
📌 Key Points
- బెంగళూరులోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థినికి ఐ లవ్ యూ చెప్పిన ప్రొఫెసర్ ఘటన.
- పీఈఎస్ యూనివర్సిటీలో విద్యార్థిని ఉగ్రవాదితో పోల్చిన ప్రొఫెసర్ మురళీధర్ దేశ్‌పాండే.
- ప్రొఫెసర్ దేశ్‌పాండేను సస్పెండ్ చేసిన యూనివర్సిటీ యాజమాన్యం, విచారణకు ఆదేశం.
- యూనివర్సిటీ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని వైస్ ఛాన్సలర్ వ్యాఖ్య.
బెంగళూరులోని విద్యాసంస్థల్లో వరుస వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక ప్రొఫెసర్ విద్యార్థినికి ఐ లవ్ యూ చెప్పడం, మరొకరు విద్యార్థిని ఉగ్రవాదిగా దూషించడం సంచలనంగా మారింది. ఈ ఘటనలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినికి ఐ లవ్ యూ చెప్పిన ప్రొఫెసర్
స్టూడెంట్స్ కు మార్గదర్శకులుగా ఉండి జీవితంలో వారు పైకి ఎదిగేందుకు దోహదపడాల్సిన ప్రొఫెసర్లు వరుసగా వివాదాల్లో మునుగుతున్నారు. మొన్న బెంగళూరులోని (Bengaluru) సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో క్లాసులో అందరి ముందే యువతికి లవ్ ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్ ఘటన మరువక ముందే తాజాగా మరో ప్రొఫెసర్ తరగతి గదిలో ఓ స్టూడెంట్ పై మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ అతడిని ఉగ్రవాదితో పోల్చడం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. మంగళవారం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఉగ్రవాదిగా విద్యార్థిని దూషించిన ప్రొఫెసర్
జాతీయ మీడియా కథనాలు, తరగతి గది రికార్డింగ్ చేయబడినట్లు చెప్పబడుతున్న వీడియో ప్రకారం డాక్టర్ మురళీధర్ దేశ్‌పాండే అనే ప్రొఫెసర్ బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయంలో (PES University) ఒక ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఆయన తరగతి గదిలో మైనారిటీకి చెందిన అఫాన్ అనే విద్యార్థిపై మతపరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అఫాన్ అనే విద్యార్థి ఒకరిని కలవడానికి తరగతి గది నుండి బయటకు వెళ్లేందుకు అనుమతి కోరాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్టర్ మురళీధర్ దేశ్‌పాండే షర్మ్ నహీ ఆతీ (నీకు సిగ్గు లేదా)? అని అని అరుస్తూ ఆ విద్యార్థిని టెర్రరిస్టు అని పిలిచాడు. అంతటితో ఆగకుండా ఇరాన్ యుద్ధానికి నీలాంటి వాళ్లే కారణమని, డొనాల్డ్ ట్రంప్ వచ్చి నిన్ను తీసుకెళ్తారని వ్యాఖ్యానించారు. నువ్వు నరకానికి వెళ్తావు అంటూ వ్యాఖ్యానించారు
ప్రొఫెసర్ పై చర్యలు తీసుకున్న యూనివర్సిటీ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం సదరు ప్రొఫెసర్‌ను తక్షణమే సస్పెండ్ చేసింది. అలాగే విచారణకు ఆదేశించింది. ఈ ఘటనపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్పందిస్తూ యూనివర్సిటీ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. సదరు ప్రొఫెసర్ చాలా ఏళ్లుగా అడ్జంక్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారని, ఆయన ఇలా ఎందుకు ప్రవర్తించారో అర్థం కావడం లేదని అన్నారు. అయితే బెంగళూరుకు చెందిన 50 ఏళ్ల అబ్దుల్ మహమ్మద్ నేలమంగళలోని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల క్లాస్ లో పాఠాలు భోధిస్తు యువతిని అందరి ముందే క్లాసులో ఐలవ్ యూ అంటూ ప్రపోజ్ చేశాడు. ఇప్పుడు అదే బెంగళూరులో పీఈఎస్ విశ్వవిద్యాలయంలో మరో ప్రొఫెసర్ వివాదంలో చిక్కుకోవడంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పవల్సిన వృత్తిలో ఉంటూ ఇలా వివాదాల జోలికి వెళ్లడం ఏంటనే చర్చ జరుగుతోంది.
ప్రొఫెసర్ల ప్రవర్తన విద్యారంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


