
📌 Key Points
- హైదరాబాద్ ORRపై యశ్వంత్ రెడ్డి 200 కి.మీ వేగంతో కారు నడిపి రీల్స్ చేశాడు.
- ఈ ప్రమాదకర వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది.
- నార్సింగి పోలీసులు ఫిర్యాదు ఆధారంగా యశ్వంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
- BNS సెక్షన్లు 125, 281 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం 200 కి.మీ వేగంతో కారు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన యువకుడిని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రోడ్డు భద్రత, యువత నిర్లక్ష్యంపై తీవ్ర చర్చకు దారితీసింది.
ORRపై రీల్స్ పిచ్చి: 200 కి.మీ వేగంతో డ్రైవింగ్
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటోంది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం అత్యంత ప్రమాదకర రీతిలో కారును రేసింగ్ ట్రాక్‌లా పరిగెత్తించిన ఒక యువకుడిని సైబరాబాద్ పరిధిలోని నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏకంగా గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో లగ్జరీ కారును నడుపుతూ, ఇతర వాహనదారుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టిన ఈ ఘటన ఇతరులను కూడా ఆందోళనకు గురి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలోని అల్కాపూర్ టౌన్‌షిప్‌కు చెందిన కొత్తపల్లి యశ్వంత్ రెడ్డి (32) అనే వ్యక్తిని ఈ కేసులో నిందితుడిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
గత మే 10వ తేదీ ఉదయం 10:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదకర స్టంట్ చోటుచేసుకుంది. నిందితుడు యశ్వంత్ రెడ్డి ఇటీవల కొనుగోలు చేసిన ఒక సరికొత్త లగ్జరీ కారుతో (తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్ TG TR 2026) ఓఆర్‌ఆర్ ఎంట్రీ నంబర్ 18(A) ద్వారా రింగ్ రోడ్డుపైకి ప్రవేశించాడు. నార్సింగి టోల్ ప్లాజా నుంచి టీజీపీఏ (TGPA) టోల్ ప్లాజా వైపు వెళ్లే మార్గంలో కారు యాక్సిలరేటర్‌ను గట్టిగా నొక్కాడు. చూస్తుండగానే కారు స్పీడోమీటర్ 200 కిలోమీటర్ల మార్కును దాటేసింది.
వైరల్ వీడియో, పోలీసుల దర్యాప్తు
కారు అంత వేగంతో దూసుకెళ్తుండగా.. యశ్వంత్ రెడ్డి ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని, మరో చేత్తో తన మొబైల్ ఫోన్ ద్వారా స్పీడోమీటర్, రోడ్డును కవర్ చేసేలా వీడియో రికార్డ్ చేశాడు. అనంతరం ఆ ప్రమాదకరమైన వీడియోను తన వ్యక్తిగత ‘యశ్వంత్ రెడ్డి’ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో తోటి వాహనదారులు, సామాన్య ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.
వైరల్ వీడియోపై స్పందించిన హైవే పెట్రోలింగ్ అధికారి కారింగుల సాయిరాం మే 19న నార్సింగి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా నార్సింగి పోలీసులు విచారణ చేపట్టారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 125 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం), సెక్షన్ 281 (ప్రజా మార్గంలో నిర్లక్ష్యంగా వాహనం నడపడం) కింద క్రైమ్ నంబర్ 396/2026 గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
యశ్వంత్ రెడ్డి అరెస్ట్: చట్టపరమైన చర్యలు
సాంకేతిక ఆధారాలు, సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా యొక్క డిజిటల్ ఫుట్‌ప్రింట్లను ట్రాక్ చేసిన పోలీస్ దర్యాప్తు బృందం… యశ్వంత్ రెడ్డిని పట్టుకుంది. విచారణలో నిందితుడు తాను ఏప్రిల్ 2026లో కారు కొనుగోలు చేశానని…. కేవలం సోషల్ మీడియాలో క్రేజ్ కోసమే మే 10న ఈ స్టంట్ చేసినట్లు అంగీకరించాడు. దీంతో సైబరాబాద్ పోలీసులు నేరానికి ఉపయోగించిన లగ్జరీ కారును సీజ్ చేసి… నిందితుడిపై తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More
సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఎంత ప్రమాదకరమో ఈ ఘటన నిరూపించింది. చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.


