
📌 Key Points
- జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించింది.
- ఎన్టీఆర్ పేరు, ఫోటో, వాయిస్ వాడాలంటే అనుమతి తప్పనిసరి చేసింది.
- వాణిజ్యపరంగా ఎన్టీఆర్ పేర్లు వాడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక.
- సెలబ్రిటీల హక్కుల పరిరక్షణకు కోర్టులు మొగ్గు చూపుతున్నాయని తెలిపింది.
టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన అనుమతి లేకుండా AI టెక్నాలజీ ద్వారా తన ఫోటోలు, వీడియోలను వాడుతున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎన్టీఆర్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఎన్టీఆర్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు
Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసేస్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా ఎంతోమంది AI టెక్నాలజీ ద్వారా తన ఫోటోలు వీడియోలను ఉపయోగిస్తున్నారనీ, తన వ్యక్తిగత హక్కులను పరిరక్షించాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ దాఖలు చేసిన ఈ పిటీషన్ విచారణ అనంతరం ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణ జరిపిన అనంతరం కోర్ట్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ పలు ఆదేశాలను జారీ చేసింది. నటుడు ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఇకపై ఆయన పేరును గాని, ఫోటోలను కానీ, ఏఐ ద్వారా రూపొందించిన వాయిస్ కూడా ఉపయోగించడానికి వీలులేదని తెలిపింది.
ఎన్టీఆర్ ఫోటోలను మాత్రమే కాకుండా ఆయన గుర్తింపు పొందిన ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, తారక్, గాడ్ ఆఫ్ మాసేస్ , యంగ్ టైగర్ వంటి బిరుదులను కూడా అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలులేదని కోర్టు తెలిపింది. వాణిజ్యపరంగా ఈ పేర్లను ఎవరైనా వాడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఈ పేర్లను వాణిజ్యపరంగా ఉపయోగించాలి అంటే కచ్చితంగా ఎన్టీఆర్ నుంచి అనుమతి తప్పనిసరి అని ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటివరకు వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఏ ఐ ద్వారా రూపొందించిన ఫోటోలు కానీ, వీడియోలు కానీ ఉంటే వెంటనే కోర్ట్ ఆదేశించిన నిర్ణీత గడువులోపు తొలగించాలని సూచించింది.
వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు
ఇకపై నటుడు ఎన్టీఆర్ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో తమ స్వలాభం కోసం ఎన్టీఆర్ ఫోటోలు గాని మార్ఫింగ్ చేసిన కంటెంట్ ఉపయోగించడం అంటే ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కించపరచినట్లేనని భావిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోబడతాయంటూ కోర్టు వార్నింగ్ ఇచ్చింది. ఈ విధంగా ఢిల్లీ హైకోర్టు నుంచి ఎన్టీఆర్ కు అనుగుణంగా తీర్పు రావడంతో ఎన్టీఆర్ కు భారీగా ఉపశమనం కలిగిందనే చెప్పాలి.
ఇటీవల కాలంలో ఎంతో మది సెలబ్రిటీలు తమ వ్యక్తిగత హక్కులను కాపాడాలి అంటూ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. AI టెక్నాలజీ వచ్చిన తర్వాత సెలబ్రిటీలకు తెలియకుండా వారి ఫోటోలు వాయిస్ ద్వారా ఎన్నో రకాల వీడియోలు వాణిజ్య ప్రకటనలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇలా సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ఫోటోలు వీడియోలు ఉపయోగిస్తూ వారి పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న నేపథ్యంలోనే సెలబ్రిటీలు కోర్టును ఆశ్రయిస్తున్నారు.
AI వినియోగంపై ఆంక్షలు విధించిన కోర్టు
ఢిల్లీ హైకోర్టు తీర్పు జూనియర్ ఎన్టీఆర్ కు ఊరటనిచ్చింది. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల విషయంలో కోర్టులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని ఈ తీర్పు ద్వారా తెలుస్తోంది.


