
📌 Key Points
- భూమిక చావ్లా నటన సినిమాకు హైలైట్! వింధ్య వేములపల్లిగా పరకాయ ప్రవేశం!
- తొలి సినిమాతో విఘ్నేష్ గవిరెడ్డి అద్భుత నటన! కాన్ఫిడెంట్‌గా ఆకట్టుకున్నాడు.
- సారా అర్జున్ స్క్రీన్ టైమ్ తక్కువైనా కథకు కీలకం! గుర్తుండిపోయే నటన.
- కాలభైరవ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది!
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘యుఫోరియా’ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. భూమిక చావ్లా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం!
భూమిక చావ్లా నటన అదుర్స్!
టాలీవుడ్‌లో భారీ సెట్టింగులు, పౌరాణిక గాథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు గుణశేఖర్, సుమారు మూడేళ్ల విరామం తర్వాత పూర్తిగా రూటు మార్చారు.. భారీ హంగులకు దూరంగా, ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ ఆయన తెరకెక్కించిన బలమైన సోషల్ డ్రామానే ‘యుఫోరియా’.
ఒకప్పుడు ఒక్కడు, ఖుషీ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొంది, సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్న భూమిక చావ్లా ఇందులో ప్రధాన పాత్ర పోషించడం సినిమాపై ఆసక్తిని పెంచింది.
ఒక నగరంలోని ఒక ప్రతిష్టాత్మక కాలేజీకి కరస్పాండెంట్ వింధ్య వేములపల్లి (భూమిక చావ్లా). విద్యావేత్తగా సమాజంలో ఆమెకు ఎంతో గౌరవం ఉంది. హఠాత్తుగా హైకోర్టు మెట్లు ఎక్కి, తనపై తనే కేసు నమోదు చేయమని ఆమె కోరడంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. అంతటి ఉన్నత స్థానంలో ఉన్న మహిళ, తాను నేరం చేశానని ఎందుకు ఒప్పుకుంది? అసలు ఆమె చేసిన నేరం ఏమిటి? మరోవైపు చైత్ర (సారా అర్జున్) అనే అమ్మాయి జీవితం ఈ కేసుతో ఎలా ముడిపడి ఉంది? నేటి ‘జెన్-జీ’ (Gen Z) సంస్కృతిలో యువత వెళ్తున్న దారి, వారిపై తల్లిదండ్రుల ప్రభావం ఎలా ఉందనేదే మిగిలిన కథ.
యూత్‌కు గుణశేఖర్ స్ట్రాంగ్ మెసేజ్!
ఈ సినిమాకు ప్రధాన బలం భూమిక చావ్లా.. గ్లామర్ పాత్రల నుంచి నటనకు ఆస్కారం ఉన్న పాత్రల వైపు మళ్లిన ఆమె, ఇందులో వింధ్య పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.. ఒక బాధ్యతాయుతమైన విద్యావేత్తగా, అదే సమయంలో అంతర్మథనంతో రగిలిపోయే వ్యక్తిగా ఆమె ప్రదర్శించిన పరిణతి అద్భుతం. ముఖ్యంగా ఎమోష నల్ సన్నివేశాల్లో ఆమె అనుభవం తెరపై కనిపిస్తుంది. ఇక డెబ్యూ యాక్టర్ విఘ్నేష్ గవిరెడ్డి మొదటి సినిమానే అయినా, అస్థిరమైన మనస్తత్వం ఉన్న యువకుడిగా చాలా కాన్ఫిడెంట్‌గా నటించాడు. సారా అర్జున్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ, కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. కీలకమైన సన్నివేశాల్లో ఆమె తన ఉనికిని చాటుకుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తనదైన స్టైలిష్, సెటిల్డ్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు..
సాంకేతికంగా గుణశేఖర్ తన స్థాయిని, విలువలను కాపాడుకున్నారు.. ప్రవీణ్ కె. పోతన్ సినిమాటోగ్రఫీ సినిమాలోని సీరియస్ మూడ్‌ని పర్ఫెక్ట్‌గా క్యాప్చర్ చేసింది. కాలభైరవ అందించిన సంగీతం కథలోని గాఢతను పెంచింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని ఎమోషనల్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో బాగున్నప్పటికీ, సెకండ్ హాఫ్‌లో అక్కడక్కడా కత్తెర పడాల్సింది.. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి.
సినిమాలో కాలభైరవ మ్యూజిక్ హైలైట్!
‘యుఫోరియా’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఇది సమాజానికి ఒక హెచ్చరిక. దర్శకుడు గుణశేఖర్ కేవలం నేరస్తులను వేలెత్తి చూపడం కాకుండా, ఆ నేరం జరగడానికి గల సామాజిక కారణాలను, తల్లిదండ్రుల పెంపకంలో లోపాలను స్పృశించిన తీరు అభినందనీయం.. ఫస్ట్ హాఫ్ కథనం చాలా వేగంగా సాగుతూ ప్రేక్షకుడిని సినిమాలో లీనం చేస్తుంది. ఆధునిక జీవనశైలిలో స్వేచ్ఛను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో పదునైన సంభాషణలతో వివరించారు. ముగింపు సన్ని వేశాలు ఎమోషనల్ పవర్‌తో కూడి ఉండి, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.
అయితే, సెకండ్ ఆఫ్‌లో సినిమా కాస్తా సాగదీతగా అనిపిస్తుంది.. సామాజిక ఇతివృత్తం ఉన్న సీరియస్ సినిమాలో పాటలు కథా ప్రవాహానికి అడ్డు తగిలినట్లు అనిపిస్తాయి. భూమిక, విఘ్నేష్ పాత్రల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఇంకాస్త డ్రామా పండించాల్సింది. మొత్తంగా చెప్పాలంటే.. ‘యుఫోరియా’ ఒక నిజాయితీతో కూడిన సామాజిక ప్రయత్నం. తమ పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు? వాళ్ల స్నేహాలు ఎలాంటివి? అని గమనిం చాల్సిన అవసరాన్ని ఈ చిత్రం తల్లిదండ్రులకు గుర్తు చేస్తుంది. రొటీన్ మాస్ మసాలా చిత్రాలకు భిన్నంగా, వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ చూడాల్సిన మంచి సోషల్ డ్రామా ఇది.
మొత్తానికి ‘యుఫోరియా’ మూవీ ఒక మంచి సోషల్ డ్రామా. భూమిక చావ్లా నటన, గుణశేఖర్ దర్శకత్వం సినిమాకు ప్లస్ పాయింట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


