
📌 Key Points
- సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆక్వా ఫీడ్ ధర కేజీకి రూ.4 తగ్గింది.
- ప్రస్తుతం ఎంఆర్‌పీ రూ.112 నుంచి రూ.108కి తగ్గనుంది.
- ఫీడ్ ధర స్థిరీకరణ, కాలుష్య నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు.
- ఆక్వా రంగానికి రూ.1.50కే యూనిట్ విద్యుత్ సరఫరా కొనసాగింపు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. ఫీడ్ ధరల పెంపుతో తలెత్తిన సమస్యలపై దృష్టి సారించిన సీఎం, కేజీకి రూ.4 తగ్గింపునకు ఆదేశించారు. దీంతో రైతులు భారీ ఊరట పొందనున్నారు.
ఆక్వా ఫీడ్ ధర తగ్గింపు: సీఎం ఆదేశాలు
AP Aquaculture : ఆక్వా ఫీడ్ ధరల పెంపుతో గత కొన్ని రోజులుగా తలెత్తిన సమస్యలపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. అటు ఆక్వా రైతులపై అధిక భారం పడకుండా, ఇటు ఫీడ్ తయారీదారులు నష్టపోకుండా ప్రస్తుత ధరపై రూ.4 తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. దీనికి ఫీడ్ తయారీదారులు, ఆక్వా రైతులు అంగీకరించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో ఫీడ్ ధర కేజీకి ఇప్పుడున్న ఎంఆర్‌పీ రూ.112 నుంచి రూ.108కి తగ్గనుంది.
సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులు, ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ధర తగ్గించడంతో పాటు… ఆక్వా ఫీడ్ ధర స్థిరీకరణలో భాగంగా ఆక్వా రైతులు, తయారీదారులు, అధికారులతో ఒక కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. 20 రోజుల్లోగా కమిటీ నివేదిక సమర్పించాలని….. అనంతరం ధరపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారు. ఫీడ్ ధరలతో పాటు, ప్రాసెసింగ్ విధానం, కాలుష్య నియంత్రణ పైనా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ఫీడ్ ధరలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. కేవలం ధరలే కాకుండా, ఆక్వా ప్రాసెసింగ్ విధానం, చెరువుల వల్ల తలెత్తే కాలుష్య నియంత్రణపై కూడా స్పష్టమైన నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ఫీడ్ ధర స్థిరీకరణకు ప్రత్యేక కమిటీ
ఆక్వా సాగును నమ్ముకున్న రంగాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ రెండేళ్ల కాలంలో ఆక్వా సాగుకు రూ.1,543 కోట్ల మేర విద్యుత్ రాయితీని అందించామని తెలిపారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే సరఫరా చేస్తున్నామని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒకప్పుడు కేవలం ఉమ్మడి గోదావరి జిల్లాలకే పరిమితమైన ఆక్వా రంగాన్ని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు తీర ప్రాంతమంతటా విస్తరించేలా గతంలోనే ప్రణాళికలు రూపొందించామని రైతులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సాగుకు ఉపయోగించే ముడిసరుకులు, ఇతర వస్తువుల ధరలు నిరంతరం పెరుగుతున్నా…. ఆక్వా ఉత్పత్తుల మార్కెట్ ధరలు మాత్రం పెరగడం లేదని రైతులు తమ సమస్యలను సీఎంకు విన్నవించారు. ముడిసరుకు రేట్లు పెరిగినప్పుడు ఫీడ్ ధరలు పెంచే కంపెనీలు, మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడు మాత్రం తగ్గించడం లేదని ఆరోపించారు. రొయ్యల చెరువులకు బీమా సౌకర్యం విస్తరించాలని, నర్సరీ పాండ్స్ ఏర్పాటుకు ప్రోత్సాహం అందించాలని, నీటి వనరుల కొరత లేకుండా చూడాలని కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ, సాగు నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.
ఫీడ్ తయారీ కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతూ….. దేశీయంగా సోయాబీన్, ఫిష్ మీల్ వంటి ముడిసరుకుల కొరత తీవ్రంగా ఉందని, అందుకే ధరలు పెంచాల్సి వచ్చిందని వివరించారు. అంతర్జాతీయంగా అమెరికా నుంచి తక్కువ ధరకు లభించే సోయా దిగుమతులకు అనుమతి లేకపోవడంతో, దేశీయంగా రెట్టింపు ధర పెట్టి కొనాల్సి వస్తోందని పేర్కొన్నారు. వాస్తవానికి రూ.20 వరకు పెంచాల్సి ఉన్నా, రైతుల పరిస్థితిని గమనించి కేవలం రూ.12 మాత్రమే పెంచామని చెప్పారు.
ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వ చర్యలు
ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, ఆక్వా ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇతర దేశాలకు మార్కెట్‌ను విస్తరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. నాణ్యత, సర్టిఫికేషన్ విషయంలో రైతులు రాజీ పడకూడదని హెచ్చరించారు. ఇటీవల మిరప పంటలో పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటం వల్ల చైనా దేశం ఎగుమతులను తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేస్తూ…. ఆక్వా రంగంలో అలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
ఆక్వా రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఫీడ్ ధర తగ్గింపు, కమిటీ ఏర్పాటుతో పాటు విద్యుత్ రాయితీలు కొనసాగించడం ద్వారా ఆక్వా రంగానికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది.


