
📌 Key Points
- తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన.
- హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
- గత పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డుల పునరుద్ధరణ.
- చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందజేసిన వేడుకలో పలువురు సినీ ప్రముఖుల భాగస్వామ్యం.
తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దర్ ఫిలిం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందజేశారు. పరిశ్రమకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలో సింగిల్ విండో విధానం
తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నట్టుగానే హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.
హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల(TGFA) బహూకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ చైర్మన్ దిల్ రాజు, చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, మాధురి దీక్షిత్, జయసుధ, ఖుష్బూ, జెనీలియాతో పాటు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. “ఐటీ, ఫార్మా తరహాలోనే సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పోత్సహించాలన్న ఆలోచన చేసిన కారణంగానే రాష్ట్రంలో గత పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించాం. ఆగిపోయిన 10 ఏళ్ల అవార్డులనూ బహూకరించాం. రెండో విడతగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు. గద్దర్ సినిమా అవార్డులను ప్రధానం చేయడం తెలంగాణ ప్రభుత్వం ఒక బాధ్యతగా భావించింది.’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
సినీ పరిశ్రమకు ప్రోత్సాహం
ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ కు సినిమా పరిశ్రమ తరలిరావడానికి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, రామానాయుడు, కృష్ణ తీవ్రమైన కృషి చేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. చార్మినార్‌కు నాలుగు మినార్లు ఎలాగో తెలుగు సినిమా పరిశ్రమ తరలి రావడానికి ఈ నలుగురు విశేషంగా కృషి చేశారని వివరించారు.
సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని ఇళ్లు కట్టుకోవడానికి దానమిచ్చారన్నారు రేవంత్ రెడ్డి. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా పరిష్కరించడానికి దర్శకుడు దాసరి నారాయణ రావు చేసిన కృషి గుర్తుచేసుకోవలసిన అవసరం ఉందన్నారు. రామోజీరావు.. రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించడంతో హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ శాశ్వతంగా వేళ్లూనుకోవడానికి కారణమైందన్నారు.
హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అని కాకుండా పాన్ ఇండియా – భారతీయ సినిమా ఒక గ్లోబల్ హబ్‌గా పరిశ్రమ మొత్తం ఒకే గొడుగు కిందకు వచ్చి గొప్ప సినిమాలు అందించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హాలీవుడ్ సినిమాలను సైతం హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే నిర్మించేలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుందామన్నారు.
గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం
‘ ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టే. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం. అందుకు త్వరలోనే ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తాం. లక్షల కోట్ల మందిని తన గళంతో ప్రజలను ప్రభావితం చేసిన ప్రజాయుద్ధ నౌక గద్దర్ ఒక చైతన్యం, స్ఫూర్తి, అందుకని గద్దర్ పేరుతో ఈ అవార్డులను పునరుద్ధరించాం. సామాజిక సమస్యలను పరిష్కరించుకోవడానికి సినిమాలు అత్యంత ప్రభావవంతమైన ఆయుధం.’ అని రేవంత్ రెడ్డి చెప్పారు.
సమాజాన్ని చైతన్య పరిచేందుకు సినిమా ఒక సాధనంగా ఉపయోగపడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక బాధ్యతను గుర్తెరిగి, సామాజిక సమస్యల పరిష్కారానికి సినిమాల ద్వారా సందేశం అందించాలన్నారు. హైదరాబాద్, తెలంగాణ అత్యంత భద్రత కలిగిన రాష్ట్రమని, టాలెంట్‌కు అవకాశాలున్నాయన్నారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని చెప్పారు. హాలీవుడ్ చిత్రాలను ఇక్కడ నిర్మించాలని పిలుపునిచ్చారు. మీ పెట్టుబడులకు భద్రత ఉంటుందని, అందుకు తెలంగాణ ప్రభుత్వం హామీనిస్తుందన్నారు.
వీటితోపాటుగా వివిధ కేటగిరీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందించారు.
గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం తెలంగాణ సినిమా పరిశ్రమకు ఒక మైలురాయిగా నిలుస్తుంది. ప్రభుత్వం సినీ పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయని ఆశిద్దాం.


