
📌 Key Points
- హైదరాబాద్‌లో 2026 డిసెంబర్ 9 నాటికి 100% ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
- హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దడానికి అందరూ సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
- హైదరాబాద్‌లో మూసీ నది ప్రక్షాళన కోసం రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టాలని సీఎం అన్నారు.
- మహిళా జర్నలిస్టులను సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి, వారి సహకారాన్ని కోరారు.
హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2026 నాటికి నగరంలో వంద శాతం ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నగరంలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.
హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని జ్యోతిరావు పూలే భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మహిళా జర్నలిస్టులను సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను కాపాడుకోవడానికి, అంతర్జాతీయ నగరంగా రాణించడానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి అందరి సహకారం కావాలని కోరారు.
దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులు సమీప భవిష్యత్తులో హైదరాబాద్‌కు తలెత్తకుండా నివారించడంతో పాటు ఈ నగరాన్ని ప్రపంచంలోనే మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రణాళికలు రూపొందించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణలో భాగంగా హైదరాబాద్‌లో తిరిగే ఆర్టీసీ బస్సులను 2026 డిసెంబర్ 9 నాటికి వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నామని చెప్పారు.
‘దేశంలోని ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలు ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయో మహిళా జర్నలిస్టులు విశ్లేషించాలి. వర్షాలొస్తే ముంబయి అతలాకుతలమవుతోంది. వాయు కాలుష్యంతో ఢిల్లీ సతమతమవుతోంది. బెంగుళూరులో ట్రాఫిక్ సమస్యలు, వరదలొచ్చినప్పుడు చెన్నై ప్రమాదకర పరిస్థితులను గమనిస్తూనే ఉన్నాం. సమీప భవిష్యత్తులో హైదరాబాద్ నివాసయోగ్యం కాని నగరంగా మారే పరిస్థితులు రావొద్దు. ఇలాంటి పరిస్థితులు హైదరాబాద్ నగరానికి తలెత్తకూడదనే ప్రణాళికలు రూపొందించాం. హైదరాబాద్‌లో వాయు నాణ్యత(AQI) ఇప్పటికే ఆరెంజ్ కేటగిరీకి చేరింది. మరింత ప్రమాదకంగా జీవించడానికి వీలులేని పరిస్థితులు తెచ్చుకోవద్దు.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
కాలుష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం
హైదరాబాద్‌లో చెత్త పేరుకుపోతోందని, దోమలు పెరిగాయనో, మూసీలో కాలుష్యం పారుతోందని, నియంత్రించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రభుత్వం అందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టకుండా అది ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. నదుల్లో కాలుష్య నివారణకు ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యూపీలో గంగా నది ప్రక్షాళన, గుజరాత్‌లో సబర్మతీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులు చేపట్టినట్టే, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఎందుకు చేపట్టొద్దని అడిగారు.
సుప్రీంకోర్టు, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాల మేరకు మూసీ నదికి సంబంధించి బఫర్ జోన్ విషయంలో 2012 లో నిబంధనలు రూపొందించారన్నారు ముఖ్యమంత్రి. నాలా అయితే బఫర్ జోన్ ఎంతుండాలి? చెరువులైతే ఎంతుండాలి?నదులైతే ఎంతుండాలన్నది ఖరారు చేశారన్నారు. ఆ మేరకు మూసీ నది వెంట నాలా అయితే 10 మీటర్లు, నదికి 50 మీటర్ల బఫర్ జోన్ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని వెల్లడించారు.
‘గాంధీ సరోవర్ ప్రాజెక్టు వద్ద ఒక ఆపార్ట్‌మెంట్‌పై ఈ మధ్య చర్చ జరుగుతోంది. 7 ఎకరాల ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్ అంతే స్థలమిచ్చి, కొత్తగా నిర్మాణానికి అయ్యే ఖర్చును బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పాం. లేదా నష్టపరిహారం తీసుకుని వేరే ప్రాంతంలో కట్టుకుంటామన్నా ఇబ్బంది లేదని ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను సూచించింది. మూసీ రివర్ ఫ్రంట్ ఫేజ్ – 1 లో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 5 వేల కోట్లు, పది వేల కోట్లు వెచ్చిస్తున్నారంటూ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం దాదాపు 70 కోట్లు, విజ్ఞాన కేంద్రం, ఆ ప్రాంత అభివృద్ది మొత్తంగా 200 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది.’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
మూసీ నది ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి
కాలుష్య నివారణలో భాగంగా 2026 డిసెంబర్ 9 నాటికి హైదరాబాద్ లో ఆర్టీసీ ద్వారా వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీలో 2800 బస్సులు డీజిల్‌తో నడుస్తున్నాయని, కాలుష్య నియంత్రణలో భాగంగా వాటి స్థానంలో 500 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టామన్నారు.
డీజిల్ వాహనాలను ఓఆర్ఆర్ అవతలి ప్రాంతాలకు తరలించి వాటి స్థానంలో డిసెంబర్ నాటికి నూరు శాతం ఈవీ బస్సులను ప్రవేశపెడుతామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈవీ వాహనాలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈవీ వాహనాలకు జీరో పన్ను పాలసీ తెచ్చామన్నారు. కాలేజీలకు వెళ్లే విద్యార్థినులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలనుకుంటున్నామన్నారు.
నగరంలో 2 లక్షల ఆటోలున్నాయని, డీజిల్, పెట్రోల్ ఇతర ఇంధన ఆధారంగా నడుస్తున్న ఈ ఆటోలను రెట్రోఫిటింగ్ కింద ఈవీలుగా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సింగల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నామని, నగరంలో కాలుష్య కారక రెడ్, ఆరెంజ్ కేటగిరీలోని పరిశ్రమలను నగరం అవతలి వైపునకు తరలిస్తున్నామన్నారు.
హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటూ, నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.


