|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నన్ను హీరోగా నిలబెట్టిన పిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు.. ఆయనతో 10 సినిమాలు చేశాను.. హీరో శ్రీకాంత్ కామెంట్స్

Published: 02-06-2025, 2:44 AM
నన్ను హీరోగా నిలబెట్టిన పిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు.. ఆయనతో 10 సినిమాలు చేశాను.. హీరో శ్రీకాంత్ కామెంట్స్

ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో హీరో శ్రీకాంత్, ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీకాంత్ తన కెరీర్‌పై ఎస్వీ కృష్ణారెడ్డి ప్రభావాన్ని వివరించారు.

Key Points

1

శ్రీకాంత్ గారు ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిలను తన కెరీర్‌లోని ముఖ్యమైన స్తంభాలుగా పేర్కొన్నారు.

2

ఎస్వీ కృష్ణారెడ్డి గారితో శ్రీకాంత్ 10 సినిమాలు చేశారని తెలిపారు.

4

యమలీల సినిమా తన జీవితంలో మరుపురానిది అని అలీ, తనికెళ్ళ భరణి తెలిపారు.

శ్రీకాంత్ గారి ప్రశంసలు

సకుటుంబసమేతంగా చూసే ఎన్నో చిత్రాలను రూపొందించి తెలుగు చిత్ర పరిశ్రమకు మర్చిపోలేని ఘన విజయాలు అందించిన దిగ్ధర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. 32 ఏళ్ల కెరీర్‌లో 42 ఎవర్ గ్రీన్ మూవీస్ డైరెక్ట్ చేశారు ఎస్వీ కృష్ణారెడ్డి. జూన్ 1న ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ ఎఫ్ఎన్ సీసీలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్ , హీరోయిన్స్ ఆమని, ఇంద్రజ, లయ, రవళి, కమెడియన్ బ్రహ్మానందం, అలీ, నటులు శివాజీ రాజా, తనికెళ్ల భరణి, చంద్రబోస్, రాజేంద్రప్రసాద్, రోజా , మురళీమోహన్, బండ్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు. ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పుకొచ్చారు.

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. “నన్ను హీరోగా నిలబెట్టిన ఫిల్లర్స్ లాంటి దర్శకులు ఇద్దరు.. ఒకరు ఈవీవీ సత్యనారాయణ, మరొకరు ఎస్వీ కృష్ణారెడ్డి. ఘటోత్కచుడు చిత్రంలో అర్జునుడిగా నటించాను. అది మా కాంబినేషన్‌లో మొదటి సినిమా. ఆ తర్వాత వినోదం, ఎగిరే పావురమా, ఆహ్వానం.. ఇలా పది చిత్రాలు చేశాను. నేను హీరోగా ఎదిగేందుకు ఆయన సినిమాలన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి” అని అన్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు

“ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు చేసిన ఎన్నో చిత్రాల్లో నేను నటించాను. నా జీవితంలో యమలీల సినిమా ఎప్పటికీ మర్చిపోలేను. స్నేహానికి వీరిద్దరూ మారుపేరు. నాలాగే ఎంతోమంది నటీనటుల కెరీర్‌లను నిలబెట్టిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా” కమెడియన్, నటుడు అలీ తెలిపాడు.

నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. “నా నట జీవితం యమలీలకు ముందు యమలీల తర్వాత అని చెప్పుకోవాలి. ఆ సినిమాలో తోట రాముడిగా నాకు మంచి పేరు వచ్చింది. ఎస్వీ కృష్ణారెడ్డి గారి చిత్రాల్లో నటించడం మర్చిపోలేని అనుభవం” అని వెల్లడించారు.

ఇతర సినీ ప్రముఖుల అభిప్రాయాలు

లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. “ఎస్వీ కృష్ణారెడ్డి గారు మా కుటుంబంలో పెద్ద లాంటి వారు. ఆయన నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారు. సినిమాలోని అన్ని పాటలు రాసే అవకాశం కూడా ఎస్వీ కృష్ణారెడ్డి కల్పించారు. మా కుటుంబం ఆయనను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం” అని చెప్పుకొచ్చారు.

నటుడు, నిర్మాత మురళీ మోహన్ మాట్లాడుతూ.. “కుటుంబ కథా చిత్రాలను రూపొందించి ఇండస్ట్రీకి స్ఫూర్తిగా నిలిచారు ఎస్వీ కృష్ణారెడ్డి గారు. ఆయన ఒక చిన్న సినిమా తీసినా అది చాలా పెద్ద విజయాన్ని అందుకునేది. ఈ రోజు ఆయన పుట్టినరోజు వేడుకలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడుతుడటం ఎస్వీ కృష్ణారెడ్డి గారి మంచితనానికి, గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం” అని తెలిపారు.

ఎస్వీ కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు సినీ ప్రముఖులతో సందడిగా సాగాయి. అనేకమంది తమ అనుభవాలను పంచుకుని, ఆయన సేవలను కొనియాడారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.