
📌 Key Points
- మూసీ నది ప్రక్షాళన తన కల అని, ఒట్టేసి చెబుతున్నా పూర్తి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
- వచ్చే ఎన్నికల నాటికి SLBC ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి కృష్ణా జలాలను అందిస్తానని హామీ.
- నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని, నివేదించిన ప్రతి పని చేస్తానని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
- గత 30 నెలల ప్రజా ప్రభుత్వ పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది ప్రక్షాళన తన కల అని, ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పూర్తి చేసి తీరుతానని శపథం చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, SLBC ప్రాజెక్టును పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు.
మూసీ ప్రక్షాళన: సీఎం రేవంత్ రెడ్డి శపథం
ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది తన కల అని, ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి నల్గొండ నేలమీద కృష్ణా నది జలాలను పారిస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎస్ఎల్‌బీసీ పూర్తి చేయడంతోపాటు డిండి ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకారాన్ని అందిస్తానని స్పష్టం చేశారు.
నల్గొండ జిల్లా కనగల్ మార్కెట్ యార్డులో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి పైలాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఆ తర్వాత నల్గొండ పట్టణానికి చేరుకుని తెలంగాణ పట్టణ ఆర్థిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TUFIDC ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ. 83 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, అడ్లూరితో పాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నివేదించిన ప్రతి పనినీ చేయడానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
నల్గొండ జిల్లా అభివృద్ధి లక్ష్యం
మూసీ కాలుష్యం కారణంగా ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రజల పరిస్థితి దారుణంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. ప్రక్షాళన చేస్తామంటే కొందరు కడుపులో విషం పెట్టుకుని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. నల్గొండ జిల్లా ప్రజలకు విముక్తి కల్పిస్తానని స్పష్టం చేశారు. గత 30 నెలల ప్రజా ప్రభుత్వ పాలనలో ఏం సాధించామన్న అంశంలో అసెంబ్లీ వేదికగా చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు రేవంత్ రెడ్డి. తెలంగాణలో పదేండ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు.
‘గతంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా ప్రజా ప్రభుత్వం లక్షలాది రేషన్ కార్డులు జారీ చేసింది. రాష్ట్రంలో 3.28 కోట్ల మందికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం. పేదవారికి ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షల చొప్పున అందిస్తున్నాం. భూమి లేని నిరుపేదలను ఆదుకోవడానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
రైతుల సంక్షేమం కోసం 30 నెలల్లో 1.56 లక్షల కోట్లను ఖర్చు చేసిందన్నారు సీఎం. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రికార్డు సృష్టించామని చెప్పారు. వందేళ్లుగా అపరిష్కృత ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపించామని తెలిపారు. కులగణన చేపట్టామని, 30 నెలల్లో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి యువకుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు.
ప్రజా ప్రభుత్వ పాలనపై రేవంత్ విమర్శలు
ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రవేశపెట్టామని రేవంత్ రెడ్డి చెప్పారు. బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. ఆరుట్లలో తెలంగాణ మోడల్ స్కూల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు.
నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల నుంచి వందలాది మంది అంబేద్కర్లుగా తయారై రాష్ట్రాన్ని పాలించాలన్నారు రేవంత్ రెడ్డి. పిల్లల్లో నైపుణ్యాలను పెంచాలని స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేశామన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన, నల్గొండ అభివృద్ధిపై తన దృఢ సంకల్పాన్ని చాటారు. గత పాలనపై విమర్శలతో పాటు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని భరోసా ఇచ్చారు. ఈ ప్రకటనలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.


