|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ట్రంప్‌తో చర్చలకు ససేమిరా! ఇరాన్ చీఫ్ సంచలన ప్రకటన! యుద్ధం మరింత ముదిరేనా?

Published: 02-03-2026, 2:35 AM
ట్రంప్‌తో చర్చలకు ససేమిరా! ఇరాన్ చీఫ్ సంచలన ప్రకటన! యుద్ధం మరింత ముదిరేనా?
  • ట్రంప్‌తో చర్చలు జరిపే ప్రసక్తి లేదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ స్పష్టం చేశారు.
  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు ప్రాంతీయ అస్థిరతకు కారణమని లారిజానీ విమర్శించారు.
  • ఖమేనీ మరణానంతరం ఇరాన్ ప్రతీకార దాడులను ఉధృతం చేసింది.
  • టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు కొనసాగుతున్నాయని సమాచారం.

ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ట్రంప్‌తో చర్చలకు ఇరాన్ నిరాకరించింది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ కూడా టెహ్రాన్‌పై దాడులు చేస్తోంది. యుద్ధ వాతావరణం నెలకొంది.

ట్రంప్‌తో చర్చలపై ఇరాన్ చీఫ్ స్పష్టీకరణ

ఇజ్రాయెల్ – అమెరికా కలిసి టెహ్రాన్ పై చేసిన దాడుల్లో ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ దేశాలపై ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. నిన్నటి నుంచి మూడు దేశాల మధ్య యుద్ధం మరింత తీవ్రమయింది. అలాగే గల్ఫ్ దేశాలపై కూడా ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక తాజాగా.. ఇరాన్ ట్రంప్ తో చర్చలకు ట్రై చేస్తున్నట్లు వార్తలు రాగా.. వాటిని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ ఖండించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.

అమెరికాతో తాము చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, మధ్యవర్తుల ద్వారా వాషింగ్టన్‌తో సంప్రదింపులు జరుపుతున్నామనే రిపోర్టులను ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ అలీ లారిజానీ కొట్టిపారేశారు. ట్రంప్ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే ప్రాంతీయ అస్థిరతకు కారణమని లారిజానీ విమర్శించారు. ట్రంప్ తన అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని ఇజ్రాయెల్ ఫస్ట్ గా మార్చేశారని ఆరోపించారు. ఇజ్రాయెల్ అధికార దాహం కోసం అమెరికా సైనికుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. “మేము ఈ యుద్ధాన్ని ప్రారంభించలేదు.. కానీ దురాక్రమణను సహించబోము” అని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా విధానాలపై ఇరాన్ ఆగ్రహం

ఇరాన్‌లో కొత్త నాయకత్వంతో చర్చలు జరిపేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ అధికారులు పేర్కొన్నారు. అయితే.. చర్చల ప్రతిపాదనలు పక్కన పెడితే.. ప్రస్తుతం కొనసాగుతున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) మాత్రం ఆగదని అమెరికా స్పష్టం చేసింది. ఖమేనీ మరణానంతరం ఇరాన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన తాత్కాలిక మండలి ప్రస్తుతం సుప్రీం లీడర్ బాధ్యతలను నిర్వహిస్తోంది.

టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, ఉధృతమవుతున్న ప్రతీకారాలు

మరోవైపు ఇరాన్ తన ప్రతీకార దాడులను ఉధృతం చేసింది. సోమవారం ఉదయం ఇరాన్ మధ్య భాగం నుండి శత్రువుల స్థావరాలే లక్ష్యంగా భారీగా క్షిపణులను ప్రయోగించినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం పట్టు సాధించింది. భద్రత, నిఘా, సైనిక కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. టెహ్రాన్‌తో పాటు దోహా, దుబాయ్, జెరూసలేంలలో భారీ పేలుళ్లు సంభవించాయి. కువైట్ తన గగనతలంలోకి వచ్చిన డ్రోన్లను కూల్చివేసింది. సైప్రస్‌లోని బ్రిటన్‌కు చెందిన ఆర్‌ఏఎఫ్ అక్రోతిరి (RAF Akrotiri) బేస్‌పై డ్రోన్ దాడి జరిగింది.

మొత్తానికి ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చర్చలకు ఆస్కారం లేదని ఇరాన్ తేల్చి చెప్పడంతో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.