
📌 Key Points
- విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదలకు సెన్సార్ సమస్యలు అడ్డంకిగా మారాయి.
- సినిమా విడుదల కాకపోవడంతో అమెజాన్ ప్రైమ్ నిర్మాతల మీద ఒత్తిడి తెస్తోంది.
- రూ.121 కోట్లకు డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిన అమెజాన్ ప్రైమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
- అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారైతే సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
విజయ్ దళపతి చివరి సినిమా ‘జన నాయగన్’ విడుదలకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. సెన్సార్ సమస్యలతో పాటు, అమెజాన్ ప్రైమ్ నుండి వస్తున్న ఒత్తిడి నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఈ సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
సెన్సార్ సమస్యలతో విడుదల వాయిదా
Jana Nayagan: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy).. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం ‘జన నాయగన్’. ఈ చిత్రాన్ని తెలుగులో జననాయకుడు, హిందీలో జననేత అంటూ డబ్బింగ్ వెర్షన్లలో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ సమస్యల వల్ల వాయిదా పడింది. ఇక సెన్సార్ తీర్పును సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించిన నిర్మాతలకు నిరాశ మిగిలిందని చెప్పాలి. ఇప్పటికీ కూడా ఈ సినిమా విడుదలపై నిర్మాతలు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
అయితే ఇలాంటి సమయంలో ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి కూడా చిత్ర బృందానికి భారీ షాక్ తగిలిందని సమాచారం. జన నాయగన్ సినిమా దళపతి విజయ్ కెరియర్ లో చివర సినిమా కావడం గమనార్హం. దీని తర్వాత ఆయన పూర్తిగా తన జీవితాన్ని రాజకీయాలకే పరిమితం చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే తన రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తూ తన పార్టీని ప్రజలలో బలోపేతం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయ్ దళపతి చివరి సినిమా విడుదలకు సెన్సార్ సమస్యలు ఏర్పడడంతో కొంతమంది కావాలనే చేస్తున్నారు అనే కామెంట్లు కూడా విజయ్ అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ నుండి ఒత్తిడి
ఇదిలా ఉండగా విజయ్ చివరి సినిమా కావడంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా రూ.121 కోట్లకు సొంతం చేసుకుంది. జనవరి 9వ తేదీన ఈ సినిమా అసలు విడుదల తేదీ.. దీని ప్రకారం అటు అమెజాన్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా నిర్ణయించింది. కానీ ఈ సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కాకపోవడంతో ఓటీటీ నుంచి నిర్మాతలపై ఒత్తిడి పెరుగుతోందట. ముఖ్యంగా ఒప్పందం ప్రకారం నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమా? లేదా అగ్రిమెంట్ మొత్తాన్ని తగ్గించుకోవడమా? ఇలా ఏదో ఒకటైతే కచ్చితంగా చేస్తామని అమెజాన్ ప్రైమ్ హెచ్చరించినట్లు సమాచారం.
ఏది ఏమైనా అసలే సెన్సార్ లభించక ఇబ్బంది పడుతున్న చిత్ర బృందానికి.. ఇప్పుడు ఓటీటీ నుండి కూడా ఇబ్బందులు ఎదురవడంతో అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరొకవైపు అటు తమిళనాడులో కూడా అసెంబ్లీ ఎన్నికల తేదీలు త్వరలో ఖరారుకానున్నాయి. ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెలువడితే మాత్రం ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే నిర్మాతలు ఈ సినిమా విడుదలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై విజయ్ దళపతి ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. ఇక ఈ సినిమా విషయానికొస్తే విజయ్ దళపతి హీరోగా.. పూజా హెగ్డే హీరోయిన్ గా, మమిత బైజు కీలక పాత్ర పోషిస్తున్నారు. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట కే నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఎన్నికల ప్రభావంతో మరింత ఆలస్యం?
మొత్తానికి సెన్సార్ సమస్యలు, ఓటీటీ ఒత్తిడితో ‘జన నాయగన్’ సినిమా విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల తేదీలు ప్రకటనతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.


