
📌 Key Points
- అన్నారం బ్యారేజీ వద్ద ఇసుక తవ్వకాలు పరిశోధన నిమిత్తం మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు.
- నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సు మేరకు సాంకేతిక పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.
- బ్యారేజీకి ముందు, వెనుక భాగంలో పేరుకుపోయిన ఇసుకను తొలగిస్తున్నారు.
- ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో నిబంధనలకు కట్టుబడి పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
అన్నారం బ్యారేజీ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న తవ్వకాలు కేవలం శాస్త్రీయ పరిశోధనల కోసమేనని వారు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
అన్నారం బ్యారేజీ వద్ద పరిశోధనల కోసమే తవ్వకాలు
అన్నారం బ్యారేజీ వద్ద అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో కొన్ని అకౌంట్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే విషయంపై మహాదేవ్ పూర్ డివిజన్ నెంబర్ 2కి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేశ్ బాబు పూర్తి వివరణ ఇచ్చారు.
ప్రస్తుతం జరుగుతున్న ఇసుక తొలగింపు కార్యక్రమం…. అధికారులు సిఫార్సు మేరకు శాస్త్రీయ పరిశోధనా నిమిత్తం మాత్రమే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సులే కారణం
ఏప్రిల్ 24, 2025 నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) ఇచ్చిన తుది నివేదిక ప్రకారం…. బ్యారేజీకు సంబంధించి సాంకేతిక పరిశోధన చెయ్యాలని సిఫార్సు ఉంది. దీని ప్రకారం… నీటిపారుదల శాఖ భారత ప్రభుత్వ ప్రధాన సంస్థ అయిన పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (CWPRS)ను సంప్రదించింది. జనవరి 2026 లో CWPRS నిపుణులు, బ్యారేజీ స్థలాన్ని సందర్శించి, అక్కడ పరిస్థితులు, దర్యాప్తు సాధ్యమవుతుందా లేదా అనే విషయాన్ని అంచనా వేశారు. ఈ దర్యాప్తు, రాబోయే వర్షాకాలం ముందు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గత కొంత కాలంగా, బ్యారేజీ దగ్గర భారీగా ఇసుక పేరుకుపోయింది. ముఖ్యంగా బ్యారేజీకి ముందు వైపు (నీళ్లు వచ్చే వైపు), బ్యారేజీకి వెనుక వైపు (నీళ్లు వెళ్లే వైపు), గేట్ల మధ్య భాగంలో ఇసుకు ఎక్కువగా ఉందని రమేశ్ బాబు పేర్కొన్నారు. ఈ ఇసుకను తీయకపోతే…. కట్టడం ఎలా ఉందో తనిఖీ చేయలేరని వివరించారు. కొలతలు తీసుకోలేరని… సైంటిఫిక్ టెస్టులు చేయడం కుదరదన్నారు. కేవలం పరిశోధనా నిమిత్తం…. ఎంత మేరకు అవసరమో, అంత ఇసుకను మాత్రమే తీస్తున్నారని స్పష్టం చేశారు.
ఇసుక తొలగింపుపై ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ
అన్నారం బ్యారేజీ దగ్గర అక్రమ ఇసుక తవ్వకాలు జరగడం లేదని తెలిపారు. కేవలం పరీక్షలు చేసే చోట మాత్రమే ఇసుక తీస్తున్నారని… నిపుణుల కమిటీ (NDSA) సూచనల ప్రకారమే పని జరుగుతోందని పేర్కొన్నారు. కుట్ర లేదా కూల్చివేత అని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదుని… అవి కేవలం పుకార్లు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం జరుగుతున్న ఇసుక తొలగింపు పని… నేషనల్ అథారిటీ నిపుణులు ఇచ్చిన సిఫార్సు మేరకు జరుగుతుందని రమేశ్ బాబు తన ప్రకటనలో తెలిపారు. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణలో జరుగుతోందని… నిర్ణీత లోతు వరకే ఇసుక తవ్వుతున్నారని స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ…. ఎల్లప్పుడూ, బ్యారేజీ భద్రతకు నిబంధనలకు కట్టుబడి పనిచేస్తోందన్నారు.
అన్నారం బ్యారేజీ వద్ద జరుగుతున్న ఇసుక తవ్వకాలపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఇరిగేషన్ శాఖ నిబంధనల ప్రకారమే పనులు జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.


