
📌 Key Points
- అనిరుధ్ రవిచందర్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’ పేరుతో కొత్త రికార్డ్ లేబుల్‌ను ప్రారంభించారు.
- ఈ లేబుల్ ద్వారా పాప్, హిప్-హాప్ ఆల్బమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయడానికి యూనివర్సల్ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
- అనిరుధ్ ఈ లేబుల్ ద్వారా కొత్త తరం కళాకారులను ప్రోత్సహించనున్నారు.
- స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ సాధించిన దక్షిణ భారత కళాకారుడిగా అనిరుధ్ నంబర్-1 స్థానంలో ఉన్నారు.
సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’ అనే కొత్త రికార్డ్ లేబుల్‌ను స్థాపించి, ఇండిపెండెంట్ మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టారు. దీని ద్వారా పాప్, హిప్-హాప్ ఆల్బమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి యూనివర్సల్ మ్యూజిక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.
అనిరుధ్ కొత్త రికార్డ్ లేబుల్ ప్రారంభం
Anirudh Ravichander: రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ కొత్త జర్నీ మొదలు పెట్టారు. దక్షిణ భారత సంగీత సంచలనమైన అనిరుధ్ రవిచందర్ ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, ఇండిపెండెంట్ మ్యూజిక్ (Independent Music) రంగంలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇందుకోసం ఆయన ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’ (Albuquerque Records) అనే కొత్త రికార్డ్ లేబుల్‌ను స్థాపించారు. ఈ లేబుల్ ద్వారా వచ్చే పాప్, హిప్-హాప్ మ్యూజిక్ ఆల్బమ్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ‘యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా’ (Universal Music India)తో అనిరుధ్ ఒక ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నారు.
యూనివర్సల్ మ్యూజిక్‌తో అనిరుధ్ ఒప్పందం
ఈ భాగస్వామ్యం ద్వారా అనిరుధ్ (Anirudh Ravichander) రూపొందించే సినిమాయేతర పాటలే కాకుండా, భవిష్యత్తులో ఎంతోమంది ప్రతిభావంతులైన కొత్త తరం కళాకారులను కూడా ఈ లేబుల్ ప్రపంచానికి పరిచయం చేయనుంది. కేవలం తమిళం, తెలుగు మార్కెట్లకే కాకుండా, ఇండియన్ పాప్ (I-Pop) సంగీతాన్ని గ్లోబల్ వేదికపై నిలబెట్టడమే ఈ కూటమి ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. అనిరుధ్ నుంచి రాబోయే మొదటి ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ఈ ఏప్రిల్ లోనే విడుదల కానుండటం విశేషం. ఇప్పటికే స్పాటిఫైలో అత్యధిక స్ట్రీమ్స్ సాధించిన దక్షిణ భారత కళాకారుడిగా నంబర్-1 స్థానంలో ఉన్న అనిరుధ్, ఈ కొత్త అడుగుతో తన క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్తున్నారు. యూనివర్సల్ మ్యూజిక్ ప్రతినిధులు అనిరుధ్‌ను ‘భారతీయ సంగీత భవిష్యత్తు’గా అభివర్ణించగా.. అనిరుధ్ కూడా దేశంలోని స్వతంత్ర ప్రతిభను ప్రపంచ శ్రోతలకు చేరువ చేసేందుకు తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
భారతీయ సంగీత భవిష్యత్తు అని యూనివర్సల్ ప్రశంసలు
ఈ సందర్భంగా అనిరుధ్ రవిచందర్ మాట్లాడుతూ.. ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’ను కళాకారుల ఆధ్వర్యంలో నడిచే స్వదేశీ రికార్డ్ లేబుల్‌గా, స్వతంత్ర ప్రతిభను ప్రోత్సహిస్తూ వారి సంగీతాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లాలనే లక్ష్యంతో స్థాపించాం. పాప్, హిప్-హాప్ సంగీత రంగాల్లో యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా చూపిస్తున్న నాయకత్వం వారిని సహజ భాగస్వామిగా మార్చింది. భారతదేశంలోని స్వతంత్ర కళాకారుల కొత్త తరాన్ని ముందుకు తీసుకువచ్చి, వారి స్వరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలకు పరిచయం చేయడానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు. యూనివర్సల్ మ్యూజిక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సనుజీత్ భుజబల్ మాట్లాడుతూ.. అనిరుధ్ రవిచందర్ చాలా కాలంగా సంగీతం పరంగా తనదైన టాలెంట్‌తో ప్రభావితం చేస్తూ ఒక ప్రముఖ శక్తిగా మారారు. సినిమాల కోసం ఆయన అందించిన అనేక హిట్ పాటలతో పాటు, ఆయన టాలెంట్‌కు తగిన విధంగా ఎంతోమంది అభిమానులను సాధించుకున్నారు. అల్బుకర్క్యూ రికార్డ్స్ పాప్, హిప్-హాప్ ప్రపంచంలో అనిరుధ్ యొక్క ధైర్యవంతమైన కళాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుంది. ఆయన వినూత్నతకు ప్రతీకగా నిలిచిన వారసత్వానికి అనుగుణంగా, ఈ భాగస్వామ్యం మరో వేదికను స్థాపించబోతోందని చెప్పుకొచ్చారు.
అనిరుధ్ రవిచందర్ తన కొత్త రికార్డ్ లేబుల్ ద్వారా భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలి.


