|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మావోయిస్టులకు భారీ షాక్! అగ్రనేత నరహరి లొంగుబాటు.. గణపతికి డీజీపీ సంచలన పిలుపు!

Published: 26-05-2026, 6:45 AM
మావోయిస్టులకు భారీ షాక్! అగ్రనేత నరహరి లొంగుబాటు.. గణపతికి డీజీపీ సంచలన పిలుపు!
  • మావోయిస్టు అగ్రనేత నరహరి, ఆయన భార్య ధనమ్మ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగుబాటు.
  • డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో రూ.45 లక్షల పునరావాస ప్యాకేజీ స్వీకరణ.
  • నరహరి మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర, సాంకేతిక నిపుణుడిగా గుర్తింపు.
  • డీజీపీ సీవీ ఆనంద్ మావోయిస్టు గణపతికి లొంగిపోవాలని కీలక పిలుపు.

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, ఆయన భార్య ధనమ్మ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో వారికి రూ.45 లక్షల పునరావాస ప్యాకేజీ అందజేశారు. ఈ సందర్భంగా డీజీపీ గణపతికి కీలక పిలుపునిచ్చారు.

నరహరి లొంగుబాటు: భారీ ఎదురుదెబ్బ

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, ఆయన భార్య, స్టేట్ కమిటీ మెంబర్ మెడారి ధనమ్మ అలియాస్ లత ఇవాళ తెలంగాణ పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. హైదరాబాద్‌లోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ సమక్షంలో వారు లొంగిపోగా, పోలీసులు వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రకటించిన పునరావాస ప్యాకేజీ కింద నరహరికి రూ. 25 లక్షలు, ఆయన భార్య ధనమ్మకు రూ. 20 లక్షల విలువైన చేక్కులను డీజీపీ అందజేశారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. పసునూరి నరహరి ప్రస్థానాన్ని వెల్లడించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామంలో 1962లో జన్మించిన నరహరి, స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే పదో తరగతి వరకు చదివారని తెలిపారు. అనంతరం ఎల్బీ డిగ్రీ కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదువుతున్న రోజుల్లో ర్యాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (RSU) నాయకులతో ఏర్పడిన పరిచయం ఆయనను అజ్ఞాతంలోకి నడిపించిదన్నారు. మావోయిస్టు పార్టీలో చేరిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంట దళంలో ప్రస్థానాన్ని ప్రారంభించిన నరహరి, ఆ తర్వాత గోపన్న దళం, రామన్న స్క్వాడ్‌లలో దండకారణ్యంలో చురుగ్గా పనిచేశారని వెల్లడించారు. 1986లో హైదరాబాద్ సిటీ ఆర్గనైజర్‌గా, బెంగళూరులో డెన్ కీపర్‌గా వ్యవహరించారని డీజీపీ తెలిపారు.

డీజీపీ సీవీ ఆనంద్ కీలక ప్రకటన

సౌత్ బస్తర్‌లో 10 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీమ్‌లో సప్లయ్ అండ్ ఆర్మ్స్ ఆర్గనైజర్‌గా నరహరి పనిచేశారు. ఫైర్ ఆర్మ్స్, మోటార్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు (RPG), బూబీ ట్రాప్‌లు, క్లేమోర్ మైన్స్, ఐఈడీ (IED)లను అనుసంధానించడంలో, తయారు చేయడంలో ఆయన నిష్ణాతుడు. వందలాది మంది కేడర్‌కు ఆయనే స్వయంగా శిక్షణ ఇచ్చారని డీజీపీ ఆనంద్ తెలిపారు. పార్టీలో ఆయన సేవలను గుర్తించిన అగ్రనాయకత్వం రీజినల్ కమిటీ మెంబర్‌గా ప్రమోషన్ ఇచ్చి నాగ్‌పూర్ పంపింది. అనంతరం 2005లో ఝార్ఖండ్‌కు, 2006లో బిహార్-ఝార్ఖండ్ స్టేట్ కమిటీ మెంబర్‌గా బదిలీ చేసిందని పేర్కొన్నారు. 2017లో ఈస్ట్రన్ సెంట్రల్ బ్యూరో ఆయన్ను అత్యున్నతమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా (CCM) నియమించగా.. ఝార్ఖండ్‌లోని కోల్హన్ ఏరియాలో స్టేట్ మిలటరీ కమిటీ మెంబర్‌గా, మూడేళ్ల పాటు టెక్నికల్ హెడ్‌గా నరహరి కీలక బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. ఇటీవల కాలంలో తీవ్ర అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించున్నారని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

గుంటూరు జిల్లా దాచెపల్లి మండలం గాములపాడు గ్రామానికి చెందిన మెడారి ధనమ్మ అలియాస్ లత అలియాస్ పూనం 1988లో నరహరిని వివాహం చేసుకున్నారని డీజీపీ తెలిపారు. పెళ్లయిన నాటి నుంచి భర్తతో పాటే ఉద్యమంలో కొనసాగారని వెల్లడించారు. 2004లో ఆమెను నాగ్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేయగా, ఏడేళ్ల పాటు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. 2011లో బెయిల్‌పై బయటకు వచ్చినప్పటికీ, మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ బాట పట్టారని పేర్కొన్నారు. 2018 నుంచి బిహార్, ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో ఉంటూ టెక్నికల్ టీమ్‌కు సపోర్ట్ అందిస్తూ, స్టేట్ కమిటీ మెంబర్‌గా బాధ్యతలు నిర్వహించారని డీజీపీ వెల్లడించారు.

మావోయిస్టులకు పునరావాస ప్యాకేజీ

రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత, లొంగుబాట్లు విజయవంతంగా సాగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. 2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో వేర్వేరు కేడర్లకు చెందిన మొత్తం 822 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం సరైన పునరావాసం కల్పిస్తూ ఆదుకుంటోందని, అందుకే చాలా మంది బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు మావోయిస్టుల నుంచి 334 ఆయుధాలను రికవరీ చేసినట్లు తెలిపారు. ఇటీవలే ఝార్ఖండ్‌లో 15 మంది, ఇవాళ ఇద్దరు అగ్రనేతల లొంగుబాటు తర్వాత.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 47 మంది మావోయిస్టులు మాత్రమే అజ్ఞాతంలో మిగిలి ఉన్నారని డీజీపీ వెల్లడించారు. అందులో ఛత్తీస్‌గఢ్‌లో 15 మంది, ఒరిస్సాలో 15 మంది, ఝార్ఖండ్‌లో 13 మంది, తెలంగాణలో ముగ్గురు, ఏపీలో ఒక్కరు మాత్రమే మిగిలారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, ఆయన భార్య జోడె రత్నాబాయి, వార్త శేఖర్ మాత్రమే ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని డీజీపీ తెలిపారు. వీరంతా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా సమాచారం ఉందని.. వారు కూడా ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి వస్తే తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్ తరఫున మెరుగైన వైద్యం, పూర్తి పునరావాసం కల్పించి భరోసా ఇస్తామని డీజీపీ సీవీ ఆనంద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

నరహరి లొంగుబాటు మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని డీజీపీ స్పష్టం చేశారు. పునరావాస ప్యాకేజీలతో జనజీవన స్రవంతిలో కలిసేందుకు మావోయిస్టులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని తెలిపారు. ఇది ఇతర మావోయిస్టులకు ఆదర్శం కావాలని ఆకాంక్షించారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.