మొదటి దశలో 11,400 ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేసిన ఈఈఎస్ఎల్.
- ఇండక్షన్ స్టవ్‌ల వాడకం ద్వారా సంవత్సరానికి రూ.24 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా.
- రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలపై సీఎం చంద్రబాబు సమీక్ష, బ్లాక్ మార్కెట్‌ను అరికట్టే చర్యలు చేపట్టారు.
రాష్ట్రంలో గ్యాస్ కొరత కొనసాగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ వాడకాన్ని తగ్గించేందుకు రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను పంపిణీ చేయనుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదా అవుతుంది.
అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం
ఓ వైపు రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. చాలా మంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. అయితే గ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) మద్దతుతో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం విభాగం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాలకు 44,346 ఇండక్షన్ స్టవ్‌లను సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫేజ్ I కింద ఈఈఎస్ఎల్ ఇప్పటికే 11,400 ఇండక్షన్ స్టవ్‌లను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసింది. ఈ మేరకు ప్రకటించింది. 1,200-W ఇండక్షన్ స్టవ్‌లకు మారడం వల్ల ఎల్పీజీ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేసింది ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌లో వార్షిక పొదుపు రూ.24 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం వాతావరణంలోకి దాదాపు 28,327 టన్నుల CO₂ విడుదల కాకుండా నిరోధించగలదని అంటున్నారు.
మొదటి దశలో 11,400 స్టవ్‌ల పంపిణీ పూర్తి
ఇండక్షన్ స్టవ్‌లు సాంప్రదాయ ఎల్పీజీ స్టవ్‌ల కంటే దాదాపు 30 శాతం ఎక్కువ ఇంధన-సమర్థవంతమైనవి. అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్‌ల చొరవ కేంద్ర ప్రభుత్వ గో ఎలక్ట్రిక్ ప్రచారానికి అనుగుణంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రొగ్రామ్‌కు మద్దతు ఇచ్చినందుకు, అంగన్‌వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను అందించడానికి సత్వర నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సీఈఓ అఖిలేష్ కుమార్ దీక్షిత్. పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ఈ చర్య ఒక సాహసోపేతమైన అడుగు అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు చేరుతాయని అధికారులు చెబుతున్నారు.
యుద్ద ప్రభావం నేపథ్యంలో రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు.. బుకింగ్, సరఫరా వంటి అంశాలపై ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు సమీక్షించారు. సమావేశానికి వివిధ గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు వివరించారు. BPCL, HPCL. IOCL సంస్థలకు చెందిన 1,154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని అధికారుల వెల్లడించారు.
గ్యాస్ నిల్వలపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే దానిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. గ్యాస్ డెలివరీ సమయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎల్పీజీ విషయంలో ప్రజలు ఆందోళనలు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్న క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్ సరఫరాపై చంద్రబాబు ఆరా తీయగా.. ఎలాంటి ఇబ్బందుల్లేవని అధికారులు తెలిపారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
‘ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాల్లోని రోజువారీ కార్యాకలాపాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. ఎల్పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటళ్ల అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలి. ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా పైప్ లైన్, ఇండక్షన్ స్టవ్స్ ను అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాలి.’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లను అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు అందించడంతో పాటు ఆర్ధికంగా కూడా లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్యాస్ కొరత నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.


