
📌 Key Points
- కూతురికి విడాకులు మంజూరు కావడంతో తల్లిదండ్రుల సంబరాలు, డప్పులతో ఊరేగింపు.
- రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుమార్తె ప్రణితకు 2018లో ఆర్మీ మేజర్‍తో వివాహం.
- అత్తారింట్లో వేధింపులు తాళలేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన ప్రణిత.
- విడాకుల విషయంలో కూతుళ్లకు మద్దతుగా నిలవాలని తల్లిదండ్రులకు ప్రణిత సూచన.
మీరట్‍లో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కూతురు విడాకులు తీసుకోవడంతో తల్లిదండ్రులు సంబరాలు చేసుకున్నారు. అత్తారింట్లో వేధింపులు భరించలేక విడాకులు తీసుకున్న కూతురికి మద్దతుగా నిలిచారు. ఈ ఘటన సామాజికంగా చర్చనీయాంశమైంది.
కూతురు విడాకులతో తల్లిదండ్రుల వేడుకలు
పెళ్లి అంటే నూరేళ్లు కలిసి సాగాల్సిన ప్రయాణం. కానీ కొంత మంది జీవితాల్లో ఇది పూర్తిగా భిన్నమైన పరిస్థితులు రావచ్చు. తమ జీవిత భాగస్వామితో ఏర్పడే పొరపచ్చాలు, ఇతర కారణాలతో విడాకుల వరకు దారి తీయవచ్చు. డైవర్స్ అంటే తమ తమ జీవితాల్లో అది పెద్ద విషాదమే. కానీ యూపీలోని మీరట్‍లో (Meerut) మాత్రం తమ కూతురుకి విడాకులు మంజూరు కావడంతో ఆమె తల్లిదండ్రులు గ్రాండ్‍గా సెలబ్రేషన్స్ (Daughter Divorce Celebration) చేశారు. డప్పులు వాయిస్తూ డాన్సులు చేశారు. ‘ఐ లవ్ మై డాటర్’ అని ముద్రించి ఉన్న టీ షర్టులు ధరించి ఆమెను పుట్టింటివారు ఆనందంగా స్వాగతించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.
విడాకులకు దారితీసిన పరిస్థితులు
రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర శర్మ ఏకైక కుమార్తె ప్రణిత శర్మకు 2018 డిసెంబర్ 14న ఆర్మీ మేజర్‍తో వివాహం జరిగింది. ఈ జంట అన్యోన్యంగా జీవితం కొనసాగిస్తుందని బంధువులంతా భావించారు. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టిన ప్రణితకు అక్కడ పరిస్థితులు భిన్నంగా కనిపించారు. కాలం గడిచే కొద్ది అత్తామామల వేధింపులు మరింత కఠిన తరం అయ్యాయి. దీంతో ఆమె మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొడుకు పుట్టాక కూడా పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇక కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక తన భర్త కుటుంబం వేధింపులను భరించలేనని తనకు విడాకులు ఇప్పించాలంటూ మీరట్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన కోర్టు 4 ఏప్రిల్ 2026న విడాకులు మంజూరు చేసింది. సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రణీత ఓ జ్యుడిషియల్ అకాడమిలో ఫైనాన్స్ డైరెక్టర్‍గా పని చేస్తున్నారు. తనకు విడాకులు మంజురైన సందర్భంగా తన అనుభవాన్ని పంచుకుంటూ ఎలాంటి వేధింపులైనా ఎదురైనప్పుడు మౌనంగా ఉండవద్దని, అలాగే మీ కూతురికి పెళ్లి చేసే విషయంలో తొందరపడవద్దని తల్లిదండ్రులకు సూచించారు. మీమీ కూతుర్లను చదివించాలని తన కాళ్లపై నిలబడేలా తీర్చిదిద్ది ఆ తర్వాతే వివాహం చేయాలని కోరారు.
తల్లిదండ్రులకు ప్రణిత సూచనలు
ప్రణీత విడాకుల సందర్భంగా ఆమె తల్లిదండ్రులు అనుసరించిన తీరు ఇప్పుడు సమాజంలో కొత్త ట్రెండ్‍ను సూచిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కుతురు విడాకులు అంటే భారంగా, అవమానంగా భావించే తల్లితండ్రులు అవేవి పట్టించుకోకుండా ఆమెను డబ్బులతో, డ్యాన్స్ లతో ఆహ్వానించడం గొప్ప విషయం అని స్పందిస్తున్నారు. సాధారణంగా పెళ్లి అంటే బాజాభజంత్రీలతో సందడి చేసే సమాజం, విడాకులు అంటే మాత్రం ఒక విషాదంగా, అవమానంగా చూస్తుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాకు చెందిన ఒక కుటుంబం ఈ పాత చింతకాయ పద్ధతులకు స్వస్తి పలికింది. తన కూతురు విడాకులను భారంగా భావించకుండా, ఆమెకు దక్కిన స్వేచ్ఛగా భావించి డప్పులతో, డ్యాన్స్‌లతో వేడుక చేసుకున్నారు.
ప్రణీత తీసుకున్న నిర్ణయం, ఆమె తల్లిదండ్రుల స్పందన సమాజంలో చర్చనీయాంశంగా మారింది. విడాకుల పట్ల ఉన్న సాంప్రదాయ భావనలను సవాలు చేస్తూ, మహిళల స్వేచ్ఛను ప్రోత్సహించే విధంగా ఈ సంఘటన నిలుస్తుంది.


