|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మురళీమోహన్ కు పద్మశ్రీ పురస్కారం: 53 ఏళ్ల సినీ ప్రస్థానానికి దక్కిన గౌరవం!

Published: 25-01-2026, 9:30 AM
మురళీమోహన్ కు పద్మశ్రీ పురస్కారం: 53 ఏళ్ల సినీ ప్రస్థానానికి దక్కిన గౌరవం!
  • మురళీమోహన్ 53 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా చిత్రాల్లో నటించారు.
  • ఆయన ‘జగమే మాయ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు.
  • మురళీమోహన్, తన సోదరుడితో కలిసి ‘జయభేరి ఆర్ట్స్’ నిర్మాణ సంస్థను స్థాపించారు.
  • 1985లో ‘ఓ తండ్రి తీర్పు’ సినిమాకు నంది అవార్డు అందుకున్నారు.

ప్రముఖ నటుడు మురళీమోహన్ 2026 సంవత్సరానికి గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. 53 ఏళ్ల సినీ జీవితంలో 350కి పైగా సినిమాల్లో నటించిన ఆయన సినీ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శం. ఆయన గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మురళీమోహన్ సినీ ప్రస్థానం

Padma Awards 2026: కేంద్ర ప్రభుత్వం 2026వ సంవత్సరానికి గానూ అత్యున్నత పౌర పురస్కారాల జాబితా విడుదల చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ అవార్డుల జాబితాను విడుదల చేయడం జరిగింది. మొత్తం వివిధ రంగాలకు చెందిన 113 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు లభించాయి.. ఇందులో తెలుగు వారికి మొత్తం 11 అవార్డులు వరించాయి. అటు సినీ రంగానికి చెందిన పలువురికి ఈ అత్యున్నత పౌర పురస్కారాలు లభించాయి. అందులో ఒకరు మురళీమోహన్ (Murali Mohan). 53 ఏళ్ల సినీ జీవితంలో భారత అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డు ఆయనను వరించింది. ఈ సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇకపోతే 53 ఏళ్ల సినీ ప్రస్థానంలో తొలిసారి పద్మశ్రీ అవార్డును అందుకున్న మురళీమోహన్ సినీ ప్రస్థానం గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.. అసలు పేరు మాగంటి రాజబాబు.. 1940 జూన్ 24న పశ్చిమగోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో మాధవరావు -వసుమతి దేవి దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ఏలూరులోనే గడిచింది. 1963 లో ఎలక్ట్రికల్ మోటర్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించిన ఈయన.. నటన పైన ఆసక్తితో విజయవాడలో నాటకాలలో నటించడం మొదలుపెట్టారు. అలా నటిస్తున్న సమయంలోనే సినిమాలలోకి వెళ్లాలనే ఆలోచన మరింత బలపడింది.. అలా 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన ‘జగమే మాయ’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు మురళీమోహన్.

నటుడిగా మురళీమోహన్

అయితే 1974లో దివంగత దిగ్గజ దర్శకులు దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) దర్శకత్వం వహించిన ‘తిరుపతి’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు లభించింది. అలా ఆ సినిమాతో మొదలైన ఆయన సినీ ప్రయాణం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 350 తెలుగు చలన చిత్రాలలో నటించేలా చేసింది. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న మురళీమోహన్.. తన సోదరుడు కిషోర్ తో కలిసి “జయభేరి ఆర్ట్స్” అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. దాని ద్వారా సుమారుగా 25 చిత్రాలను నిర్మించారు. నిర్మాతగా పలువురు హీరోలతో సినిమాలు చేసి మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు మురళీమోహన్.

నిర్మాతగా మురళీమోహన్

నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న మురళీమోహన్ 1985లో వచ్చిన ‘ఓ తండ్రి తీర్పు’ సినిమాలో ఉత్తమ నటన కనబరిచి.. ఉత్తమ నటుడు విభాగంలో నంది అవార్డును అందుకున్నారు. ఇకపోతే 2016లో సినీ పరిశ్రమకు చేసిన సేవకుగాను’సైమా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు’ ఈయనను వరించింది. 53 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో చిత్రాలలో నటించడమే కాకుండా నిర్మించి సినీ పరిశ్రమకు అందించిన విశేష సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో ఆయనను గౌరవించనుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డును ఆయనకు సాగౌరవంగా అందించనున్నారు.

సినిమాలలోనే కాదు రాజకీయాలలో కూడా ఈయన ప్రవేశం ఉంది.. 2009లో జరిగిన 15వ లోక్సభ ఎన్నికలలో రాజమండ్రి లోక్సభ నియోజకవర్గము నుండి తెలుగుదేశం అభ్యర్థిగా నిలబడి పరాజయం పాలైన మురళీమోహన్.. తిరిగి 2014లో 16వ లోక్సభ ఎన్నికలలో పోటీపడి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.

మురళీమోహన్ పద్మశ్రీ అవార్డు అందుకోవడం ఆయన సినీ జీవితానికి ఒక గొప్ప గుర్తింపు. ఆయన రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.