
📌 Key Points
- విజయ్ సంచలన విజయంతో కోలీవుడ్ లో కొత్త రాజకీయ ట్రెండ్ మొదలైంది.
- ధనుష్ అభిమాన సంఘం అధికారిక జెండా ఆవిష్కరణతో పాటు సేవా కార్యక్రమాలు షురూ.
- మామ రజినీకాంత్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకునే దిశగా ధనుష్ అడుగులు.
- వచ్చే ఎన్నికల నాటికి పక్కా ప్రణాళికతో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశం ఖాయం?
కోలీవుడ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ, దళపతి విజయ్ తర్వాత మరో స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారా? అవుననే అంటున్నాయి తమిళనాట రాజకీయ వర్గాలు. మాస్ హీరో ధనుష్ రాజకీయ ప్రవేశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ వార్త ఫ్యాన్స్‌లో భారీ ఉత్సాహాన్ని నింపుతోంది.
విజయ్ స్పూర్తితో ధనుష్ మార్క్ పొలిటికల్ గేమ్!
తమిళనాడు రాజకీయాల్లో కోలీవుడ్ దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం… ఇప్పుడు ద్రవిడ రాజకీయలనే పూర్తిగా మార్చేసింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, విజయ్ సరికొత్త చరిత్ర సష్టించారు. కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ రాజకీయ అద్భుతాన్ని విజయ్ సాకారం చేయడంతో, ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ అటువైపు అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విశాల్, సూర్య, అజిత్ పొలిటికల్ ఎంట్రీపై ఇప్పటికే పలు వార్తలు వినిపిస్తున్న వేళ.. తాజాగా మరో స్టార్ హీరో ధనుష పేరుకూడా ఈ లిస్ట్ లో చేరింది.
ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది. తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఒక అధికారిక జెండాను ఆవిష్కరించడం హాట్ టాపిక్‌గా మారింది. కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా, తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు పిలుపునిచ్చారు. ఇది పక్కా పొలిటికల్ స్కెచ్‌తోనే జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మామ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకపోవడంతో.. ధనుష్ ఆ ప్లేస్ ను తీసుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.
మామ రజినీకాంత్ ప్లేస్ లో ధనుష్ ఎంట్రీ?
ముఖ్యమంత్రి విజయ్ బాటలోనే ధనుష్ కూడా ఇప్పుటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకుంటున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి పూర్తి ప్రణాళికతో పక్కాగా బరిలోకి దిగుతారని కోలీవుడ్ వర్గాల్లో గట్టి చర్చ నడుస్తోంది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) సాధించిన విజయ ప్రస్థానం అందించిన స్ఫూర్తితో, ధనుష్ అభిమానులు కూడా క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకునేందుకు కార్యాచరణ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అధికారిక జెండా.. రాజకీయ అరంగేట్రానికి సంకేతమా?
మరోవైపు, తన పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో ఇంత పెద్ద ఎత్తున ఊహాగానాలు వస్తున్నప్పటికీ… హీరో ధనుష్ వైపు నుంచి గానీ, ఆయన పీఆర్ టీమ్ నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుష్, కేవలం అభిమాన సంఘాల గుర్తింపు కోసమే ఈ జెండాను అనుమతించారా, లేదా దీని వెనుక దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే స్వయంగా ధనుష్ స్పందించే వరకు వేచి చూడక తప్పదు.
ధనుష్ రాజకీయ ప్రవేశంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలీవుడ్ రాజకీయాల్లో ఇది ఎలాంటి మార్పులు తీసుకురానుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ ను ఫాలో అవ్వండి!


