
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్’ సినిమా టీజర్ విడుదలకు థియేటర్ల వద్ద కటౌట్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మారుతి తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
Key Points
ప్రభాస్ 'ది రాజాసాబ్' టీజర్ విడుదలకు థియేటర్ల వద్ద కటౌట్స్ ఏర్పాటు.
మారుతి తండ్రి అరటిపళ్ళ దుకాణం ఉన్న థియేటర్ వద్ద తన కటౌట్ చూసి ఎమోషనల్.
సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం గురించి మారుతి గుర్తు చేసుకున్నారు.
'ది రాజాసాబ్' సినిమా విజయంపై మారుతి ఆశాభావం వ్యక్తం.
‘ది రాజాసాబ్’ టీజర్ విడుదలకు కటౌట్స్ ఏర్పాటు
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ది రాజాసాబ్’ (The RajaSaab). సోమవారం టీజర్ విడుదల కానుంది. ఈ క్రమంలో పలు థియేటర్స్ వద్ద ప్రభాస్, మారుతి కటౌట్స్ ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. వాటిని చూసిన దర్శకుడు ఎమోషనల్ అయ్యారు. గతంలో తన తండ్రి అరటిపళ్లు అమ్మినచోట ఇప్పడు తన కటౌన్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ మారుతి తెలిపారు. ఇండస్ట్రీకి రాకముందు ఎన్నో పనులు చేసిన మారుతి.. టాలీవుడ్‌లో అడుగుపెట్టాక కూడా సహ నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా పని చేశాడు. మచిలీపట్నం, వైజాగ్‌లో మారుతి పెరిగారు. ఆ ప్రాంతాలతో ఆయనకు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.
మారుతి తండ్రి జ్ఞాపకాలు
‘మచిలీపట్నం – సిరి కాంప్లెక్స్ (గతంలో కృష్ణ కిషోర్)తో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ మా నాన్నగారికి ఒకప్పుడు చిన్న అరటిపళ్లు దుకాణం ఉండేది. ఎప్పటికైనా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని ఈ థియేటర్‌లో విడుదలైన అందరి హీరోల సినిమాల బ్యానర్స్ నేను ఎంతో ఆశతో కట్టేవాడిని. ఒక్కసారైనా నా పేరు ఇక్కడ చూడాలని కలలు కనేవాడిని. ఇప్పుడు ఇదే థియేటర్ వద్ద నిలబడి చూస్తుంటే.. నా ప్రయాణం ఎక్కడ ప్రారంభమైందో అన్ని గుర్తుకు వస్తున్నాయి. ఇప్పుడు జీవితం పరిపూర్ణమైందనిపిస్తుంది.
మారుతి సినిమా ప్రయాణం
పాన్ ఇండియా స్టార్ పక్కన నా కటౌట్ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎవరికైనా ఇంతకు మించి ఇంకేం కావాలి. కానీ, ఈరోజు మా నాన్న ఉండుంటే చాలా గర్వపడేవారు. ఆయన్ని మిస్ అవుతున్నాననే బాధ ఉంది. ఏదైనా ఉన్న సమయంలోనే మన బాధ్యతలను పూర్తి చేయాలి. మన డార్లింగ్‌ను వెండితెరపై నేను ఎలా చూపించాలని ఆశ పడ్డానో మీ అందరికీ చూపించనున్నాను. మా పట్ల మీరు చూపుతున్న ప్రేమకు ధన్యవాదాలు చెప్పడం చాలా చిన్న పదం అవుతుంది.’ అని ఆయన అన్నారు.
తన తండ్రిని గుర్తు చేసుకుంటూ, ‘ది రాజాసాబ్’ సినిమా విజయం కోసం మారుతి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన నమ్ముతున్నారు.


