
📌 Key Points
- బ్యాండ్ మేళం ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ సందడి
- వివి వినాయక్‌తో మాట్లాడవద్దని బండ్ల గణేష్ కామెంట్
- కోన వెంకట్ గురించి బండ్ల గణేష్ ప్రశంసలు
- సొంత ఆస్తులు అమ్మి సినిమా తీయడానికి కోన సిద్ధం
బండ్ల గణేష్ మరోసారి తన మాటలతో హల్ చల్ చేశారు. ‘బ్యాండ్ మేళం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు వివి వినాయక్‌తో ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. కోన వెంకట్‌ను ఆయన ఆకాశానికెత్తేశారు.
బండ్ల గణేష్ స్పీచ్‌లో వినాయక్‌కు షాక్
Bandla Ganesh: బండ్ల గణేష్ ఎక్కడ ఉంటే అక్కడ సందడి సందడిగా ఉంటుందనే విషయం తెలియంది కాదు. తాజాగా ఆయన ‘బ్యాండ్ మేళం’ (Band Melam) మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన స్పీచ్ మాట్లాడుతుండగా.. దర్శకుడు వివి వినాయక్ (VV Vinayak) పక్కన బాబీతో డిస్కషన్ పెట్టడంతో.. బండ్ల గణేష్ (Bandla Ganesh) షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు. ‘కోర్ట్’ చిత్రంతో మెప్పించిన హర్ష్ రోషన్, శ్రీదేవీ జంట మళ్లీ ‘బ్యాండ్ మేళం’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబతోంది. బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై కావ్య, శ్రావ్య ఈ మూవీని నిర్మించారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఆయనని మాట్లాడటానికి యాంకర్ సుమ స్టేజ్ పైకి పిలవగానే.. మా సుమని ‘కన్నాంబ’ అని పిలుచుకుంటానని, అది మా మధ్య ఉన్న బంధమని చెబుతూ స్పీచ్ మొదలెట్టారు. అప్పుడు వినాయక్ బాబీ, చంద్రబోస్‌లతో మాట్లాడుతుంటే.. ‘ఓయ్ వినయ్ అన్నా.. మాట్లాడమాకు.. నా స్పీచ్ విను’ అని అనగానే అంతా క్లాప్స్‌తో హోరెత్తించారు. అనంతరం బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ‘‘వేసవి కాలం తర్వాత వచ్చే మొదటి వర్షం మట్టి వాసన ఎంత కమ్మగా ఉంటుందో, కోన గారి సాన్నిహిత్యం కూడా అంత కమ్మగా ఉంటుంది. ఆయన కోసమే నేను ఈ వేడుకకు వచ్చాను. ఒకసారి వి.వి. వినాయక్ అన్న నాతో ‘ఇండస్ట్రీ అంతా ఒక పక్కన ఉన్నా, కోన ఒక్కడు నీ పక్కన ఉంటే నువ్వు గెలిచేయొచ్చు’ అని అన్నారు. కోన వెంకట్ అనే వాడు ఒక్కసారి మనిషిని నమ్మాడంటే.. అతన్ని ఎంత వరకైనా తీసుకెళతాడు.
కోన వెంకట్ గొప్పతనం గురించి బండ్ల కామెంట్స్
దాదాపు అర డజను మంది కొత్త డైరెక్టర్లు.. హరీష్ శంకర్, బాబీ, గోపి మల్లినేని వంటి వారిని పెద్ద హీరోలకు పరిచయం చేసి, వారిని ఒప్పించి హిట్లు ఇప్పించడం కోన వెంకట్‌కే సాధ్యం. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు సూపర్ హిట్ అవ్వాలని అంటున్నానంటే.. ఆయన తన సొంత ఆస్తులు అమ్మి ఈ సినిమాను నిర్మించారు, సినిమాపై ఆయనకు అంత ప్రేమ ఉంది. నేనయితే చస్తే ఆ పని చేయను. నిజంగా చెబుతున్నా.. ఆ పని నా ప్రాణం పోయినా చేయను. నా ఆస్తి తాకట్టు పెట్టి నేను సినిమా చేయను. ఆయనకు సినిమా అంటే మక్కువ కాబట్టి.. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
బ్యాండ్ మేళం సినిమాపై అంచనాలు
హీరో రోషన్‌ని చూసి ముచ్చటేసింది. ఇండస్ట్రీలో టాలెంట్ ఎవరి సొత్తు కాదు. ఇండస్ట్రీలో స్టార్ కొడుకు స్టార్ అవడం చాలా రేర్‌గా జరుగుతుంది. అది మహేష్ బాబు, రామ్ చరణ్‌లకు మాత్రమే సాధ్యమైంది. డైరెక్టర్స్, నిర్మాతలనే చూసుకుంటే, ఆస్తులను ఇచ్చారు కానీ, సక్సెస్‌ని ఇవ్వలేకపోయారు. రోషన్‌ని చూస్తుంటే.. నిజంగా ఇతను నా కొడుకు అయితే ఎంత బాగుండు అనుకున్నా. ఈ కుర్రాడ్ని చూస్తుంటే, అతను డ్యాన్స్ చేస్తుంటే నాకు ముచ్చటేసింది. ఈ అబ్బాయ్ బ్యాక్‌గ్రౌండ్, ఫ్రంట్ గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు కానీ, ఇతను సూపర్ స్టార్ అవ్వాలి. మా అబ్బాయి కూడా నీలా అవ్వాలని కోరుకుంటున్నాను. కోన వెంకట్ మంచితనం కోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని, ఆయన మరిన్ని డబ్బులు సంపాదించి మరో 10 మంది డైరెక్టర్లను హీరోలకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కోన వెంకట్ సినిమా కోసం తన ఆస్తులను కూడా అమ్మడానికి సిద్ధపడటం గొప్ప విషయమని ఆయన అన్నారు.


