
📌 Key Points
- వేణు రెడ్డి, 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రాత్రిపూట కథలు రాసేవారు.
- పాకెట్ ఎఫ్‌ఎమ్‌లో ఆయన ఆడియో సిరీస్‌లకు 6 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
- ‘ట్విస్ట్స్ ఆఫ్ లవ్ అండ్ రివెంజ్’ సిరీస్ సూపర్ హిట్ అయింది.
- హాబీగా మొదలైన రచన ఇప్పుడు గౌరవప్రదమైన రెండో కెరీర్‌గా మారింది.
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేణు రెడ్డి, తన ఉద్యోగ బాధ్యతలతో పాటు రాత్రిపూట కథలు రాస్తూ అద్భుత విజయం సాధించారు. పాకెట్ ఎఫ్‌ఎమ్‌లో ఆయన ఆడియో సిరీస్‌లు కోట్లాది మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఇది కేవలం ఒక హాబీగా మొదలై, ఇప్పుడు ఆయన జీవితాన్ని మార్చేసిన సక్సెస్ స్టోరీ.
హాబీగా మొదలైన కథల ప్రయాణం
హైదరాబాద్‌కు చెందిన 35 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వేణు రెడ్డి కేవలం సరదాగా మొదలుపెట్టిన “కథల ప్రయాణం” ఇప్పుడు ఆయన జీవితాన్నే మార్చేసింది. ప్రముఖ ఆడియో ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ పాకెట్ ఎఫ్‌ఎమ్‌లో ఆయన రాసిన ఆడియో సిరీస్‌లకు 6 కోట్లకు పైగా వీక్షకులు రావడం విశేషం.
కథలు రాయడం అనేది వేణు రెడ్డి జీవితంలో ఎప్పుడూ ఒక ప్లాన్ ప్రకారం జరగలేదు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 35 ఏళ్ల వేణు రెడ్డి.. ఎప్పుడూ తన ఉద్యోగం, కెరీర్, కుటుంబ బాధ్యతలపైనే దృష్టి పెట్టారు. కామిక్స్, యానిమేషన్స్, ఆడియో స్టోరీస్ ద్వారా కథలను ఆస్వాదించడం ఆయనకు ఒక వినోదం మాత్రమే. అయితే, పాకెట్ ఎఫ్‌ఎమ్‌లో రెగ్యులర్‌గా ఆడియో కథలను వినే అలవాటు ఉన్న ఆయనలో మెల్లగా ఒక సరికొత్త ఆలోచన మొదలైంది. వింటున్న కథల్లోని సన్నివేశాలు, పాత్రలు, భావోద్వేగాలను ఇంకాస్త భిన్నంగా ఎలా చూపించవచ్చో ఆయన ఊహించుకోవడం ప్రారంభించారు. ఆ ఆసక్తి, ఉత్సుకత కాస్తా చివరకు ఆయనతోనే కలం పట్టించాయి. తనకు తోచిన కథలను సొంతంగా రాయడం మొదలుపెట్టేలా చేశాయి.
తన పూర్తి సమయం ఉద్యోగానికే కేటాయిస్తూనే.. రాత్రి పూట నిద్రను సైతం పక్కన పెట్టి కథలు రాయడం మొదలుపెట్టారు. గంటల తరబడి శ్రమించారు. ఈ క్రమంలోనే పాకెట్ ఎఫ్‌ఎమ్ వేదికపై రైటర్స్ తమ కథలను పబ్లిష్ చేసుకోవచ్చనే విషయం వేణు రెడ్డికి తెలిసింది. దానితో ఒక ప్రయత్నం చేద్దామని రంగంలోకి దిగారు. మొదట్లో కొన్ని నెలల పాటు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాకపోయినా, నెమ్మదిగా ఆయన కథలకు శ్రోతలు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. అలా సరదాగా (హాబీగా) మొదలైన వ్యాపకం.. ఆ తర్వాత ఊహించని స్థాయికి చేరుకుంది. అది కేవలం పాఠకులను, శ్రోతలను మాత్రమే సంపాదించి పెట్టలేదు, ఒక కథకుడిగా తనను తాను మరింత సీరియస్‌గా నిరూపించుకోవాలనే నమ్మకాన్ని ఆయనలో నింపింది.
