
📌 Key Points
- ఎల్పీజీ సమస్యల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించగలరని పౌర సరఫరాల శాఖ ప్రకటన.
- వరంగల్, హనుమకొండ, కర్మన్‌ఘాట్‌లలో గృహ వినియోగ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- పెళ్లిళ్ల సీజన్ కావడంతో క్యాటరింగ్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.
- గ్యాస్ కొరత కారణంగా మెనూలో ఐటమ్‌లను తగ్గించే ఆలోచనలో క్యాటరింగ్ సంస్థలు.
తెలంగాణలో ఎల్పీజీ సిలిండర్ల సమస్యలపై ఫిర్యాదు చేయడానికి పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల కొరత పెళ్లిళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. క్యాటరింగ్ సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి.
ఎల్పీజీ సమస్యలపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నంబర్
తెలంగాణలో ఎల్‌పీజీ సిలిండర్లు, అక్రమ వాణిజ్య వినియోగం లేదా పౌర సరఫరాలకు సంబంధించిన ఇతర అంశాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఎదురైతే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1967కు డయల్ చేయాలని తెలంగాణ పౌర సరఫరాల శాఖ ప్రజలను కోరింది. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల అక్రమ మళ్లింపులపై చేసిన దాడుల సందర్భంగా, వరంగల్, హనుమకొండ, కర్మన్‌ఘాట్‌లలో 22 గృహ వినియోగ సిలిండర్లు, 25 చిన్న సిలిండర్లు, పలు గ్యాస్ రీఫిల్లింగ్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పెళ్లిళ్ల సీజన్ మెుదలైంది. చాలా వివాహాలు జరుగుతున్నాయి. అయితే దాదాపు అందరూ క్యాటరింగ్‌కు ఇస్తుంటారు. వెడ్డింగ్ సీజన్‌లో అనేక క్యాటరింగ్ సంస్థలు ఎల్పీజీ కొరత వల్ల కలిగే పరిస్థితిని ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తున్నాయి. పెళ్లి రోజు, తదుపరి రిసెప్షన్ రెండూ సాధారణంగా విలాసవంతమైన, రుచికరమైన విందుతో ఉంటాయి. క్యాటరర్లు తమకు ఆర్డర్‌లు ఇచ్చినవారి కోసం వంట గ్యాస్‌కు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
గృహ వినియోగ సిలిండర్లపై అధికారుల దాడులు
మెనూలో ఐటమ్‌లను తగ్గించడం గురించి కూడా ఆలోచిస్తున్నామంటున్నారు. కానీ ఇలా చేస్తే.. టోటల్ బడ్జెట్ మీద ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సూప్‌లు, స్వీట్లు, ఊరగాయలు, వెజ్ కర్రీలు, నాన్-వెజ్ కర్రీలు, రైస్, పులావ్, బిర్యానీలతో సహా కనీసం 16 నుండి 20 ఐటమ్‌లను అందిస్తారు. వంట గ్యాస్ కొరత కారణంగా కనీసం 8 నుండి 10 ఐటమ్‌లను తగ్గించాల్సి రావొచ్చేమోనని చెబుతున్నారు.
పెళ్లిళ్లపై గ్యాస్ సిలిండర్ కొరత ప్రభావం
ఈ సంక్షోభం కొనసాగితే రాబోయే రోజుల్లో గ్యాస్ సిలిండర్లు దొరకడం కష్టం అవుతుందని పలు క్యాలటరింగ్ సంస్థలు చెబుతున్నాయి. మెనూ ఐటెమ్‌లను తగ్గించడం, ఈవెంట్‌ల సంఖ్యను పరిమితం చేయడం తప్ప వేరే మార్గం లేదని అంటున్నారు. ఈ గ్యాస్ సంక్షోభం క్యాటరింగ్ వ్యాపారాలను, ఫంక్షన్ల కోసం క్యాటరర్లపై ఆధారపడిన కస్టమర్లను ప్రభావితం చేస్తోంది. వంట గ్యాస్ కొరత తమకు ఆందోళన కలిగిస్తుందని, పెద్ద ఆర్డర్‌లను నిర్వహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోందని ఆవేదన చెందుతున్నారు క్యాటరింగ్ చేసేవారు.
గ్యాస్ సిలిండర్ల కొరత కొనసాగితే క్యాటరింగ్ సంస్థలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


