
📌 Key Points
- ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ సర్వే కారణంగా వాయిదా పడనున్నాయి.
- సర్వే పూర్తికి మరో నెల సమయం పడుతుందని హైకోర్టుకు ఏజీ తెలిపారు.
- మే నెలలో ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని స్పష్టం చేశారు.
- జూన్ లేదా జూలైలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పడింది. అయితే, బీసీ సర్వే పూర్తికి సమయం పట్టనుండటంతో ఎన్నికలు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. హైకోర్టులో జరిగిన విచారణలో ఈ విషయం స్పష్టమైంది. ఇది అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీకి కీలకం.
బీసీ సర్వేతో ఎన్నికల వాయిదా అనివార్యం
AP Local Body Elections 2026 : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల సందడి ముగిసిన తర్వాత… ఇప్పుడు అందరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై పడింది. ఇప్పటికే కసరత్తు మొదలవగా… ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. క్షేత్రస్థాయిలో పాలన స్తంభించకుండా ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. అయితే ఈ పరిస్థితి ఎక్కువ కాలం ఉండకుండా… వీలైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేయాలని కూటమి సర్కార్ భావిస్తోంది. ఈ మే నెలలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని భావించినప్పటికీ… బీసీ సర్వే పూర్తికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో…. జూన్ లేదా జూలైలో ఎన్నికలు నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి.
స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ సర్వే అంశాలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ కీలక అంశాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బీసీ సామాజిక స్థితిగతులపై జరుగుతున్న సర్వే పూర్తయ్యేందుకు మరో నెల పడుతుందని తెలిపారు. సర్వే వివరాల ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఏకసభ్య కమిషన్ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుందని…. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు నిర్వహించబోమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
హైకోర్టులో ఏజీ కీలక వాదనలు
ఏజీ వాదనల ప్రకారం…. ఈ మే నెలలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది. బీసీ సర్వే పూర్తి అయిన తర్వాత… రిజర్వేషన్ల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ తర్వాతనే ప్రభుత్వం… ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వస్తున్న ఈ స్థానిక పోరు అటు అధికార కూటమికి, ఇటు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. పల్లెల్లో తమ పట్టు నిరూపించుకునేందుకు టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఇప్పటికే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా మెజారిటీ పంచాయతీలను కైవసం చేసుకోవాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది.
మరోవైపు, ఓటమి నుంచి కోలుకుని తిరిగి పుంజుకోవాలని వైసీపీ భావిస్తోంది. క్షేత్రస్థాయి కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు ఈ ఎన్నికలను ఒక అవకాశంగా మలచుకోవాలని ఆ పార్టీ నేతలు చూస్తున్నారు.
కూటమి, వైసీపీకి ప్రతిష్టాత్మకం
స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు ఎంతో కీలకం. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక చోట్ల ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండటంతో…. ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేక స్థానిక సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే సర్కార్ భావిస్తోంది.
రాష్ట్రంలోని 13,100 పంచాయతీల్లోని పాలకమండలి పదవీ కాలం ఏప్రిల్ 2తో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రత్యేకాధికారుల పాలన అమల్లోకి వచ్చింది. మరో 250 పంచాయతీల్లో కోర్టు కేసులు, ఇతర కారణాలతో అప్పట్లో ఎన్నికలు జరగలేదు. వీటిపై కూడా త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
బీసీ సర్వే, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ పోరులో తమ పట్టు నిరూపించుకోవడానికి అధికార కూటమి, తిరిగి పుంజుకోవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి.


