
📌 Key Points
- నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వంలో ‘మహిళా కబడ్డీ’ చిత్రం.
- ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్ నటిస్తున్నారు.
- కబడ్డీ క్రీడాకారిణిలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న కథాంశం.
- తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమా రూపొందనుంది.
క్రికెట్ తరువాత అంతగా ఆదరణ పొందిన క్రీడ కబడ్డీ. ఇప్పుడు రియల్ కబడ్డీ ప్లేయర్స్‌తో ‘మహిళా కబడ్డీ’ అనే సినిమా రాబోతోంది. డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కబడ్డీ క్రీడాకారిణి పూజ నర్వాల్ నటిస్తున్నారు.
నిర్మాతగా మారిన కబడ్డీ ప్లేయర్
Mahila Kabaddi: ప్రస్తుతం క్రికెట్ తర్వాత బాగా ప్రచారంలో ఉన్న గేమ్ ఏదయ్యా అంటే అంతా ‘కబడ్డీ’ అనే చెబుతారు. క్రికెట్‌లో ఐపీఎల్ ఎలా అయితే వచ్చిందో.. కబడ్డీలో ‘ప్రొ కబడ్డీ’ కూడా వచ్చి.. ఈ ఆటకు మరింత ప్రాచుర్యం వచ్చింది. ఇప్పుడు రియల్ కబడ్డీ ప్లేయర్స్‌తో ఓ నిర్మాత ‘మహిళా కబడ్డీ’ (Mahila Kabaddi) పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు.. తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్, నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ (Dr. Prathani Ramakrishna Goud). ఆర్కే ఫిలింస్ బ్యానర్ పై ఆయనే నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మహిళా కబడ్డీ’. ఈ చిత్రంలో ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, హీరో సుమన్, అక్సాఖాన్, తులసితో పాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నట్లుగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకనిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.
‘మహిళా కబడ్డీ’ మూవీ విశేషాలు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను కూడా ఒకప్పడు కబడ్డీ ప్లేయర్‌నే. అప్పట్లో కబడ్డీ పోటీల్లో మా టీమ్ తరుపున ఛాంపియన్ షిప్ గెలిచాం. కబడ్డీ ప్లేయర్‌గా జిల్లా స్థాయి వరకు వచ్చాను. మన దేశంలో క్రికెట్ తర్వాత కబడ్డీకే ఆదరణ దక్కుతోంది. గత రెండేళ్లుగా మన వాళ్లే ఛాంపియన్ షిప్ గెల్చుకున్నారు. మహిళల కబడ్డీలో పూజ నర్వాల్ వంటి ఎంతోమంది క్రీడాకారిణిలు ప్రతిభ చాటుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చేయబోతున్న ‘మహిళా కబడ్డీ’ మూవీ కోసం వాళ్లను అప్రోచ్ అయ్యాను. కోచ్ శ్రీనివాసరెడ్డి ద్వారా పూజని సంప్రదించాం. వాళ్లిద్దరూ ఈ మూవీలో నటించడానికి అంగీకరించడం, ఈ మీడియా సమావేశానికి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే.. పల్లెటూరి నుంచి వచ్చిన ఒక పేద అమ్మాయి కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది? ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. రియల్ కబడ్డీ ప్లేయర్స్ ఈ మూవీలో నటించబోతున్నారు. కోచ్‌గా శ్రీనివాస రెడ్డి నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషలలో రూపొందించే ఈ సినిమాలో అక్సాఖాన్‌తో పాటు మరో హీరో హీరోయిన్‌ని కూడా సెలెక్ట్ చేశాం. ఇందులో సుమన్, ఆమని, ఇంద్రజ వంటి సీనియర్ నటీనటులు నటిస్తున్నారు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. సాంగ్స్ కూడా రికార్డింగ్ చేశాం. మంగ్లీ, మధు ప్రియ ఈ సాంగ్స్ పాడారు. స్క్రిప్ట్, పాటలు చాలా బాగా వచ్చాయి. త్వరలోనే సెట్స్ మీదకు వెళుతున్నామని చెప్పారు.
కథాంశం వెనుక అసలు కథ
ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి (Indian Kabaddi Team Coach Srinivas Reddy) మాట్లాడుతూ.. పూజ నర్వాల్ వుమెన్ కబడ్డీ వరల్డ్ కప్‌లో గోల్డ్ మెడలిస్ట్. నేను మన టీమ్‌కు కోచ్‌గా ఉన్నాను. ప్రో కబడ్డీ లీగ్‌కు కూడా కోచ్‌గా పనిచేశాను. త్వరలో వుమెన్ ప్రో కబడ్డీ లీగ్ కూడా రాబోతోంది. ఈ సినిమా కోసం ఆర్కే గౌడ్ నన్ను అప్రోచ్ అయ్యారు. పూజ, నేను ఈ చిత్రంలో రియల్ లైఫ్ పాత్రలు పోషిస్తున్నాం. నాకు తెలిసిన విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నాను. క్రికెట్‌లో మహిళల జట్టు ఎలా రాణిస్తుందో.. కబడ్డీలోనూ అలాగే ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ ప్లేయర్ పూజ నర్వాల్ (Pooja Narwal) మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు కబడ్డీ ఆట మీద చాలా ఆసక్తి ఉండేది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మెడల్స్ గెల్చుకున్న తర్వాత ఇప్పుడు నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా ఎదిగాను. వుమెన్ కబడ్డీకి ఎంతో భవిష్యత్ ఉందని నేను అంటాను. కబడ్డీని ప్రొఫెషనల్‌గా ఎంచుకునే అమ్మాయిలకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో ‘మహిళా కబడ్డీ’ అనే సినిమాను ఆర్కే గౌడ్ రూపొందిస్తుండటం.. అలాగే ఇందులో నేను కూడా నటిస్తుండటం నాకు చాలా సంతోషాన్నిస్తోందని పేర్కొన్నారు. ఇంకా సుమన్, ఆక్సాఖాన్, కబడ్డీ ప్లేయర్ రాధిక రెడ్డి ఈ సినిమాలో మంచి పాత్రలు చేస్తున్నట్లుగా తెలిపారు.
మొత్తానికి, ‘మహిళా కబడ్డీ’ చిత్రం కబడ్డీ క్రీడాకారుల జీవితంలోని కష్టాలను, విజయాలను చూపిస్తూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందని చెప్పవచ్చు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది.


