
📌 Key Points
- ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో రెండు అవార్డులు.
- సందీప్ సరోజ్‌కు ఉత్తమ తొలి హీరోగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు లభించింది.
- యదు వంశీ ఉత్తమ తొలి దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నారు.
- ఈ చిత్రం సామాజిక సందేశంతో కూడిన కామెడీ డ్రామాగా ప్రశంసలు పొందింది.
‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుకలో రెండు అవార్డులు గెలుచుకుంది. సందీప్ సరోజ్‌కు ఉత్తమ తొలి హీరోగా, యదు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డులు దక్కాయి.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం
Committee Kurrollu: ‘కమిటీ కుర్రోలు’ సినిమా ప్రయాణం మరో ముఖ్యమైన మైలురాయిని సాధించి సినిమా బృందానికి మాత్రమే కాకుండా.. తెలుగు సినిమాలకు గర్వకారణమైన గుర్తింపును తీసుకొచ్చింది. ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ కార్యక్రమంలో ఈ చిత్రం రెండు ప్రధాన అవార్డులు అందుకోవటం విశేషం. సినిమాలో నటించిన సందీప్ సరోజ్‌కు ఉత్తమ తొలి హీరో (బెస్ట్ డెబ్యూ మేల్) అవార్డు, యదు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)గా అవార్డులు వచ్చాయి. దక్షిణ భారత సినీ పరిశ్రమల్లో ప్రతిభను గౌరవించే అత్యంత ప్రతిష్టాత్మక వేదికల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఒకటి. ఇందులో కమిటీ కుర్రోళ్ళు సినిమాకు రెండు అవార్డులు రావటమనేది ఈ చిత్రానికి జాతీయ స్థాయి వచ్చిన గుర్తింపు, పరిశ్రమలో లభించిన విశ్వసనీయత అని చెప్పొచ్చు. కమిటీ కుర్రోళ్ళు రెండు ముఖ్యమైన డెబ్యూ విభాగాల్లో అవార్డులు అందుకుంది. ఇది కొత్త ప్రతిభ ఎంకరేజ్ చేస్తూనే వైవిధ్యమైన కథను నమ్మకంగా చెబితే ఎలాంటి ఆదరణ ఉంటుందనేది మరోసారి తేటతెల్లమైంది.
Read also- Mega 158: మెగాస్టార్‌కు కలిసివస్తున్న మ్యాజిక్ నంబర్ ఇదేనా?.. అందుకే రిలీజ్ డేట్..
ఉత్తమ తొలి హీరోగా సందీప్ సరోజ్
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో సందీప్ సరోజ్‌కు బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డు దక్కడం ఆయన కెరీర్‌లో ఒక కీలకమైన పరిణామమని చెప్పొచ్చు. సినిమా కథలోని ప్రధాన సంఘర్షణను తన సున్నితమైన, భావోద్వేగాలకు దగ్గరగా ఉన్న నటనను కనపరిచి ప్రేక్షకులను మెప్పించినందుకు తనకు ఈ గుర్తింపు వచ్చింది. స్నేహం, అహం, నైతిక మార్పుల మధ్య తడబడే ఒక యువకుడి పాత్రను ఆయన ఎంతో సహజంగా, నిజాయితీగా పోషించారు. ఆయన నటన ప్రేక్షకులనే కాకుండా విమర్శకుల హృదయాలనూ గెలుచుకుంది. ఈ అవార్డ్స్‌లో యదు వంశీకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఇది ఆయన తన కథతో దేన్ని స్పష్టంగా చెప్పాలనుకున్నారనే విషయం, వైవిధ్యమైన ధైర్యమైన అంశాన్ని ఎంచుకున్న విధానాన్ని దర్శకుడిగా తన ఆలోచననను ఇది మరింతంగా బలపరిచింది. సామాజిక సందేశానికి కామెడీతో మిళితం చేసి, మనసుని హత్తుకునేలా సమాజంపై మరింత అవగాహన పెరిగేలా చక్కటి కథనంతో సినిమా రూపొందింది. చిన్న ప్రయత్నంగా ప్రారంభమైన ఈ సినిమాతో తొలి చిత్ర దర్శకుడిగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు.
Read also- Long Runtime: పాన్ ఇండియా సినిమాల రన్ టైమ్ పెరగడానకి కారణం ఇదే!.. ప్రేక్షకులకు ఏం కావాలంటే?
ఉత్తమ దర్శకుడిగా యదు వంశీ
ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అందుకోవటం ద్వారా కమిటీ కుర్రోళ్ళు చిత్రం ఇప్పటికే అందుకున్న అవార్డుల జాబితాలో మరో గొప్ప గుర్తింపు సొంతం చేసుకుంది. ఇది వరకే ఈ చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో జాతీయ ఐక్యత, సామాజిక సమరస్యం, వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు తో పాటు ఉత్తమ తొలి దర్శకుడు అవార్డును గెలుచుకుంది. అలాగే దుబాయ్‌లో జరిగిన గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ 2025లో యదు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడు అవార్డు లభించగా, నిహారిక కొణిదెలకు ఉత్తమ తొలి నిర్మాతగా గౌరవం దక్కింది. సైమా అవార్డ్స్ 2025లో నిహారిక కొణిదెల ఉత్తమ తొలి చిత్ర నిర్మాత(తెలుగు)గా , సందీప్ సరోజ్‌కు బెస్ట్ డెబ్యుటెంట్ యాక్టర్ (తెలుగు) అవార్డులు అందుకున్నారు. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందింది. సమాజంలోని వాస్తవిక పరిస్థితులను చెబుతూనే ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. తన తొలి చిత్రంతోనే ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెల టాలీవుడ్‌లో ఒక ముఖ్యమైన మైల్‌స్టోన్‌ను క్రియేట్ చేశారు. ఆమె నటిగానే కాకుండా సామాజిక సందేశాలను అందించే కథలను ముందుకు తెచ్చే ప్రొడ్యూసర్‌గా కూడా ప్రశంసలు అందుకున్నారు. ఈ విజయంతో న్యూ టాలెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను ఎంకరేజ్ చేయాలనే అంశం స్పష్టంగా వ్యక్తమవుతోంది.
మొత్తానికి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది. కొత్త నటీనటులను ప్రోత్సహించడంలో ఈ సినిమా ఒక ముందడుగు అని చెప్పవచ్చు.


