|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘ధురంధర్ 2’పై బాలీవుడ్ గుంభన.. టాలీవుడ్ ఒక్కటేనా స్పందించేది? అసలేం జరుగుతోంది?

Published: 21-03-2026, 11:35 PM
‘ధురంధర్ 2’పై బాలీవుడ్ గుంభన.. టాలీవుడ్ ఒక్కటేనా స్పందించేది? అసలేం జరుగుతోంది?
  • ‘ధురంధర్ 2’ చిత్రం మొదటి భాగం విజయం సాధించడంతో, రెండో పార్ట్‌ను ఎమోషన్స్‌తో నింపి రూపొందించారు.
  • టాలీవుడ్ హీరోలు ఈ సినిమాపై స్పందిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది.
  • బాలీవుడ్ ఖాన్ త్రయం, ఇతర స్టార్ హీరోలు సినిమాపై కనీసం ట్వీట్ కూడా చేయకపోవడం గమనార్హం.
  • పాన్ ఇండియా సినిమాలు నడుస్తున్నా, ఇతర సౌత్ ఇండస్ట్రీల నుంచి స్పందన కరువైంది.

రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్ 2’ చిత్రంపై టాలీవుడ్ హీరోలు చూపిస్తున్న ఆసక్తి, బాలీవుడ్ నటులు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉంది? టాలీవుడ్ ఎందుకు రియాక్ట్ అవుతోంది?

టాలీవుడ్ హీరోల రియాక్షన్ వెనుక ఆంతర్యం?

Dhurandhar2: ‘ధురంధర్ 2’.. రణ్వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా ఆదిత్య ధర్ (Aditya Dhar) తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి నుంచి పాజిటివ్ స్పందనతో థియేటర్లలోకి వచ్చింది. మొదటి పార్ట్ ఊహించని విజయం సాధించడంతో, రెండో పార్ట్‌ (Dhurandhar2)ని చాలా జాగ్రత్తగా, ఎమోషన్స్ ‌నింపి దర్శకుడు రెడీ చేశారు. అందుకే 4 గంటలకు పైగా నిడివి ఉన్నా జనాలు థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. అంతా బాగానే ఉంది.. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాపై ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నారనేదే ఇప్పుడర్థం కానీ ప్రశ్న. నిజమే, సినిమా బాగుంటే.. మన టాలీవుడ్ హీరోలు భాషతో సంబంధం లేకుండా తమ అభిప్రాయాలను, రివ్యూలను ఇస్తుంటారు. అది మంచిదే. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే, ఇదంతా ఇండియన్ సినిమా అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది, కాదనడం లేదు. కానీ తెలుగు హీరోలే ఎందుకు ఇంతగా రియాక్ట్ అవుతున్నారు?

బాలీవుడ్ ఎందుకు సైలెంట్ గా ఉంది?

ఈ సినిమా బాలీవుడ్ స్ట్రయిట్ చిత్రం, కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కొన్నాళ్లుగా బాలీవుడ్ డౌన్ అయిన క్రమంలో.. ఇలాంటి సినిమా వచ్చినప్పుడు అంతా సపోర్ట్ ఇవ్వాలి కదా. మరి ఖాన్ త్రయం కానీ, ఇంకా ఇతర బాలీవుడ్ స్టార్ హీరోలెవరూ కనీసం ట్వీట్ కూడా వేయడం లేదు ఎందుకు? పాకిస్తాన్‌ని టార్గెట్ చేసినందుకు ఖాన్‌లు స్పందించలేదు అనుకోవచ్చు, మిగతా స్టార్స్ కూడా ఎందుకు రియాక్ట్ అవడం లేదు? రియాక్ట్ అయితే రేపు ఎవరైనా టార్గెట్ చేస్తారని భయపడుతున్నారా? వాళ్లు కూడా పాకిస్తాన్‌పై సినిమాలు చేశారు కదా.. ఇప్పుడు రెస్పాండ్ అవడానికి ఏమైంది? ఈగో అడ్డు వస్తుందా? లేదంటే, ఈ సినిమా హిట్టవడం వారికి ఇష్టం లేదా? ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ సినిమాపై బాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉంది?

పాన్ ఇండియా ట్రెండ్ లో సౌత్ ఇండస్ట్రీల స్పందన ఏది?

టాలీవుడ్ కాకుండా సౌత్‌లోని ఇతర ఇండస్ట్రీల హీరోలు కూడా ఎవరూ ఈ సినిమాపై రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలే ఎక్కువగా నడుస్తున్నాయి. స్టార్ హీరోలందరూ పాన్ ఇండియా బాట పట్టారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా స్థాయి హిట్స్ ఈ మధ్యకాలంలో బాగానే పడుతున్నాయి. మరెందుకు తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీల వాళ్లు కూడా ఈ సినిమాపై రియాక్ట్ కావడం లేదు. అదే టైమ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం తమ భుజాలపై ఈ సినిమాను మోస్తున్నారు. మహేష్ బాబు నుంచి రవితేజ, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఇలా అందరూ ఈ సినిమాను ఓ రేంజ్‌లో లేపుతున్నారు. తాజాగా రాజమౌళి కూడా ఈ లిస్ట్‌లోకి చేరారు. మన స్టార్ హీరోలంతా వేరే ఇండస్ట్రీ సినిమాను లేపడం చూస్తుంటే లేనిపోని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక ఏదైనా పొలిటికల్ ప్రెజర్ ఉందా? అనేలా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కాదంటే, బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకోవడం కోసం, అక్కడి ప్రేక్షకులను తమ వైపు దృష్టి మళ్లీంచడం కోసం ఏమైనా ఇలా చేస్తున్నారా? ఏమో.. సినిమా కదా.. ఏమైనా జరగవచ్చు.

మొత్తానికి ‘ధురంధర్ 2’ చిత్రం విషయంలో బాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తోంది. టాలీవుడ్ హీరోల స్పందనను చూస్తుంటే ఏదో జరుగుతోందనిపిస్తోంది. వేచి చూడాల్సిందే.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.