|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఏపీ రైతులకు గుడ్ న్యూస్! ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్!

Published: 11-03-2026, 4:05 AM
ఏపీ రైతులకు గుడ్ న్యూస్! ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటుకు చంద్రబాబు సర్కార్ గ్రీన్ సిగ్నల్!
  • వ్యవసాయానికి ప్రోత్సాహం అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటన.
  • ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్షలు జరుపుతామని తెలిపిన చంద్రబాబు.
  • మార్చి 13న అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత అమలు చేయనున్న ప్రభుత్వం.
  • ఖరీఫ్ సాగు కోసం మే 15న నీటిని విడుదల చేయనున్నట్లు వెల్లడి.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా, మార్చి 13న అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడతను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

వ్యవసాయానికి చేయూత: ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్

6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లకు వివిధ అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వివిధ వర్గాలకు అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయమై ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారం కల్పించేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కీంల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.

ఈ మేరకు అధికారులు-ప్రజాప్రతినిధులు కలిసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. వ్యవసాయానికి ప్రొత్సహమిచ్చేలా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో వ్యవసాయం కోసం అత్యున్నత సంస్థ ఏర్పాటు చేద్దామని అధికారులకు చెప్పారు.

పాలనా సమీక్షలు, సంక్షేమ పథకాలపై సీఎం ఫోకస్

‘ప్రతీ మూడు నెలలకూ పాలనా అంశాలపై సమీక్ష చేసుకుని ముందుకు వెళ్తున్నాం. ఉన్న పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నాం. గతంలో కార్యాలయాల్లో కూర్చుని ఫైల్స్ రాసే పరిస్థితి నుంచి వర్చువల్ పనివిధానాన్ని తీసుకువచ్చాం. గడచిన 20 నెలల్లో కీలకమైన పాలనా మార్పులు తీసుకువచ్చాం. ప్రభుత్వం తీసుకువచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయి. వీటి అమలులో ఉదాసీనత వద్దు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా తీసుకువచ్చిన 10 సూత్రాలు అమలు చేస్తే సుపరిపాలన అందించేందుకు వీలవుతుంది.’ అని చంద్రబాబు అన్నారు.

నిర్దేశిత లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రభావవంతంగా అమలు చేయాలన్నారు సీఎం. సూపర్ సిక్స్ సహా వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయాలని పేర్కొన్నారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా దొర్లకుండా పారదర్శకంగా అమలు చేయాలన్నారు. మార్చి 13 తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని మూడో విడత అమలు చేస్తున్నామని వెల్లడించారు కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము వేస్తుందని చెప్పారు.

అన్నదాత సుఖీభవ, ఖరీఫ్ సాగునీటి విడుదల తేదీలు ఖరారు

‘రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేర్వేరు ప్రతినిధులు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని సమర్ధంగా తీసుకెళ్దాం. ఖరీఫ్ సాగు కోసం మే 15 తేదీన నీటిని విడుదల చేస్తున్నాం. సీజన్లో ముందుగానే నీరు ఇస్తాం. ఉగాది కానుకగా 2.50 లక్షల లబ్దిదారులకు సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తాం. ఇంద్ర ధనస్సు పేరిట దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాలు అమలు చేస్తున్నాం. గత పాలనలో ట్రూ ఆప్ పేరిట విద్యుత్ చార్జీల భారం వేశారు. తొలిసారి ట్రూ డౌన్ చేశాం. 4600 కోట్ల రూపాయల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. ఈ ఏడాది 39 పైసల మేర విద్యుత్ కొనుగోలు ధర తగ్గిస్తాం. కుసుమ్ కింద 3 లక్షల పంప్ సెట్లు ఇస్తున్నాం. సబ్ స్టేషన్ యూనిట్‌గా మైక్రో గ్రిడ్ ఏర్పాటుతో పాటు ప్రోజ్యూమర్ కాన్సెప్టును సమర్ధంగా అమలు చేయాలి. ఐటీ, ఏఐ, క్వాంటం ల్యాబ్స్ తరహాలో వ్యవసాయం కోసం ఓ బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.’ అని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలు రాష్ట్ర రైతుల భవిష్యత్తుకు ఎంతో దోహదపడతాయని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.