
📌 Key Points
- నటి నందిని బెంగళూరులోని కెంగేరిలో ఉన్న ఒక పీజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
- వ్యక్తిగత సమస్యలు, కెరీర్ ఒత్తిళ్లతో పాటు కుటుంబ ఒత్తిళ్లు కూడా ఆత్మహత్యకు కారణాలని ప్రచారం.
- తండ్రి ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనసాగించాలని కుటుంబ సభ్యులు నందినిపై ఒత్తిడి చేసినట్లు వార్తలు.
- నందిని కోపం ఎక్కువని, కుటుంబం ఎలాంటి ఒత్తిడి చేయలేదని ఆమె తల్లి పోలీసులకు తెలిపింది.
టీవీ సీరియల్ నటి నందిని బెంగళూరులో ఆత్మహత్య చేసుకోవడం టెలివిజన్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వ్యక్తిగత సమస్యలు, కెరీర్ ఒత్తిళ్లతో పాటు కుటుంబ ఒత్తిళ్లే ఈ దారుణ నిర్ణయానికి కారణమని వార్తలు వస్తున్నాయి. ఆమె మరణం వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదిస్తున్నారు.
బెంగళూరులో నటి నందిని ఆత్మహత్య
టీవీ సీరియల్ నటి నందిని(27) బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. కన్నడ, తమిళ సీరియల్స్ లో తనకంటూ గుర్తింపు సాధించిన ఆమె రీసెంట్ గా బెంగళూరు శివారులోని కెంగేరిలో ఉన్న ఒక పీజీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వ్యక్తిగత సమస్యలు, కెరీర్ ఒత్తిళ్లతో బాధపడుతున్న ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
విజయనగర జిల్లాలోని కొట్టూరుకు చెందిన నందిని గత కొన్ని సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తోంది. నందిని ‘ నీనాడే నా’ సహా ప్రముఖ సీరియల్స్ లో నటించింది. తమిళ్ లో కళైంజర్ టీవీలో ప్రసారమౌతున్న సీరియల్ ‘గౌరీ’లో గౌరి పాత్రలో నటిస్తున్నారు. అయితే, ఆదివారం అర్థరాత్రి కెంగేరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ప్రైవేట్ పీజీలో ఆమె ఆకస్మికంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. ఆమె మృతదేహాన్ని రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి, పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఆత్మహత్య వెనుక వ్యక్తిగత, కుటుంబ ఒత్తిళ్లు
పోలీసు వర్గాల ప్రకారం, నందిని కొంతకాలంగా వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులే. అయితే, ఆమె తండ్రి మూడు, నాలుగు సంవత్సరాల క్రితం ఉద్యోగంలో ఉండగానే మరణించారు. ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నందున, పెద్ద కుమార్తె అయిన నందినిని తండ్రి ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించాలని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే, నటనపై ఆసక్తి ఉన్న నందినికి ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ఈ కుటుంబ ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఆమె సూసైడ్ లెటర్ కూడా రాసిందని, దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, నందిని మరణం.. తమిళ, కన్నడ టెలివిజన్ రంగానికి పెద్ద షాక్ గా మారింది.
తల్లి వాదన, పోలీసుల దర్యాప్తు వివరాలు
అయితే.. గవర్నమెంట్ జాబ్ చేయమని తాము కూతురిని ఎలాంటి ఒత్తిడి చేయలేదని, ఆమెకు కోపం చాలా ఎక్కువ అని.. కోపం వస్తే ఒక్కోసారి మాతో మాట్లాడేది కూడా కాదు అని నందిని తల్లి చెబుతున్నారు.
నందిని ఆత్మహత్య సంఘటన టెలివిజన్ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన ఒత్తిళ్లు, కుటుంబ పరిస్థితుల మధ్య సతమతమవుతున్న ఆమె తీసుకున్న ఈ నిర్ణయం అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలీసులు దర్యాప్తులో అసలు నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.


