
📌 Key Points
- కుర్చీలోంచి లేచి కూర్చునే పరీక్షతో ఆయుష్షును అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తల పరిశోధన.
- కండరాల బలం ఉన్నవారిలో మరణ ప్రమాదం తక్కువగా ఉందని న్యూయార్క్ అధ్యయనం వెల్లడి.
- భారతదేశంలో వృద్ధ మహిళల స్వతంత్ర జీవనానికి కండరాల బలం అత్యవసరం.
- ఈ పరీక్షను ఇంట్లోనే సులభంగా, ఉచితంగా చేసుకోవచ్చు.
భారతదేశంలో వృద్ధుల సంక్షేమం, ముఖ్యంగా వృద్ధ మహిళల ఆరోగ్యంపై తాజా పరిశోధనలు కీలక అంశాలను వెల్లడిస్తున్నాయి. కండరాల బలం, ఆయుష్షు మధ్య సంబంధాన్ని వివరిస్తూ, ఇది ప్రభుత్వ ఆరోగ్య విధానాలపై, సామాజిక భద్రతా కార్యక్రమాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చర్చనీయాంశంగా మారింది.
ఆయుష్షును అంచనా వేసే వినూత్న పరీక్ష
Healthy lifestyle : సాధారణంగా సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితం అనగానే మనమంతా మంచి ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన నిద్ర లేదా హెల్త్ చెకప్‌ల గురించే ఆలోచిస్తాము. కానీ, మీరు ఒక కుర్చీలోంచి 30 సెకన్ల పాటు ఎన్నిసార్లు లేచి కూర్చోగలరనే చిన్న పరీక్ష.. మీ ఆరోగ్యం, ఆయుష్షు గురించి ఎన్నో కీలక విషయాలను చెబుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు!
ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని ‘యూనివర్సిటీ ఎట్ బఫెలో’ పరిశోధకులు 63 నుంచి 99 ఏళ్ల మధ్య వయసున్న 5,000 మందికి పైగా మహిళలపై ఒక ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. ఇందులో వారి చేతి పట్టు (Grip Strength), లోయర్-బాడీ (నడుము కింది భాగం) బలాన్ని పరీక్షించారు. ఈ పరిశోధనలో శారీరకంగా మంచి దృఢత్వం, కండరాల బలం ఉన్న మహిళల్లో.. తర్వాతి ఎనిమిదేళ్ల కాలంలో మరణించే ప్రమాదం చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది. వారి రోజువారీ వ్యాయామాలు, ఫ్యాట్ లెవల్స్ ఎలా ఉన్నప్పటికీ, కేవలం కండరాల బలం మాత్రమే వారిని ఎక్కువ కాలం జీవించేలా చేసిందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వయసు పైబడుతున్న కొద్దీ శరీరంలో కండరాల బలం తగ్గడం అనేది కేవలం ఫిట్‌నెస్ సమస్య మాత్రమే కాదు, అది మీ సంపూర్ణ ఆరోగ్యానికి, ఆయుర్దాయానికి ఒక సంకేతం అని దీని ద్వారా తేలింది.
భారతదేశంలో ఈ పరిశోధన ఫలితాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్’ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో లక్షలాది మంది వృద్ధ మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ కండరాల బలం తగ్గడం వల్ల వీరు త్వరగా అలసిపోవడం, కిందపడటం, ఎముకలు విరగడం వంటి సమస్యల బారిన పడుతున్నారు. అందువల్ల స్వతంత్రంగా, గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి కండరాల బలం ఎంతో అవసరం.
ఈ పరీక్షను ఎవరైనా ఇంట్లోనే చాలా సులభంగా, ఎలాంటి జిమ్ పరికరాలు లేదా వైద్యుల పర్యవేక్షణ లేకుండా ఉచితంగా చేసుకోవచ్చు.
చేసే విధానం: మొదట ఒక కుర్చీలో వెనుకకు ఆనుకోకుండా నేరుగా కూర్చోండి. మీ రెండు చేతులను గుండెలపై క్రాస్‌గా (ఎక్స్ ఆకారంలో) ఉంచుకోండి.
భారతదేశంలో వృద్ధ మహిళల ఆరోగ్య సవాళ్లు
ఇప్పుడు 30 సెకన్ల సమయం పెట్టుకుని, చేతుల సాయం లేకుండా పూర్తిగా నిలబడుతూ, మళ్లీ కూర్చుంటూ ఉండాలి.
ఈ 30 సెకన్లలో మీరు ఎన్నిసార్లు లేచి కూర్చోగలిగారో లెక్కించండి. ఇది మీ కండరాల శక్తిని, బ్యాలెన్స్‌ను తెలియజేస్తుంది.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. కండరాలను బలోపేతం చేసే పనులు చేయడం వల్ల అనేక పెద్ద వ్యాధుల ముప్పు తప్పుతుంది. కండరాల బలం బాగుంటే:
గుండె జబ్బులు, మధుమేహం (డయాబెటిస్), ఊపిరితిత్తుల వ్యాధులు మరియు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం తగ్గుతుంది.
శరీర బ్యాలెన్స్ మెరుగై హఠాత్తుగా కిందపడిపోయే ప్రమాదాలు తప్పుతాయి.
వృద్ధాప్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా సొంత పనులు చేసుకోవచ్చు.
కండరాల బలం: దీర్ఘాయుష్షుకు కీలకం
వయసు పెరిగే కొద్దీ కండరాల పరిమాణం కంటే వాటి శక్తి వేగంగా క్షీణిస్తుంది, అందుకే ముందుగానే జాగ్రత్త పడాలి.
ఈ పరీక్ష అందరికీ సురక్షితమే అయినప్పటికీ, ఇప్పటికే కీళ్ల నొప్పులు, తీవ్రమైన మోకాళ్ల సమస్యలు, ఆర్థరైటిస్, లేదా ఇటీవల సర్జరీలు అయినవారు వైద్యుల సలహా లేకుండా దీనిని ప్రయత్నించవద్దు. అలాగే 40 ఏళ్లు పైబడిన వారు లేదా నిలబడేటప్పుడు కాస్త కళ్లు తిరిగినట్లు అనిపించే వారు పక్కన ఎవరైనా సహాయకులను ఉంచుకోవడం మంచిది.
వృద్ధాప్యంలో కండరాలను కాపాడుకోవడానికి భారీ వర్కౌట్లు అవసరం లేదు. ప్రతిరోజూ కాసేపు నడవడం, యోగా, లైట్ రెసిస్టెన్స్ వ్యాయామాలు, స్క్వాట్స్ (బాడీ వెయిట్ వ్యాయామాలు) చేయడం, ఆహారంలో పప్పులు, గుడ్లు, పనీర్ వంటి ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ద్వారా కండరాల బలాన్ని పెంచుకోవచ్చు.
గుర్తుంచుకోండి, ఈ పరీక్ష మీ ఆయుష్షును ఖచ్చితంగా లెక్కగట్టేది కాదు.. కానీ మీ శారీరక ఆరోగ్యం క్షీణిస్తోందని హెచ్చరించే ఒక అలారమ్ లాంటిది!
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More
ఈ సాధారణ పరీక్ష వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, దేశంలో వృద్ధుల సంక్షేమం, వారి స్వతంత్ర జీవనానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచిస్తుంది. కండరాల బలాన్ని పెంచే కార్యక్రమాలు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.


