
📌 Key Points
- అన్నపూర్ణ స్టూడియోస్ నైజాం డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ప్రవేశం.
- దిల్ రాజు వ్యూహంతోనే అన్నపూర్ణ స్టూడియోస్ రంగంలోకి దిగుతోందనే ఊహాగానాలు.
- మైత్రీ మూవీ మేకర్స్‌కు పోటీగా కొత్త కూటమి ఏర్పాటు.
- పంపిణీలో పారదర్శకత లోపంపై నిర్మాతల ఆందోళన.
తెలుగు చలనచిత్ర పంపిణీ రంగంలోకి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రవేశం ఒక సంచలనంగా మారింది. దీని వెనుక దిల్ రాజు వ్యూహం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వంటి సంస్థలకు పోటీ ఇచ్చేందుకు కొత్త కూటమి కూడా ఏర్పడుతోంది.
అన్నపూర్ణ ఎంట్రీ వెనుక దిల్ రాజు ప్లాన్?
Film Distribution: తెలుగు చలనచిత్ర పంపిణీ రంగంలో దశాబ్దాలుగా సాగుతున్న కొద్దిమంది ఆధిపత్యానికి ఇప్పుడు గట్టి సవాల్ ఎదురవుతోంది. ముఖ్యంగా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ‘అన్నపూర్ణ స్టూడియోస్’ (Annapurna Studios) నైజాంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం వెనుక పెద్ద స్కెచ్చే ఉందని ఇండస్ట్రీ టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ ఒంటరిగా రావడం లేదని, దీని వెనుక దిల్ రాజు స్ట్రాటజీ ఉందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వంటి కొత్త శక్తులు థియేటర్ల లీజులు పాడుతూ, పంపిణీలో తమకు పోటీగా ఎదుగుతుండటంతో, వారికి చెక్ పెట్టేందుకు దిల్ రాజు ఇప్పుడు నాగార్జునను రంగంలోకి దింపారనేలా ఆల్రెడీ ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. ఈ వ్యూహంలో భాగంగానే నాగవంశీ, సాహు గారపాటి వంటి యువ నిర్మాతలు ఒక కూటమిగా ఏర్పడి, మైత్రీ నెట్‌వర్క్‌కు కౌంటర్ ఇచ్చేలా థియేటర్ల నెట్‌వర్క్‌ను సెట్ చేస్తున్నారని సమాచారం.
కొత్త కూటమి vs మైత్రీ మూవీ మేకర్స్
మరోవైపు, యంగ్ డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అగ్రెసివ్ మూవ్స్ వెనుక ‘గీతా ఆర్ట్స్’ అండదండలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అల్లు అరవింద్ నేరుగా రాకుండా, ధీరజ్ ద్వారా చిన్న, మీడియం రేంజ్ సినిమాలపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారని టాక్. ఒక పక్క మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 60 థియేటర్లతో తన సొంత సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటే, దాన్ని అడ్డుకునేందుకు పాత పంపిణీదారులు ఇలా కొత్త ముఖాలను, కొత్త కూటములను తెరపైకి తెస్తున్నారనేలా ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి. ఈ గందరగోళం మధ్యే పారదర్శకత లోపం పెద్ద వివాదంగా మారింది. 30 కోట్లకు అమ్ముడైన సినిమాకు కేవలం 22 కోట్లే వస్తున్నాయని, మిగిలిన మొత్తాన్ని పంపిణీదారులు సైడ్ చేస్తున్నారని నిర్మాతలు వాపోతున్నారు. అమెరికాలోని Rentrak మాదిరిగా రియల్ టైమ్ డేటా వస్తే తప్ప ఈ దోపిడీ ఆగదని వారు ఆవేదన చెందుతున్నారు.
పంపిణీలో పారదర్శకత లోపాలు – నిర్మాతల ఆందోళన
ఈ డిస్ట్రిబ్యూటర్ల ఆధిపత్య ప్రభావం రాబోయే భారీ చిత్రాలపై పడటం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యశ్ ‘టాక్సిక్’, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ వంటి క్రేజీ ప్రాజెక్టుల పంపిణీ హక్కుల కోసం ఈ పాత, కొత్త కూటముల మధ్య పెద్ద యుద్ధమే జరగనుంది. సురేష్ బాబు వంటి వారు ‘ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళవచ్చు’ అని లైట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా, లోలోపల మాత్రం థియేటర్ల కౌంట్‌ను కాపాడుకునేందుకు పావులు కదుపుతున్నారనేలా కూడా వార్తలు వైరలవుతున్నాయి. రాబోయే మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ సినిమాల రిలీజ్ టైమ్‌కి డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఎవరి పట్టు నిలుస్తుందో, ఎవరి స్కెచ్ ఫలిస్తుందో క్లారిటీ వచ్చేస్తుంది. పారదర్శకత లేని ఈ వ్యాపారంలో న్యూ ఎంట్రీ విజయం సాధిస్తుందా లేక పాత ‘గుత్తాధిపత్యం’ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటుందా అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ హాట్‌గా జరుగుతున్న చర్చ.
మొత్తానికి, తెలుగు సినిమా పంపిణీ రంగంలో జరుగుతున్న ఈ మార్పులు రాబోయే చిత్రాల విడుదలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. పాత, కొత్త పంపిణీదారుల మధ్య ఆధిపత్య పోరు ఆసక్తికరంగా మారింది.