ఇప్పుడు వేణు రెడ్డి రాసిన ‘ట్విస్ట్స్ ఆఫ్ లవ్ అండ్ రివెంజ్’ వంటి ఆడియో సిరీస్‌లు సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతూ ఏకంగా 6 కోట్లకు (60 మిలియన్లు) పైగా వ్యూస్ సాధించాయి. దీనితో పాటు ఆయన రాసిన ‘రెక్లెస్ లవ్ ప్రపోజల్’ అనే మరో కథ కూడా 60 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ అద్భుతమైన విజయం ఆయన జీవితంలో రాయడాన్ని కేవలం ఒక కాలక్షేపంగా కాకుండా, ఒక గౌరవప్రదమైన రెండో కెరీర్‌గా మార్చేసింది.
పాకెట్ ఎఫ్‌ఎమ్‌లో అద్భుత విజయం
అంతేకాదు, ఆయన చుట్టూ ఉన్నవారు రచయిత వృత్తిని చూసే కోణాన్ని కూడా మార్చేసింది. ఒకప్పుడు ‘ఇదొక చిన్న హ్యాబీ మాత్రమే’ అని అనుకున్నవాళ్లే.. ఇప్పుడు పట్టుదల, సృజనాత్మకత ఉంటే మన ప్రధాన వృత్తికి మించి ఎన్నో అద్భుతమైన అవకాశాలను సృష్టించుకోవచ్చని వేణు రెడ్డిని చూసి అభినందిస్తున్నారు.
“కొన్ని సంవత్సరాల క్రితం ఎవరైనా నాతో వచ్చి ‘రాయడం అనేది నీ జీవితంలో ఇంత కీలకమైన భాగం అవుతుంది,’ అని చెప్పి ఉంటే, నేను అస్సలు నమ్మేవాడిని కాను. నేను కేవలం కథలను ఇష్టపడే ఒక సాధారణ వ్యక్తిని మాత్రమే. రచయితను కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఆఫీస్ పని ముగిసిన తర్వాత, కేవలం ఆ ప్రక్రియను ఎంజాయ్ చేస్తూ అర్ధరాత్రి వేళల్లో రాయడం ప్రారంభించాను. ఇది నన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో కూడా నాకు తెలియదు,” అని తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ వేణు రెడ్డి చెప్పారు.
“నా కథకు మొదటిసారిగా పేమెంట్ అందుకున్న ఆ క్షణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంతవరకు రాయడం అనేది నా జీవితంలో కేవలం ఒక భావోద్వేగంగా మాత్రమే ఉండేది. కానీ ఆ మొదటి సంపాదన దాన్ని నిజం చేసింది. నేను ఆ డబ్బును చూడగానే మొదటగా నా కూతురికి ఇచ్చాను, తను వెంటనే దాన్ని పిగ్గీ బ్యాంక్‌లో దాచుకుంది. ఆ జ్ఞాపకం నా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. సంపాదన కంటే కూడా, రాయడం నాకు ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి వయసుతో నిమిత్తం లేదని, మనలోని నైపుణ్యం మనం ఊహించిన దానికంటే చాలా పెద్ద స్థాయికి ఎదుగుతుందని ఇది నాకు నిరూపించింది,” అని వేణు రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.
ఆయన రాసిన కథలు కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా.. భౌగోళిక సరిహద్దులు, విభిన్న సంస్కృతులను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలను అలరిస్తున్నాయి.
రెండో కెరీర్‌గా రచనా వ్యాపకం
భారతదేశంలో ప్రస్తుతం వేగంగా ఎదుగుతున్న ‘క్రియేటర్ ఎకానమీ’లో వస్తున్న మార్పులకు వేణు రెడ్డి ప్రయాణమే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ప్రజలు తమ ప్రధాన వృత్తిలోనే కాకుండా, సరికొత్త రంగాలలో కూడా అద్భుతమైన అవకాశాలను ఎలా అన్వేషిస్తున్నారో ఇది నిరూపిస్తోంది. ఆడియో స్టోరీస్‌పై ఉన్న ఇష్టంతో కథలు రాయడం ప్రారంభించిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఈ రోజు లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న రచయితగా మారారు.
ప్రస్తుతం ఆయన తన ఐటీ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే.. ఆడియో స్టోరీ టెల్లింగ్‌ను తన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మార్చుకున్నారు. మనసులో బలమైన ఆసక్తి, పట్టుదల, కొత్త విషయాలను నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉంటే.. మనం అస్సలు ఊహించని ఎన్నో గొప్ప అవకాశాల తలుపులు తానంతట తానే తెరుచుకుంటాయని వేణు రెడ్డి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More
వేణు రెడ్డి కథ కేవలం ఒక వ్యక్తిగత విజయం కాదు, పట్టుదల, అభిరుచి ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తుంది. ఆయన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది, తమ కలలను వెంబడించడానికి ప్రోత్సహిస్తుంది.


