|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

యుద్ధం ఎఫెక్ట్: గ్యాస్ కొరతతో అల్లాడుతున్న భారత్! ఉజ్వల యోజన ఉన్నా తప్పని కష్టాలు!

Published: 13-03-2026, 9:35 AM
యుద్ధం ఎఫెక్ట్: గ్యాస్ కొరతతో అల్లాడుతున్న భారత్! ఉజ్వల యోజన ఉన్నా తప్పని కష్టాలు!
  • ఉజ్వల యోజనతో 33 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు పంపిణీ చేసిన కేంద్రం.
  • గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ వినియోగం 17% నుంచి 95%కి పెరిగింది.
  • యుద్ధం కారణంగా ఎల్‍పీజీ సరఫరాలో అగ్నిపరీక్షలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం.
  • గ్యాస్ కొరతతో హోటళ్లు, రెస్టారెంట్లు కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నాయి.

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశంలో ఎల్‍పీజీ కొరత ఏర్పడింది. ఉజ్వల యోజన పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు పెరిగినప్పటికీ, సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది.

ఉజ్వల యోజనతో పెరిగిన గ్యాస్ వినియోగం

పశ్చిమాసియాలో మొదలైన యుద్ధం భారత్‍లో చమురు, గ్యాస్ కొరతకు (LPG Crisis India) కారణంగా మారింది. దేశవ్యాప్తంగా ఎల్‍పీజీ కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకనాడు కట్టెల పొయ్యిలే దిక్కుగా ఉన్న భారతీయ వంటింట్లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం (PM Ujjwala Yojana) పెను మార్పును తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 33 కోట్లకు పైగా ఎల్‌పీజీ కనెక్షన్లు ఉండగా అంతర్జాతీయ సంక్షోభానికి ఈ పథకం విషయంలో దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది. అయితే ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయడంలో గ్రాండ్ సక్సెస్ అయిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక్క యుద్ధం దెబ్బకు ఎల్పీజీ సరఫరా విషయంలో అగ్నిపరీక్షలు ఎదుర్కొనే పరిస్థితికి ఎందుకు వచ్చింది? దేశంలో ఇంత పెద్ద డిమాండ్ ఉంటే సొంతంగా గ్యాస్ ఉత్పత్తి చేసుకోకుండా విదేశాలపై ఎందుకు ఆధారపడుతోదనే ప్రశ్నలు అందరివైని వేధిస్తున్నాయి.

ప్రస్తుతం పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ ఎల్పీజీ గ్యాస్ వినియోగిస్తున్నారు. 2016లో ప్రధానమంత్రి ఉజ్వల పథకం ప్రారంభమయ్యాక పరిస్థితి పూర్తిగా మారింది. పేద కుటుంబాలకు ఉచిత ఎల్‌పీజీ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా లక్షలాది కుటుంబాలు వంట గ్యాస్ ఉపయోగించడం ప్రారంభించాయి. వాటిలో 10 కోట్లకుపైగా కనెక్షన్లు ఉజ్వల పథకం ద్వారా ఇచ్చినవే. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో ఎల్‌పీజీ వినియోగం కేవలం 17 శాతం ఉండగా, ఇప్పుడు అది 95 శాతం దాటింది.దేశంలో పొగకమ్ముకున్న వంటిళ్ల నుంచి మహిళ ఆరోగ్యాన్ని కాపాడటం, పర్యావరణ పరిరక్షణలో కీలక విజయంగా నిలిచినప్పటికీ ప్రస్తుతం గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు మళ్లీ కట్టెలు, బొగ్గు వంటి పాత ఇంధనాలను ఉపయోగించడం వైపు చూస్తున్నాయి. ఇక కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కట్టెల పొయ్యిలపై వండటం మొదలు పెట్టేశాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల కోసం రాష్ట్రాలకు కిరోసిన్ కేటాయింపులను తాత్కాలికంగా పెంచింది.

