|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీకు నిరంతరం తలనొప్పి, నీరసమా? మెదడు మబ్బుగా ఉందా? షాకింగ్ నిజం: కారణం డీహైడ్రేషనే!

Published: 06-07-2026, 5:00 AM
మీకు నిరంతరం తలనొప్పి, నీరసమా? మెదడు మబ్బుగా ఉందా? షాకింగ్ నిజం: కారణం డీహైడ్రేషనే!
  • తలనొప్పి, నీరసం, చిరాకు, ఏకాగ్రత లోపం బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు.
  • మైల్డ్ డీహైడ్రేషన్ బ్రెయిన్ ఫాగ్‌కు ప్రధాన కారణం: డా. రవీందర్ రెడ్డి.
  • మెదడులో 75% నీరు ఉంటుంది, నీటి కొరత మెదడు పనితీరును దెబ్బతీస్తుంది.
  • డీహైడ్రేషన్ రక్త ప్రసరణ, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది.

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో బ్రెయిన్ ఫాగ్ సర్వసాధారణం. తలనొప్పి, నీరసం, ఏకాగ్రత లోపం వంటి లక్షణాలకు ఒత్తిడి కారణం అనుకుంటాం. కానీ, మైల్డ్ డీహైడ్రేషన్ దీనికి ప్రధాన కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు ఏమిటి?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘బ్రెయిన్ ఫాగ్’ అనేది చాలా మందిలో సర్వసాధారణంగా కనిపిస్తోంది. తరచుగా తలనొప్పి రావడం, పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, చిన్న విషయాలకే విపరీతమైన కోపం లేదా చిరాకు రావడం, రాత్రిపూట ఎంత బాగా నిద్రపోయినా ఉదయం లేవగానే ఒంట్లో ఓపిక లేనట్లు అనిపించడం.. వీటన్నింటినీ బ్రెయిన్ ఫాగ్ లక్షణాలుగా చెబుతారు.

సాధారణంగా ఇలాంటి లక్షణాలు కనిపించగానే అందరూ ఒత్తిడి, పనిభారం లేదా నిద్రలేమి అనుకుంటారు. కానీ, వీటన్నింటికీ వెనుక మనం తరచుగా నిర్లక్ష్యం చేసే ‘మైల్డ్ డీహైడ్రేషన్ ‘ (శరీరంలో నీటి శాతం తగ్గడం) ఒక ముఖ్య కారణం కావచ్చని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిటల్స్ జనరల్ సర్జరీ, ట్రామా అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బి. రవీందర్ రెడ్డి స్పష్టం చేశారు. శరీరంలో నీటి కొరత మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, బ్రెయిన్ ఫాగ్‌కు డీహైడ్రేషనే కారణమని చెప్పే 5 ముఖ్యమైన లక్షణాలను ఆయన వివరించారు.

మన మెదడులో దాదాపు 75 శాతం నీరు ఉంటుంది. అందువల్ల, శరీరంలో నీటి పరిమాణంలో జరిగే చిన్నపాటి మార్పులను కూడా మెదడు వెంటనే గ్రహిస్తుంది.

“మెదడుకు తగినంత రక్త ప్రసరణ జరగడానికి, అవసరమైన పోషకాలు, ఆక్సిజన్ అందడానికి, మెటబాలిక్ వ్యర్థాలను తొలగించడానికి, శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, నరాల కణాల మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా సాగడానికి నీరు చాలా అవసరం,” అని డాక్టర్ రెడ్డి తెలిపారు.

శరీరంలో ద్రవాల శాతం తగ్గినప్పుడు, రక్త పరిమాణం క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల రక్త ప్రసరణ వేగం మందగించి, మెదడు తన రోజువారీ సాధారణ విధులను నిర్వహించడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. అదే సమయంలో, నరాల సంకేతాల ప్రసారానికి అవసరమైన సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా తీవ్రమైన డీహైడ్రేషన్ స్థాయికి చేరకముందే.. ఏకాగ్రత లోపించడం, ఆలోచనా శక్తి మందగించడం, తలనొప్పి, మూడ్ మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

1. రోజంతా ఏదో తెలియని అయోమయం (మెంటల్ ఫాగ్)

మెదడుపై డీహైడ్రేషన్ ప్రభావం

డీహైడ్రేషన్ వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది. “తాము ఏం చేయాలో స్పష్టంగా తెలిసినప్పటికీ.. స్పష్టంగా ఆలోచించలేకపోవడం, ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోవడం లేదా చిన్న చిన్న విషయాలను కూడా సులభంగా మర్చిపోవడం జరుగుతుంది. సాధారణంగా శ్రమ లేకుండా చేసే పనులు కూడా మానసికంగా ఎంతో భారంగా అనిపిస్తాయి,” అని డాక్టర్ రెడ్డి వివరించారు. ఇది కేవలం అలసట కాదు, మెదడు తన పూర్తి సామర్థ్యంతో పని చేయలేకపోతోందనడానికి సంకేతం.

