
📌 Key Points
- తలనొప్పి, అలసట, బరువు మార్పులు వంటివి తీవ్ర వ్యాధులకు సంకేతం కావచ్చు.
- గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ వంటివి చిన్న లక్షణాలతో ప్రారంభం కావచ్చు.
- నిరంతర అలసట, కారణం లేని బరువు తగ్గడం వైద్యులను సంప్రదించాల్సిన సూచనలు.
- స్లీప్ అప్నియా, కాళ్ళ వాపు వంటివి నిర్లక్ష్యం చేయకూడని ఆరోగ్య సమస్యలు.
సమాజంలో తండ్రులు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను విస్మరించడం వల్ల అవి తీవ్రమైన వ్యాధులుగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం.
తండ్రులు నిర్లక్ష్యం చేసే ఆరోగ్య సమస్యలు
ఆల్మోస్ట్ అన్ని ఫ్యామిలీస్‌లో తండ్రులు తమ ఆరోగ్యం గురించి కంప్లయింట్ చేయరు. తలనొప్పి, అలసట, నిద్ర సమస్యలు, కారణం లేకుండా బరువు తగ్గడం ఉన్నా సరే ఒత్తిడి, వయసు మీద పడటం, బిజీ షెడ్యూల్స్ వల్ల ఇలా జరుగుతుందని అనుకుంటారు. పెద్దగా పట్టించుకోరు. కానీ ఇవే చిన్న చిన్న సమస్యలు ఒక్కో సారి గుండె జబ్బులు, డయాబెటిస్, థైరాయిడ్, కొన్ని క్యాన్సర్ల వంటి తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పురుషుల్లో తరుచుగా కనిపించే అనారోగ్య సంకేతాలను సకాలంలో గుర్తించి వైద్య పరీక్షలు అందించడం ద్వారా ఆరోగ్యం మెరుగుడపటమే కాదు జీవన నాణ్యత పెరుగుతుందని అంటున్నారు. పురుషుల్లో అనారోగ్య సంకేతాల గురించి వివరిస్తున్నారు.
చాలా తలనొప్పులు ప్రమాదకరం కాకపోయినా.. కొన్నింటిపై శ్రద్ధ వహించాలి. పురుషుల్లో తీవ్రమైన తలనొప్పి క్రమంగా పెరుగుతూ ఉండటం, మైకం, కంటి చూపు మార్పులు, గందరగోళం, వాంతులు ఉంటే అది అధిక రక్తపోటు, రక్తప్రసరణ సమస్యలు లేదా న్యూరోలాజికల్ అత్యవసర స్థితిని సూచించవచ్చు. ఇప్పటివరకు అనుభవించని అత్యంత తీవ్రమైన తలనొప్పి అని అనిపిస్తే తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి.
ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు అలసిపోతారు. కానీ సరైన నిద్ర తర్వాత కూడా నిరంతరం అలసటగా ఉండటం డయాబెటిస్, థైరాయిడ్ రుగ్మతలు, రక్తహీనత, గుండె సమస్యలు, స్లీప్ అప్నియా వంటి సమస్యలను సూచించవచ్చని చెప్తున్నారు నిపుణులు. పురుషుల్లో త్వరగా అలసట ఉందని అనిపిస్తే.. వైద్యులను సంప్రదించాలి.
ఆహారం, వ్యాయామంలో మార్పు లేకుండానే ఆకస్మికంగా బరువు తగ్గడం లేదా పెరగడాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. కారణం లేకుండా బరువు తగ్గడం డయాబెటిస్, థైరాయిడ్, జీర్ణ సమస్యలు లేదా కొన్ని క్యాన్సర్లతో ముడిపడి ఉండవచ్చు. అనుకోని బరువు మార్పులు జరిగితే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గుర్తించాల్సిన ప్రమాదకర సంకేతాలు
కాళ్లలో వాపు గుండె, మూత్రపిండాలు, కాలేయ సమస్యలను సూచించవచ్చు. ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల అప్పుడప్పుడు వాపు రావచ్చు కానీ తరచుగా లేదా కారణం లేకుండా వాపు వస్తే వైద్యుడికి చూపించాలి.
మీ తండ్రి బిగ్గరగా గురక పెడుతున్నారా? లేదా నిద్రలో శ్వాస ఆగిపోతున్నట్టు అనిపిస్తుందా? ఇది స్లీప్ అప్నియాకు సంకేతం కావచ్చు. చికిత్స చేయకపోతే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్, పగటిపూట అలసట ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
పురుషులు తమ భావోద్వేగాలను స్త్రీల మాదిరిగా కాకుండా భిన్నంగా వ్యక్తం చేస్తారు. పెరిగిన చిరాకు, తరచుగా కోపం, కుటుంబ కార్యక్రమాల నుంచి దూరమవడం లేదా ఏకాగ్రత సమస్యలు దీర్ఘకాలిక స్ట్రెస్, ఆందోళన లేదా డిప్రెషన్‌ను సూచించవచ్చు. మానసిక ఆరోగ్యానికి కూడా శారీరక ఆరోగ్యంతో సమాన ప్రాధాన్యత ఇవ్వాలి.
స్పష్టమైన కారణం లేకుండా ఎక్కువ కాలం ఎమోషనల్‌గా లో ఫీలింగ్‌తో ఉండటం, ఆందోళనగా కనిపించడాన్ని విస్మరించకూడదు. డిప్రెషన్.. నిద్ర, పని పనితీరు, సంబంధాలు, మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. త్వరగా సహాయం పొందడం ద్వారా పెద్ద మార్పు వస్తుంది.
సకాలంలో వైద్య పరీక్షల ఆవశ్యకత
8. ప్రేగుల అలవాట్లలో మార్పులు
తరచుగా మలబద్ధకం, నిరంతర విరేచనాలు, మలంలో రక్తం లేదా పొట్టలో ఎప్పుడూ అసౌకర్యం.. జీర్ణ సమస్యలు, ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, ఆహార అసహనం లేదా కోలొరెక్టల్ క్యాన్సర్‌ను సూచించవచ్చు. ఈ లక్షణాలు కొనసాగితే లేదా తరచుగా వస్తే వైద్య పరీక్ష అవసరం.
నిద్రపోవడంలో ఇబ్బంది, తరచుగా మేల్కొనడం, తగినంత సేపు నిద్రపోయినా అలసటగా ఉండటం.. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పేలవమైన నిద్ర.. గుండె జబ్బులు, ఆందోళన, డిప్రెషన్, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలను పెంచుతుంది. ఈ సంకేతాలను గమనించి తమ తండ్రులను సకాలంలో వైద్యుడిని చూపించడం ద్వారా చాలా ప్రమాదాలను నివారించవచ్చు.
తండ్రులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం, చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన జీవనం కోసం సకాలంలో పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.


