
📌 Key Points
- కింగ్ చార్లెస్ అమెరికా పర్యటనలో కోహినూర్ వజ్రం చర్చ మళ్లీ ప్రారంభమైంది.
- న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని కోరతానని అన్నారు.
- కోహినూర్ వజ్రం 13వ శతాబ్దంలో గోల్కొండ గనులలో బయటపడింది.
- భారత్ దశాబ్దాలుగా వజ్రం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, బ్రిటన్ చట్టబద్ధంగా తమదే అంటోంది.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ అమెరికా పర్యటన వేళ కోహినూర్ వజ్రం భారత్‌కు తిరిగి అప్పగింత అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ కింగ్ చార్లెస్‌ను వ్యక్తిగతంగా వజ్రం గురించి అడుగుతానని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చారిత్రక వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
న్యూయార్క్ మేయర్ సంచలన వ్యాఖ్యలు
బ్రిటర్ మహారాణి కిరిటంలో పొదిగి ఉన్న కోహినూర్ వజ్రం తిరిగి భారత్ కు అప్పగించే అంశంపై చాలాకాలం చర్చ జరుగుతోంది. ఈ వజ్రాన్ని భారత్‌కు వాపసు చేయాలంటూ లండన్‌లో నిరసన ప్రదర్శనలు సైతం జరిగాయి. అయితే ప్రస్తుతం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III అమెరికా పర్యటనలోఉన్న వేళ ఈ అంశం మరోసారి తెరపైకి రావడం ఆసక్తిగా మారింది. చారిత్రాత్మక కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని తాను బ్రిటన్ రాజును కోరతానని భారతీయ మూలాలు కలిగిన న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోహినూర్ వజ్రం చరిత్ర, వివాదం
సెప్టెంబర్ 11 దాడుల బాధితుల సంస్మరణ కార్యక్రమానికి ముందు జరిగిన విలేకరుల సమావేశంలో మమ్దానీ మాట్లాడారు. ఈ అంశం అధికారిక ఎజెండాలో లేనప్పటికీ, కింగ్ చార్లెస్‌తో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా కోహినూర్ వజ్రం తిరిగి భారత్‌కు చేరాలని తాను ప్రోత్సహిస్తానని ఆయన పేర్కొన్నారు. వలస పాలనలో వజ్రాన్ని బలవంతంగా లాక్కెళ్లారని, అది తమ దేశ చరిత్రలో ఒక విలువైన భాగమని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. తమ దేశ సంపదను తిరిగి ఇచ్చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తోంది. అయితే, 19వ శతాబ్దపు ఒప్పందం ప్రకారం ఆ వజ్రం చట్టబద్ధంగా తమదేనని బ్రిటన్ వాదిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ మేయర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. నిజంగానే జోహ్రాన్ మమ్దానీ ఈ వజ్రం విషయాన్ని కింగ్ చార్లెస్‍తో ప్రస్తావిస్తే ఆయన మాటను ఏ మేరకు మన్నిస్తారో చూడాలి.
భారత్ డిమాండ్, బ్రిటన్ వాదన
105.6 క్యారెట్ల బరువున్న ఈ అమూల్యమైన ఈ కోహినూరు వజ్రం13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యంలో ఇప్పుడు తెలంగాణలోని గోల్కొండ ప్రాంతంలో ఉన్న కొల్లూరు గనులలో మొదట బయటపడింది. ఆ తర్వాత ఎందరో రాజులు, రాజ్యాల చేతులు మారడంతో పాటు ఈ వజ్రం ఎన్నో భీకర యుద్ధాలకు దారితీసింది. దీన్ని పొందేందుకు హింస, విద్రోహం, చిత్రహింసలు, హత్యలు వంటివి శతాబ్దాల తరబడి సాగాయి. మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్ల చేతులు మారుతూ వచ్చి చివరకు 1849లో లాహోర్ ఒప్పందం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ నాటి చిన్నారి మహారాజా దులీప్ సింగ్‌ను బలవంతం చేసి ఈ వజ్రాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇది బ్రిటన్ రాణి కిరీటంలో పొదగబడి, లండన్ టవర్‌లో ప్రదర్శనలో ఉంది.
న్యూయార్క్ మేయర్ చేసిన వ్యాఖ్యలు కోహినూర్ వివాదాన్ని మళ్లీ చర్చలోకి తెచ్చాయి. కింగ్ చార్లెస్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. వజ్రం చరిత్ర, దాని ప్రస్తుత స్థితిపై ప్రపంచవ్యాప్తంగా దృష్టి నెలకొంది.


