
📌 Key Points
- ఖమ్మం వెలుగుమట్లలో నిరాహార దీక్ష చేపట్టిన కవిత, విశారదన్ మహారాజ్
- పోలీసులచే దీక్ష భగ్నం, కవిత అరెస్ట్, హైదరాబాద్ తరలింపు
- వెలుగుమట్ల బాధితులకు కవిత సంఘీభావం, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
- బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టీకరణ
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా నిరాహార దీక్ష చేస్తున్న కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌తో కలిసి ఆమె ఈ దీక్ష చేపట్టారు. ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.
వెలుగుమట్లలో కవిత నిరాహార దీక్ష
ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహారాజ్‌తో కలిసి కవిత సోమవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే వీరి దీక్షను ఇవాళ పోలీసులు భగ్నం చేయగా… ఇద్దర్ని అరెస్ట్ చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవితను హైదరాబాద్ కు తరలించారు.
పోలీసులచే దీక్ష భగ్నం, అరెస్ట్
సోమవారం వెలుగుమట్ల బాధితులను కలిసిన కవిత… వారికి సంఘీభావం తెలిపారు. పేదల ఇళ్లను కూల్చటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ చేసిందని విమర్శించారు. ఇళ్లు కూల్చి పేదలను రోడ్డున పడేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు. కూల్చిన చోటే బాధితులకు కొత్త ఇళ్లు కట్టివ్వాలి న్యాయం జరిగే వరకు బాధితులతో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం: కవిత
“జాగృతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసీ, ధర్మసమాజ్ పార్టీ సంయుక్తంగా వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా ఆందోళన చేపట్టాం. ఏ పార్టీ, ఏ సంస్థ కూడా చెప్పనంత బలంగా వారి సమస్యను మేము చెప్పాం. ప్రత్యేకించి వారి సమస్యలు, ఆకాంక్షలను రాష్ట్రస్థాయిలో వినిపించామని బలంగా నమ్ముతున్నాం. ఈ సమస్య పరిష్కరమయ్యే వరకు కూడా రకరకాలుగా ఆందోళన చేస్తామని భూ నిర్వాసితులకు హామీ ఇస్తున్నాం. అదే విధంగా బాధితుల ఇళ్లను ఎక్కడ కూల్చారో అక్కడే వాళ్లకు ఇళ్లను కట్టించాలి. అది ప్రభుత్వ భూమి కాదు, భూదాన్ భూమి. భూదాన్ భూమి అంటేనే పేద ప్రజలకు పంచాల్సిన భూమి. బాధితులకు ఇళ్లు కట్టించే వరకు మా పోరాటం వివిధ రూపాల్లో కొనసాగిస్తూనే ఉంటాం” అని కవిత స్పష్టం చేశారు.
వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఈ సమస్యను రాష్ట్ర స్థాయిలో వినిపించామని ఆమె తెలిపారు.