యుద్ధంతో తలెత్తిన ఎల్‍పీజీ కొరత

తాజా యుద్ధంతో ఇరాన్ హార్మూజ్ జలసంధిని బ్లాక్ చేసింది. దీంతో విదేశాల నుంచి రావాల్సిన చమురు, గ్యాస్‍పై తీవ్ర ప్రభావం పడింది. పరిస్థితి తీవ్ర రూపంగా మారుతుండటంతో భారత దేశం తన సొంత అవసరాల కోసం చమురు, గ్యాస్ ఎందుకు ఎక్కువగా ఉత్పత్తి చేసుకోలేకపోతోందనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే భారతదేశం ఏటా 31 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని వినియోగిస్తుంటే మన దేశీయ శుద్ధి కర్మాగారాలు అందులో సగం కంటే తక్కువే ఉత్పత్తి చేస్తున్నాయి. మిగిలినదంతా సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్ దేశాల నుండే దిగుమతి అవుతోంది. క్రూడాయిల్‌ను మనం 40 దేశాల నుండి తెచ్చుకుంటున్నాం కానీ ఎల్‌పీజీ విషయంలో మాత్రం కేవలం గల్ఫ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడటం ఇప్పుడు మన పాలిట శాపంగా మారిందనే చర్చ జరుగుతోంది.

దేశీయ ఉత్పత్తిపై దృష్టి పెట్టని భారత్

దిగుమతులపై ఎక్కువగా ఆధారపడకుండా దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచాలని వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ 2026లో ఆయన ఇవాళ మాట్లాడుతూ స్వదేశంలో ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేయడానికి దేశంలో వనరులు, ప్రతిభ ఉందని చెప్పారు. భారతదేశం ఇప్పటికీ తన ఇంధన అవసరాలలో ఎక్కువ భాగాన్ని దిగుమతి చేసుకుంటోందని భారతదేశం బలమైన భౌగోళిక సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ దేశ చమురు డిమాండ్‌లో 90 శాతం కంటే ఎక్కువ, రాగి డిమాండ్‌లో 95 శాతం కంటే ఎక్కువ దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత పెద్ద మొత్తంలో ఎనర్జీ కోసం దిగుమతులపై ఆధారపడటం దీర్ఘకాలంలో మంచి పరిణామం కాదన్నారు. భారత్ చమురు, గ్యాస్ ఉత్పత్తిలో సమృద్ధి సాధించడానికి ప్రపంచ ఇంధన సరఫరాదారులు కోరుకోకపోవచ్చని ముఖ్యంగా మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాలు భారతదేశం తన సొంత చమురు, గ్యాస్‌ను తయారు చేసుకోవాలని కోరుకోవడం లేదని అందుకు బదులుగా ఈ దేశాలు తమ వద్ద నుంచి భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకోవడానికే ఇష్టపడతాయన్నారు. దేశంలోని చమురు, గ్యాస్ వనరులను అన్వేషించడానికి అంతుకు అవసరమైన రిస్క్ తీసుకోవడానికి సంస్థలను, కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు. చిన్న పెట్టుబడిదారులను కూడా డ్రిల్లింగ్, అన్వేషణలో పాల్గొనడానికి అనుమతించాలని సూచించారు. మైనింగ్, ఇంధన ప్రాజెక్టులు ఉత్పత్తిని మరింత త్వరగా ప్రారంభించడానికి వీలుగా వేగవంతమైన అనుమతులు లభించేలా నిబంధనలు సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. భారత్‍లో అనేక కీలక ఖనిజాలు, హైడ్రోకార్బన్‌ల తగినంత నిల్వలు ఉన్నాయని దేశీయ ఉత్పత్తిని పెంచడం వల్ల దిగుమతులు తగ్గుతాయని చెప్పారు. తద్వారా ఉద్యోగాలను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చన్నారు.

దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఉండటంతో, ప్రభుత్వం వెంటనే స్పందించి దేశీయంగా ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.