|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

చిరంజీవి మూవీతో కోట శ్రీనివాసరావు కెరీర్- పద్మశ్రీ పురస్కారం, 9 నంది అవార్డులు- బ్యాంక్ ఉద్యోగి నుంచి ఎమ్మెల్యే వరకు!

Published: 13-07-2025, 3:11 AM
చిరంజీవి మూవీతో కోట శ్రీనివాసరావు కెరీర్- పద్మశ్రీ పురస్కారం, 9 నంది అవార్డులు- బ్యాంక్ ఉద్యోగి నుంచి ఎమ్మెల్యే వరకు!

తెలుగు సినీ ఇండస్ట్రీకి విషాదం! ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. చిరంజీవి సినిమాతో ప్రారంభమైన ఆయన నట ప్రస్థానం, అందుకున్న అవార్డులు, రాజకీయ జీవితం గురించి తెలుసుకుందాం.

Key Points

1

చిరంజీవి సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించిన కోట శ్రీనివాసరావు 750కి పైగా సినిమాల్లో నటించారు.

2

పద్మశ్రీ పురస్కారం, 9 నంది అవార్డులు అందుకున్నారు.

4

‘ఆహా నా పెళ్ళంట’ సినిమాలోని పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్రతో ప్రజాదరణ పొందారు.

చిరంజీవితో ప్రారంభమైన సినీ ప్రస్థానం

తెలుగు వెండితెర దిగ్గజం కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. ఇవాళ (జులై 13) తెల్లవారు జామున నాలుగు గంటలకు తుది శ్వాస విడిచి అనంతలోకాలకు తిరిగిరాకుండా వెళ్లిపోయారు. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

కోట శ్రీనివాసరావు మరణంపై పవన్ కల్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డి , చంద్రబాబు నాయుడు వంటి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవి సినిమాతో ప్రారంభమైన కోట శ్రీనివాసరావు 40 ఏళ్ల నట ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడులో 1942 జులై 10న బ్రహ్మణ కుటుంబంలో జన్మించిన కోట శ్రీనివాసరావు కు చిన్నతనం నుంచే నాటకాల పిచ్చి. ఆ ఇష్టంతోనే వందలాది నాటకాలు వేశారు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో నటుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు కోట శ్రీనివాసరావు. ఇదే సినిమాతో హీరోగా చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు.

ఇలా చిరంజీవి సినిమాతో సినీ కెరీర్ ప్రారంభించిన కోట శ్రీనివాసరావు నాలుగు దశాబ్దాల పాటు విలక్షణమైన నటనతో అబ్బురపరిచారు. విలన్‌గా, కమెడియన్‌గా, కీలక పాత్రల్లో ఎంతో వైవిధ్యం చూపి ఆకట్టుకున్నారు. 40 ఏళ్ల నట ప్రస్థానంలో 750కిపైగా సినిమాల్లో నటించి మెప్పించారు కోట శ్రీనివాసరావు.

తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ కూడా కోట శ్రీనివాసరావు నటించారు. 1986లో వచ్చిన ఆహా నా పెళ్లంట సినిమాలో పిసినిగొట్టు లక్ష్మీపతి క్యారెక్టర్‌లో ఇమిడిపోయి విపరీతమైన పేరు తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు. అనంతరం ప్రతిఘటన సినిమాలో విలన్‌గా మరో మెట్టు ఎక్కారు.

సినిమాల్లోకి రాకముందు స్టేట్ బ్యాంక్‌లో ఉద్యోగిగా పని చేసిన కోట శ్రీనివాసరావు 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004 వరకు ఎమ్మెల్యేగా కోట కొనసాగారు. నటుడిగా పద్మశ్రీ పురస్కారంతోపాటు తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు కోట శ్రీనివాసరావు.

నంది అవార్డులు, పద్మశ్రీ గౌరవం

2015లో అప్పటివరకు 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగినందుకు కోట శ్రీనివాసరావును పద్మశ్రీ తో భారత ప్రభుతం సత్కరించింది. అలాగే, కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాకు 2012లో ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డ్ అందుకున్నారు.

1. నంది స్పెషల్ జ్యూరీ అవార్డ్- ప్రతి ఘటన (1985)

2. నంది ఉత్తమ విలన్- గాయం (1993)

3. నంది ఉత్తమ విలన్- తీర్పు (1994)

4. నంది ఉత్తమ నటుడు- లిటిల్ సోల్జర్స్ (1996)

5. నంది ఉత్తమ విలన్- గణేష్ (1998)

బ్యాంకు ఉద్యోగి నుంచి ఎమ్మెల్యే వరకు

6. నంది ఉత్తమ విలన్ – చిన్న (2000)

7. నంది ఉత్తమ సహాయ నటుడు- పృథ్వీ నారాయణ (2002)

8. నంది ఉత్తమ సహాయ నటుడు – ఆ నలుగురు (2004)

9. నంది ఉత్తమ సహాయ నటుడు – పెళ్లైన కొత్తలో (2006)

వీటితోపాటు అల్లు రామలింగయ్య పురస్కారాన్ని సైతం కోట శ్రీనివాసరావు అందుకున్నారు. ఎంతోమంది అగ్ర హీరోలతో నటించిన కోట శ్రీనివాసరావు విక్టరీ వెంకటేష్‌ కు విలన్‌గా, తండ్రిగా రెండు పాత్రల్లో ఒదిగిపోయారు. ఇలా అవార్డులు, రివార్డులతో 40 ఏళ్ల నట ప్రస్థానం నెలకొల్పిన కోట శ్రీనివాసరావుకు తెలుగు ఆడియెన్స్ కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు.

కోట శ్రీనివాసరావు గొప్ప నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన సినీ, రాజకీయ ప్రస్థానం ఎప్పటికీ జనం గుండెల్లో నిలిచిపోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.