
📌 Key Points
- వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్‌లపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
- అధికారుల నిర్లక్ష్యంపై మండిపడి, కఠిన చర్యలకు ఆదేశించారు.
- ట్రాఫిక్ విభాగంలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డీజీపీకి సూచించారు.
- వర్షాల సమయంలో క్షేత్రస్థాయిలో ఉండాలని పోలీసు, మున్సిపల్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు.
హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడిన సీఎం, కఠిన చర్యలకు ఆదేశించారు. ట్రాఫిక్ విభాగంలో ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సూచించారు.
అధికారుల నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం
వర్షాకాల సన్నద్ధతపై బోధి పేవిలియన్‌లో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు వేంనరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, సీఎస్ కె.రామకృష్ణారావు గారు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు ఇరిగేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ, వాతావరణ శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
జూన్ 9న కోర్ అర్బన్ రీజియన్‌లో వర్షం కారణంగా ఏర్పడిన పరిస్థితులు, తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. సైబరాబాద్‌తో పాటు అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో నగరవాసులు ఇబ్బందులు పడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మున్సిపల్, పోలీసు, ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తం కాలేదన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా జూన్ 1వ తేదీన సమీక్ష నిర్వహించి తాను స్వయంగా అనేక సూచనలు చేశానని గుర్తుచేశారు. అయినప్పటికీ కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
జూన్ 9న నగరంలో వర్షం సమయంలో మున్సిపల్ , పోలీసు అధికారుల మధ్య సమన్వయం లోపం స్పష్టంగా కనిపించిందన్నారు సీఎం. ఈ పరిస్థితికి గల కారణాలను విశ్లేషించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ లను ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలపై ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. వర్షం కురిసిన సమయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హైడ్రా, ట్రాఫిక్, జలమండలి సిబ్బందితోపాటు సివిల్ పోలీసులు కూడా క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ జామ్‌లపై కఠిన చర్యల హెచ్చరిక
పోలీసు కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు రోడ్లపైకి రావాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. అవసరమైతే తాను కూడా రోడ్డుపైకి వస్తానని అన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ అయితే ఇకపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలోని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని డీజీపీకి సూచించారు.
మానవ తప్పిదాల వల్ల సమస్యలు తలెత్తితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని సీఎం హెచ్చరించారు. వర్షాల సమయంలో ఏర్పడే వాటర్ లాగింగ్ పాయింట్లు, బ్లాక్‌స్పాట్లు, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాల డేటా ఆధారంగా అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. వర్షం కారణంగా పలు చోట్ల చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంపై ముఖ్యమంత్రి సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ పునరుద్ధరణ వెంటనే జరగాలని సూచించారు. అవసరమైన చోట్ల మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలన్నారు.
సీజన్‌లో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మాన్యువల్ ప్రకారం ప్రాజెక్టుల నిర్వహణ ఉండాలన్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టుల వద్ద సంబంధిత ఇంజినీర్లు తప్పనిసరిగా స్థానికంగా ఉండాలని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ప్రాజెక్టులను వదిలి వెళ్లే ఇంజినీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాను ఆదేశించారు.
పోలీసు శాఖలో ఖాళీల తక్షణ భర్తీకి ఆదేశం
వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి సూచించారు. ముఖ్యంగా విత్తనాలు, యూరియా పంపిణీపై దృష్టి సారించాలన్నారు. రైతు వేదికల ద్వారా యూరియా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. యూరియా స్టాక్, పంపిణీ కోసం స్థానిక వ్యవసాయ అధికారిని బాధ్యుడిగా నియమించడంతో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా భాగస్వామ్యం చేయాలన్నారు. సన్న వడ్ల కోసం వ్యవసాయ శాఖ ప్రకటించిన ఎనిమిది రకాల విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. గతంలో తాగునీటి కలుషితం కారణంగా జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు నిర్వహించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. నీటి కలుషితం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధం చేసుకోవాలన్నారు. వర్షాల కారణంగా నీటి నిల్వలు ఏర్పడి అపరిశుభ్ర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరికలతో అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలతో పాటు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు.