2. ఆఫీస్ పనిలో ఉన్నప్పుడు తరచుగా తలనొప్పి రావడం

కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చుని పని చేస్తున్నప్పుడు లేదా ఎండలో తిరిగినప్పుడు క్రమంగా తలనొప్పి వస్తుంటే దానికి డీహైడ్రేషన్ కారణం కావచ్చు. శరీరం లో నీటి స్థాయిలు తగ్గినప్పుడు మెదడు చుట్టూ ఉండే ద్రవాల సమతుల్యత దెబ్బతిని, రక్తనాళాల్లో వచ్చే మార్పుల వల్ల తలనొప్పి వస్తుంది. చాలా మంది దీనికి కారణం తెలుసుకోకుండా నేరుగా పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, కానీ ఒక గ్లాస్ నీళ్లు తాగడం వల్ల ఈ సమస్య సులభంగా తగ్గుతుంది.

3. రాత్రంతా నిద్రపోయినా ఉదయాన్నే అలసటగా అనిపించడం

నిరంతర అలసటకు కేవలం నిద్రలేమే కారణం కాదు, హైడ్రేషన్ కూడా అంతే ముఖ్యం. డీహైడ్రేషన్ వల్ల రక్త పరిమాణం తగ్గినప్పుడు, శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్, పోషకాలను చేరవేయడానికి గుండె మరింత వేగంగా, కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. కణాల జీవక్రియ కూడా మందగిస్తుంది. ఫలితంగా, రాత్రి బాగా నిద్రపోయినా సరే ఉదయం లేవగానే శారీరకంగా, మానసికంగా తీవ్రమైన నీరసం ఆవహిస్తుంది.

4. కారణం లేకుండా చిరాకు, ఆందోళన కలగడం

నీటి కొరతతో మానసిక అయోమయం

నీరు తాగడానికి, మన మానసిక స్థితికి సంబంధం ఉందని చాలా మందికి తెలియదు. కానీ స్వల్ప డీహైడ్రేషన్ సైతం మూడ్‌ను దెబ్బతీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనివల్ల కారణం లేకుండానే విపరీతమైన చిరాకు రావడం, పనిపై ఆసక్తి తగ్గడం, తెలియని ఆందోళన లేదా మానసిక అలసట కలగడం జరుగుతుంది. ఆఫీసులో పని ఒత్తిడి వల్లే ఇలా జరుగుతుందని భ్రమపడతాం, కానీ అసలు కారణం శరీరానికి సరిపడా నీరు అందకపోవడమే.

5. మధ్యాహ్నం కాగానే ఉత్పాదకత పడిపోవడం

“రోజూ మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయానికి మీ ఏకాగ్రత పూర్తిగా తగ్గిపోవడం, మీటింగ్స్‌లో ఏం చెప్తున్నారో అర్థం కాకపోవడం లేదా నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతుంటే దానికి డీహైడ్రేషన్ ఒక కారణం,” అని డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు.

భారతదేశం వంటి ఉష్ణమండల దేశాల్లో ఎక్కువ సమయం ఎండలో ప్రయాణించడం, బిజీ షెడ్యూల్స్ వల్ల సకాలంలో నీళ్లు తాగకపోవడం వంటి కారణాల వల్ల రోజు గడిచేకొద్దీ మెదడు పనితీరుపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి, మెదడు చురుగ్గా పని చేయాలన్నా, బ్రెయిన్ ఫాగ్ సమస్య నుంచి బయటపడాలన్నా రోజంతా క్రమం తప్పకుండా తగినంత నీరు, ద్రవపదార్థాలను తీసుకోవడం ఎంతో అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More

బ్రెయిన్ ఫాగ్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, తగినంత నీరు తాగడం ద్వారా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడం ద్వారా మానసిక స్పష్టతను, ఏకాగ్రతను మెరుగుపరచుకోవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.