|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్: ప్రపంచ వేదికపై ప్రెస్ ఫ్రీడమ్ రచ్చ!

Published: 19-05-2026, 4:30 PM
మోడీని ప్రశ్నించిన నార్వే జర్నలిస్ట్: ప్రపంచ వేదికపై ప్రెస్ ఫ్రీడమ్ రచ్చ!
  • నార్వే పర్యటనలో ప్రధాని మోడీని ప్రెస్ ఫ్రీడమ్‌పై ప్రశ్నించిన జర్నలిస్ట్ హెల్లే లింగ్.
  • వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ 157వ స్థానంలో ఉందని ఆమె ఆరోపణ.
  • భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ ఘాటుగా స్పందించారు.
  • జర్నలిస్ట్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్, చైనా ఏజెంట్ ఆరోపణలు.

ప్రధాని మోడీ నార్వే పర్యటనలో ప్రెస్ ఫ్రీడమ్‌పై ఓ జర్నలిస్ట్ ప్రశ్నించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన భారత్, నార్వే మధ్య దౌత్యపరమైన వివాదానికి దారితీసింది. విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించగా, సోషల్ మీడియాలో జర్నలిస్ట్‌పై ట్రోలింగ్ కొనసాగుతోంది.

మోడీని నిలదీసిన నార్వే జర్నలిస్ట్

ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) నార్వే పర్యటనలో చోటుచేసుకున్న ఓ ఆసక్తికర పరిణామం ప్రస్తుతం భారత్‌తో పాటు అంతర్జాతీయ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఓస్లోలో నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్‌తో కలిసి ప్రధాని మోదీ సంయుక్తంగా ప్రెస్‌మీట్ ముగించుకుని వెళ్తుండగా.. ఓ నార్వేజియన్ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ జర్నలిస్ట్ పేరే హెల్లే లింగ్ స్వెండ్సెన్ (Helle Lyng Svendsen). ప్రస్తుతం ఈమె పేరు రెండు దేశాల రాజకీయాల్లోనూ పెద్ద దుమారమే రేపుతోంది.

ఓస్లో-ఆధారిత ప్రసిద్ధ పత్రిక ‘దగ్సావిసెన్’ (Dagsavisen)‌లో పొలిటికల్ కామెంటేటర్, జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న హెల్లే లింగ్.. ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసి ప్రధాని మోడీ వేదిక దిగి వెళ్తుండగా గట్టిగా అరుస్తూ.. ‘ప్రపంచంలోనే అత్యంత స్వేచ్ఛాయుతమైన మీడియా నుంచి మీరు కొన్ని ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు’ అంటూ ప్రశ్నించారు. కానీ అప్పటికే ఇద్దరు ప్రధానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో తీవ్ర నిరాశకు గురైన జర్నలిస్ట్ హెల్లే లింగ్ ప్రధాని మోడీని ప్రశ్నించిన వీడియోను ఆమె తన ‘X’‌లో పోస్ట్ చేస్తూ.. ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌’లో నార్వే మొదటి స్థానంలో ఉంటే, భారత్ 157వ స్థానంలో ఉంది. ప్రజాస్వామ్య సమాజంలో పాలకులను ప్రశ్నించడమే జర్నలిస్టుల విధి అని రాసుకొచ్చారు.

విదేశాంగ శాఖ ఘాటు కౌంటర్

అయితే, ఈ పంచాయితీకి ఎండ్ కార్డు పడలేదు. విషయం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) నిర్వహించిన అధికారిక మీడియా బ్రీఫింగ్‌కు కూడా చేరింది. అక్కడ జర్నలిస్ట్ హెల్లే లింగ్ భారత అధికారులను ఉద్దేశించి.. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు, పత్రికా స్వేచ్ఛ ఆంక్షలతో అంతర్జాతీయ సమాజం మిమ్మల్ని ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. అందుకు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సీబీ జార్జ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్‌కు 5 వేల ఏళ్ల నాగరికత ఉందని, ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థలు, రాజ్యాంగ విలువలు తెలియకుండా గుడ్డిగా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను పట్టుకుని విమర్శించడం సరికాదని సమాధానం ఇచ్చారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్ వార్

ప్రధాని మోడీని ప్రశ్నించిన అనంతరం జర్నలిస్ట్ హెల్లే లింగ్‌పై సోషల్ మీడియాలో భారత నెటిజన్లు, బీజేపీ మద్దతుదారులు, ఇతరులు ఆమెపై ముప్పేట ట్రోలింగ్‌కు దిగారు. హెల్లే లింగ్ చైనా ఏజెంట్ అని, భారత్‌ను అబాసుపాలు చేయడానికి అపాయింట్ చేసిన ఓ విదేశీ ‘స్పై’ అని ఆరోపణలు గుప్పించారు. అందుకు ఆమె స్పందిస్తూ.. ‘నేను ఎలాంటి విదేశీ ప్రభుత్వానికి సంబంధించిన ‘స్పై’ కాను. నా వృత్తి జర్నలిజం మాత్రమే’ అని క్లారిటీ ఇచ్చారు. ఈ దెబ్బతో ఆమె అంతకుముందు కేవలం 800 మంది ఫాలోవర్లను మాత్రమే కలిగి ఉండగా.. ఈ ఒక్క కామెంట్‌తో ఆమె ఫాలోవర్ల సంఖ్య 17 వేలు దాటడం విశేషం.

ప్రెస్ ఫ్రీడమ్‌పై జరిగిన ఈ వివాదం అంతర్జాతీయంగా భారత్ మీడియా స్వేచ్ఛపై చర్చను రేకెత్తించింది. ప్రజాస్వామ్య విలువలు, పత్రికా స్వేచ్ఛపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న ఈ సంఘటన ఇంకా కొనసాగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.