
📌 Key Points
- మూగజీవుల వేదనను అర్థం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది.
- మూడు పోమెరేనియన్ కుక్కల కస్టడీని దత్తత తీసుకున్న తల్లిదండ్రులకే అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
- కుక్కలను వేరు చేస్తే మానసిక వేదనకు గురవుతాయని కోర్టు తెలిపింది.
- ఒక్కో కుక్కకు రూ.50,000 బాండ్ సమర్పించాలని పిటిషనర్లకు కోర్టు ఆదేశించింది.
మూడు కుక్కల కస్టడీ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెంపుడు జంతువులకు, వాటి సంరక్షకులకు మధ్య ఉండే అనుబంధాన్ని విడదీయలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో కుక్కలను దత్తత తీసుకున్నవారికే కస్టడీని కొనసాగించాలని ఆదేశించింది.
జంతువుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి: హైకోర్టు
చట్టం అంటే కేవలం సెక్షన్లు మాత్రమే కాదని, మూగ మనసుల వేదనను అర్థం చేసుకునే మానవత్వం కూడా అని ఢిల్లీ హైకోర్టు (Dehli High Court) నిరూపించింది. పెంపుడు జంతువుల కస్టడీకి సంబంధించి ధర్మాసనం ఓ అరుదైన తీర్పును వెలువరించింది. పెంపుడు జంతువును దత్తత తీసుకున్న వ్యక్తికి, ఆ మూగజీవానికి మధ్య ఏర్పడే భావోద్వేగ బంధాన్ని ఎవరూ విస్మరించలేరు అని కోర్టు స్పష్టం చేసింది. మిష్టి, కోకో, కాటన్ అనే మూడు ‘టాయ్ పోమెరేనియన్’ (Toy Pomeranian) కుక్కల కస్టడీని వాటిని సంరక్షిస్తున్న దత్తత తల్లిదండ్రులకే అప్పగిస్తూ జస్టిస్ గిరీష్ కట్పాలియా ఆదేశాలు జారీ చేశారు.
దత్తత తీసుకున్నవారికే కుక్కల కస్టడీ
ఓ యజమాని తన పెంపుడు కుక్కలను అత్యంత దయనీయ స్థితిలో ఉంచాడన్న ఆరోపణలతో మొదలైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుక్కలను రక్షించి ఒక ఎన్జీవోకు అప్పగించారు. ఆ తర్వాత పిటిషనర్లు ఆ కుక్కలను దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అయితే, కుక్కల అసలు యజమాని ట్రయల్ కోర్టును ఆశ్రయించి, తన కుక్కలను తనకు అప్పగించాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. అయితే, ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దత్తత తీసుకున్న వారు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్లకు షరతులు విధించిన ధర్మాసనం
విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గిరీష్ కథ్పాలియా (Girish Kathpalia) కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షించబడిన జంతువుల కస్టడీని ప్రాణం లేని వస్తువులతో పోల్చలేమని స్పష్టం చేశారు. దత్తత తీసుకున్న వారి నుంచి ఆ మూగజీవాలను వేరు చేస్తే అవి తీవ్రమైన మానసిక వేదనకు (Emotional Trauma) గురవుతాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మిష్టి, కోకో, కాటన్ అనే మూడు కుక్కలు.. పిటిషనర్లు పెట్టిన పేర్లతో పిలవగానే గుర్తుపట్టి స్పందిస్తున్నాయని, ఇది వాటి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనమని ధర్మాసనం గుర్తించింది. కుక్కల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అసలు యజమాని కూడా వాటిని పిటిషనర్ల వద్దే ఉంచేందుకు కోర్టులో అంగీకరించారు. అయితే, ట్రయల్ కోర్టు ఇచ్చిన పాత ఉత్తర్వులను హైకోర్టు సవరిస్తూ.. శుక్రవారం లోపు కుక్కలను పిటిషనర్లకు అప్పగించాలని హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్లు ఒక్కో కుక్కకు రూ.50,000 చొప్పున బాండ్ సమర్పించాలని, కోర్టు ఆదేశించినప్పుడు వాటిని ప్రవేశపెట్టాలని షరతు విధించింది.
ఈ తీర్పు జంతువుల హక్కుల విషయంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. మూగజీవుల పట్ల మరింత దయ, ప్రేమ చూపాల్సిన అవసరం ఉందని కోర్టు నొక్కి చెప్పింది.


