
📌 Key Points
- జీవన్ రెడ్డి మార్చి 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు.
- పార్టీలో గత 20 నెలలుగా మానసిక వేదనకు గురయ్యానని జీవన్ రెడ్డి తెలిపారు.
- ఎమ్మెల్యే సంజయ్‌కి ప్రాధాన్యం ఇవ్వడంపై జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
- తన భవిష్యత్ కార్యాచరణను కార్యకర్తలతో చర్చించిన తర్వాత ప్రకటిస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.
సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నారు. మార్చి 25న ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నారు.
రాజీనామాకు గల కారణాలు
జగిత్యాల నియోజకవర్గంలోని తన మద్దతుదారులకు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి లేఖ రాశారు. తాను మార్చి 25న పార్టీకి రాజీనామా చేయనున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు. గత 20 నెలలుగా పార్టీలో తాను మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. పదేపదే ఎదురైన అవమానాలు, నిందల కారణంగా కాంగ్రెస్‌తో తన అనుబంధాన్ని కొనసాగించలేకపోతున్నానని ఆ లేఖలో వివరించారు.
తన తదుపరి రాజకీయ అడుగును జీవన్ రెడ్డి వెల్లడించలేదు. స్థానిక నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలతో సంప్రదించిన తర్వాతే తన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుంటానని నొక్కి చెప్పారు. తన కార్యకర్తలకు నేరుగా విజ్ఞప్తి చేస్తూ.. ‘నా ఈ రాజకీయ ప్రయాణంలో మీ సహచర్యం, మార్గదర్శకత్వం అవసరం.’ అని లేఖలో రాశారు.
ఉమ్మడి రాష్ట్రంలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో మెుదటి నుంచి కీలక నేతగా ఉన్నారు. అయితే రానురాను పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతూ వచ్చారు. ఇందుకు కారణం ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ పార్టీ సంజయ్‌కి ప్రాధాన్యం ఇస్తుందని జీవన్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు.
జీవన్ రెడ్డి తదుపరి కార్యాచరణ
చివరకు జీవన్ రెడ్డి పార్టీని వీడే పరిస్థితికి వచ్చింది. ఇటీవలే జగిత్యాల పట్టణంలోని ఇందిరా భవన్‌గా పిలిచే జీవన్ రెడ్డి నివాస ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు. జగిత్యాల జిల్లాలో పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలను విస్మరించి, పార్టీలోకి కొత్తగా చేరిన వారికి అనవసరమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ జీవన్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.
ఇటీవల జరిగిన జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కొత్తగా చేరిన వారికే సీట్లలో ఎక్కువ భాగం కేటాయించడంపై ఆయన తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ విషయం హైదరాబాద్ వరకూ వచ్చింది. ఈ క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనుచరులపై ఆయన తన విమర్శల దాడిని మరింత తీవ్రతరం చేశారు.
పార్టీలో అసంతృప్తి జ్వాలలు
తాను ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నానని సంజయ్ కుమార్ చెబుతున్నప్పటికీ.. గత నెలలో చొప్పదండిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ వేదికపై సంజయ్ కుమార్ కనిపించడం జీవన్ రెడ్డి అనుచరులకు ఆగ్రహం తెప్పించింది.
కార్యకర్తలు, తన అనుచరుల కోసం కాంగ్రెస్ పార్టీతో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్న తన అనుబంధాన్ని తెంచుకోవడానికి జీవన్ రెడ్డి సిద్ధమయ్యారు. తన తదుపరి రాజకీయ అడుగుపై జీవన్ రెడ్డి ఎలాంటి ప్రకటన చేయలేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులు జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి ప్రయత్నించినప్పటికీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు.
జీవన్ రెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఆయన తదుపరి రాజకీయ అడుగు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి. రాజకీయ వర్గాల్లో దీనిపై చర్చ జరుగుతోంది.


