|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఒరాకిల్ లో ఊహించని కుదుపు! 30 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధం!

Published: 06-03-2026, 3:35 AM
ఒరాకిల్ లో ఊహించని కుదుపు! 30 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధం!
  • ఒరాకిల్ సంస్థలో సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం.
  • AI డేటా సెంటర్ల విస్తరణ కోసం ఓరాకిల్ భారీగా అప్పులు చేసింది.
  • లేఆఫ్స్ ద్వారా $8 నుండి $10 బిలియన్ల నగదును ఆదా చేయాలని లక్ష్యం.
  • ఒరాకిల్ స్టాక్ విలువ 54 శాతం పడిపోయి, మార్కెట్ క్యాప్ కోల్పోయింది.

ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ భారీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒప్పందాల కారణంగా సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.

ఒరాకిల్ సంస్థలో భారీ లేఆఫ్స్ వెనుక కారణం?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలు తమ కంపెనీలలో ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) ఏఐ కోసం చేసుకున్న ఒప్పందం కారణంగా భారీ లేఆఫ్స్ చేయాలని నిర్ణయించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఈ సంస్థ చరిత్రలోనే అతిపెద్ద పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒరాకిల్ సంస్థలో సుమారు 30,000 మంది ఉద్యోగులను తొలగించే దిశగా అడుగులు వేస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో చేస్తున్న భారీ ఖర్చులు, ప్రస్తుతం సంస్థను తీవ్ర నగదు కొరత లోకి నెట్టడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నెలలోనే ప్రారంభం కానున్న ఈ లేఆఫ్స్ ద్వారా సంస్థ వేల కోట్ల రూపాయలను ఆదా చేయాలని భావిస్తోంది.

ఆర్ధిక సంక్షోభం నుండి గట్టెక్కేందుకు ఒరాకిల్ చర్యలు

సామ్ ఆల్ట్‌మాన్‌కు చెందిన OpenAI సంస్థతో కుదుర్చుకున్న $300 బిలియన్ల భారీ భాగస్వామ్య ఒప్పందం ఓరాకిల్‌పై పెను భారాన్ని మోపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఏఐ డేటా సెంటర్ల విస్తరణ కోసం ఓరాకిల్ గత రెండు నెలల్లోనే సుమారు $58 బిలియన్ల కొత్త అప్పులు చేసింది. టెక్సాస్, విస్కాన్సిన్ వంటి ప్రాంతాల్లో భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం చేస్తున్న ఈ వ్యయం వల్ల సంస్థ మొత్తం అప్పు ఇప్పుడు $100 బిలియన్లకు పైగా చేరింది. ఏఐ మౌలిక సదుపాయాల కోసం చేస్తున్న ఈ మితిమీరిన ఖర్చులపై ప్రస్తుతం వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లేఆఫ్స్ తరువాత ఒరాకిల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది?

ఈ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒరాకిల్ పలు కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు ద్వారా దాదాపు $8 నుండి $10 బిలియన్ల నగదును ఆదా చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. దీనితో పాటు తన క్లౌడ్ విభాగంలో నియామకాలను నిలిపివేయడమే కాకుండా, కొత్త కస్టమర్ల నుంచి 40 శాతం వరకు అడ్వాన్స్ పేమెంట్లను కోరుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి వల్ల గత సెప్టెంబర్ నుండి ఒరాకిల్ స్టాక్ విలువ దాదాపు 54 శాతం పడిపోయి, సుమారు $463 బిలియన్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయినట్లు విశ్లేషకులు గుర్తించారు. మార్చి 10న విడుదల కానున్న ఆర్థిక ఫలితాల తర్వాత ఈ లేఆఫ్స్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

ఒరాకిల్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సంస్థ భవిష్యత్తును ఏ విధంగా మారుస్తాయో వేచి చూడాలి. మార్కెట్ నిపుణులు ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.