
📌 Key Points
- యాసిడ్ బగ్ (నైరోబి ఫ్లై) వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే చిన్న కీటకం.
- దీని శరీరంలోని పెడెరిన్ విషం చర్మంపై మంట, బొబ్బలు, గాయాలు కలిగిస్తుంది.
- కీటకాన్ని నలపకుండా, ఊది తోసేయాలి; తాకితే సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి.
- రాత్రిపూట లైట్ల వెలుగుకు ఆకర్షితమవుతాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో యాసిడ్ పురుగుల బెడద ప్రజలను కలవరపెడుతోంది. ముఖ్యంగా రాజమండ్రి ప్రాంతంలో నైరోబి ఫ్లై కారణంగా చర్మ సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఈ కీటకాల వల్ల కలిగే ప్రమాదాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం అత్యవసరం.
యాసిడ్ బగ్ అంటే ఏమిటి? దాని ప్రభావం
యాసిడ్ బగ్ ఈ మధ్య వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఏపీలోని రాజమండ్రి దగ్గర ఉన్న బుర్రిలంకలో దీని కారణంగా నర్సరీలో పని చేస్తున్నవారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చిన్న కీటకం కారణంగా చర్మ సమస్యలు వస్తున్నాయి. దీని నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం.
యాసిడ్ బగ్ అనేది సాధారణంగా నైరోబి ఫ్లై (Nairobi Fly) అని పిలవబడే ఒక చిన్న కీటకం. ఇది పేడెరస్ (Paederus) జాతికి చెందిన రోవ్ బీటిల్. చాలా చిన్నగా.. 6 నుంచి 10 మిల్లీమీటర్ల పొడవు ఉంటుంది. ఎరుపు-నలుపు లేదా ఆరెంజ్-నలుపు రంగులో ఉండి.. చీమలా కనిపిస్తుంది కానీ నిజానికి బీటిల్. తూర్పు ఆఫ్రికాలో నైరోబి ప్రాంతం నుంచి మొదలైన దీని ప్రయాణం.. ఎక్కువగా భారతదేశం, ఆసియా దేశాలలో కనిపిస్తుంది. వర్షాకాలంలో, పంట కోత సమయంలో సంఖ్య ఎక్కువవుతుంది. తేమగా ఉండే ప్రదేశాలను ఇష్టపడుతుంది. ఈ కీటకం కరవదు లేదా కుట్టదు. కానీ దీని శరీరంలో పెడెరిన్ అనే బలమైన విష పదార్థం ఉంటుంది. ఈ విషం బ్యాక్టీరియా ద్వారా ఉత్పత్తి అవుతుంది. కీటకాన్ని నొక్కినా లేదా చంపినా ఈ విషం చర్మంపైకి వచ్చి తీవ్రమైన సమస్యలు కలిగిస్తుంది.
మనుషులపై ప్రభావం (పేడెరస్ డెర్మటైటిస్):
* చర్మంపై తాకిన వెంటనే మంట, ఎర్రటి గాయాలు, బొబ్బలు వస్తాయి.
నైరోబి ఫ్లై వల్ల కలిగే చర్మ సమస్యలు
* గాయాలు తరచుగా లైన్ లాగా ఏర్పడతాయి.
* కళ్లలోకి విషం పడితే ‘నైరోబి ఐ’ అని పిలుస్తారు. కళ్లు ఎర్రబడి, నీరు కారి, తీవ్రమైన నొప్పి వస్తుంది.
* గాయాలు 7 నుంచి 28 రోజుల్లో మానవచ్చు కానీ చర్మంపై మచ్చలు మిగిలిపోవచ్చు.
* ఈ కీటకాలను ఎప్పుడూ నొక్కొద్దు. నలపొద్దు. ఊది తోసేయాలి లేదా ఓ పేపర్‌తో పడేయాలి.
యాసిడ్ పురుగుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* రాత్రి సమయంలో లైట్ల వెలుగుకు ఆకర్షితమై ఇళ్లలోకి వస్తాయి కాబట్టి లైట్స్ ఆఫ్ చేసే ప్రయత్నం చేయాలి.
* తాకినట్లు అనిపిస్తే తక్షణం సబ్బు నీటితో బాగా కడగాలి.
* కళ్లలో పడకుండా.. నోటి దగ్గరగా వెళ్లకుండా.. జాగ్రత్త వహించాలి.
యాసిడ్ పురుగుల వల్ల కలిగే ప్రమాదాలను తేలికగా తీసుకోకూడదు. సరైన జాగ్రత్తలు పాటిస్తూ, అవగాహనతో ఉండటం ద్వారా ఈ కీటకాల బారి నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ప్రజారోగ్యం పట్ల అప్రమత్తత అవశ్యం.


